ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ దోపిడీ

ABN , First Publish Date - 2021-05-18T03:35:20+05:30 IST

కొవిడ్‌ బాధితు లకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. బాధితుడు ఆస్పత్రిలో చేరింది మొదలు అడ్డగోలుగా డబ్బులు గుంజుతూనే ఉన్నారు. రోజుకు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తు న్నారు. చికిత్స పూర్తయ్యేలోపు ఒక్కో రోగిపై రూ.7 లక్షల వరకు వసూలు చేసిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ దోపిడీ
రెమ్‌డెసివిర్‌ బ్లాకులో విక్రయిస్తున్న నిందితుల అరెస్టు

కరోనా బాధితుల పట్ల కనికరం చూపని యాజమాన్యాలు

లక్షల్లో బిల్లులు

తల్లడిల్లుతున్న కొవిడ్‌ కుటుంబాలు

పైసలిస్తేనే మృతదేహాల అప్పగింత

అధికధరలకు రెమ్‌డెసివిర్‌ విక్రయాలు

మంచిర్యాల, మే 17 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ బాధితు లకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. బాధితుడు ఆస్పత్రిలో చేరింది మొదలు అడ్డగోలుగా డబ్బులు గుంజుతూనే ఉన్నారు. రోజుకు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తు న్నారు. చికిత్స పూర్తయ్యేలోపు ఒక్కో రోగిపై రూ.7 లక్షల వరకు వసూలు చేసిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. జిల్లా కేంద్రంలో కొవిడ్‌కు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు 25 వరకు ఉండగా, వాటిలో పేరున్న నాలుగైదు మినహా మిగిలిన అన్ని దవాఖానాల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. కేవ లం కొవిడ్‌కు చికిత్స అందించేందుకే 10 వరకు ఆస్పత్రులు నెలకొల్పడం గమనార్హం. జిల్లాలో రోజుకు సగటున 400 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా 20 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌ ఆస్ప త్రులకు మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల బాధితుల తోపాటు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున రోగులు తరలి వస్తున్నారు. పాజిటివ్‌ కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకే బాధితులు మొగ్గు చూపుతు న్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు చికిత్స పేరుతో అందినకాడికి దండుకుంటుండగా, బాధిత కుటుంబాలు ఆర్థిక భారం మోయలేక తల్లడిల్లుతున్నాయి.

పైసలిస్తేనే మృతదేహాల అప్పగింత...?

ఆస్పత్రుల్లో చేరి రోజుల తరబడి చికిత్స పొంది, చివరికి మృతి చెందినా ఫీజుల వసూలుకు వెనకాడ టం లేదు. ఆస్పత్రి బిల్లులు చెల్లించనిదే మృతదేహాలు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా, రైల్వేస్టేషన్‌ మధ్య ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 10 రోజుల క్రితం మహా రాష్ట్రకు చెందిన ఓ కొవిడ్‌ రోగి మృతి చెందాడు. అప్ప టికి నాలుగు రోజులుగా సదరు రోగి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటికే అతని కుటుంబ సభ్యులు రూ. 2 లక్షల పైచిలుకు బిల్లులు చెల్లించారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే మరో రూ.1.5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పడంతో చేసే దేమి లేక మృతదేహాన్ని అక్కడే వదిలి వారు వెళ్లిపో యారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం మున్సిపల్‌ కార్మికులకు మృతదేహాన్ని అప్పగించగా వారు అంత్య క్రియలు పూర్తి చేశారు. మరో సంఘటనలో ఐబీ చౌరస్తా సమీపంలోని ఓ ఆస్పత్రిలో మహారాష్ట్రకు చెం దిన కొవిడ్‌ రోగి చికిత్స నిమిత్తం చేరాడు. ఐదు రోజులపాటు చికిత్స పొందగా బాధితుడు కోలుకున్నాక రూ. 7.5 లక్షలు బిల్లులు వేశారు. దీంతో కాళ్లవేళ్లపడి ఉన్నంత చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే తనకు మామూలు లక్షణాలు ఉన్నాయని చెప్పినా వినకుండా అత్యవసర చికిత్స పేరుతో ఐదు రోజులు ఉంచుకోవడమేగాక లక్షల బిల్లులు వసూలు చేశారని బాధితుడు పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే చికిత్సకు సంబంధించిన రిపో ర్టులు, బిల్లులు ఇవ్వకపోవడం గమనార్హం. 

కృత్రిమ కొరత పేరుతో అక్రమ వసూళ్లు...

కొవిడ్‌ రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందజేసే ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లలో ఆస్పత్రి వర్గాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో చేరే బాధితుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తున్న  నిర్వాహకులు ఎంత వసూలు చేయాలో ముందుగానే ఓ నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు దఫాలుగా ఫీజులు కట్టించుకుంటున్నట్లు సమాచారం. అక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కావాలంటూ రోగి సంబంధీ కులను అలోచించుకునే సమయం ఇవ్వకుండా అయో మయానికి గురి చేస్తూ రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్లాక్‌లో కొనాల్సి వస్తుందని చెబుతూ అడ్డగోలుగా గుంజుతున్న ట్లు సమాచారం. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా కేంద్రంలోని హెల్త్‌కేర్‌, పల్స్‌ హాస్పిటళ్లకు చెందిన ఇద్దరు సిబ్బంది తోపాటు మరో ఇద్దరు అంబులెన్స్‌ల నిర్వాహకులు ముఠాగా ఏర్పడి  రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అధిక ధర లకు బ్లాక్‌లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకు న్నారు. ఈ సంఘటనతో  ఆస్పత్రుల నిర్వాహకుల పాత్ర ఉందని స్పష్టమవుతోంది.

 

Updated Date - 2021-05-18T03:35:20+05:30 IST