టీఆర్‌ఎ్‌సలో భారీగా అసమ్మతి

ABN , First Publish Date - 2022-08-09T09:57:11+05:30 IST

టీఆర్‌ఎ్‌సలో విపరీతమైన అసమ్మతి ఉందని, త్వరలోనే అది పేలడం ఖాయమని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు అన్నారు.

టీఆర్‌ఎ్‌సలో భారీగా అసమ్మతి

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై కేసీఆర్‌ తప్పుడు ప్రచారం


అవినీతిపై కచ్చితంగా ఈడీ విచారణ

ధరలపై చర్చకు సిద్ధమా?: మురళీధర్‌

ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్‌

21 తర్వాత మరిన్ని చేరికలు: ఈటల


చిన్నచింతకుంట/హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సలో విపరీతమైన అసమ్మతి ఉందని, త్వరలోనే అది పేలడం ఖాయమని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారానే వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని కేసీఆర్‌ నమ్ముతున్నారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై కూడా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న కేసీఆర్‌.. గోబెల్స్‌ ప్రచారానికి తెర తీశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కచ్చితంగా ఈడీ విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిస్తే.. అవినీతికి అనుమతి ఇచ్చినట్టా? అని నిలదీశారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ హాజరై ఉంటే, పంటల మార్పిడి గురించి మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు. ద్రవ్యోల్బణం, ధరలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని, కేసీఆర్‌ సిద్ధమేనా? అని సవాల్‌ విసిరారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పాకిస్తాన్‌ కూడా కేసీఆర్‌ మాదిరిగా అబద్ధపు ప్రచారం చేయదని మండిపడ్డారు. కాగా, టీఆర్‌ఎ్‌సలో చాలా మంది ఎమ్మెల్యేలు సమయం కోసం చూస్తున్నారని, తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి కేసీఆర్‌కు లేదని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఈ నెల 21 తర్వాత బీజేపీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంటలో నిర్వహించిన ‘ప్రజాగోస- బీజేపీ భరోసా’లో ఆయన మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి రోషమున్న వ్యక్తి అని, ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పదవికి రాజీనామా చేశారని అన్నారు. మునుగోడులోనూ హుజూరాబాద్‌ ఫలితమే పునరావృతమవుతుందని స్పష్టం చేశారు. ‘‘నీకే కాదు బిడ్డా.. మాకు కూడా ఎత్తులు వేయడం వచ్చు’’అని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.  

Updated Date - 2022-08-09T09:57:11+05:30 IST