Abn logo
Nov 25 2021 @ 03:02AM

గోనెసంచుల కొను‘గోల్‌మాల్‌’!

  • పాతబస్తాల కొనుగోలులో భారీ అవినీతి.. 
  • ధరలు పెంచి కొంటున్న పౌరసరఫరాల సంస్థ
  • 10 కోట్ల గోనెసంచులకు టెండర్‌
  • ఒక్కో సంచి ధర రూ.30.25 ఓపెన్‌ మార్కెట్‌ ధర రూ.26
  • రూ.2 కమీషన్‌ కోసం ధరలు పెంపు!


హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల సంస్థ పెద్దలకు పాత బస్తాలు కాసుల పంట పండిస్తున్నాయి. రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని నింపేందుకు వినియోగించే గోనెసంచుల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గోనెసంచుల కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ కోసం కక్కుర్తిపడి.. వాటి ధరను మార్కెట్‌ రేటు కన్నా ఎక్కువకు కొనుగో లు చేస్తున్నారు. సంస్థపై ఆర్థికభారం మోపుతున్నారు. ఒక్కో బస్తాకు రూ.2 చొప్పున కమీషన్‌ పొందేందుకు మార్కెట్‌ ధర కన్నా రూ.4 పెంచారు. దీంతో సంస్థ పె ద్దల జేబుల్లోకి రూ.20 కోట్లు రాగా, సంస్థపై సుమారు రూ.90 కోట్లకు పైగా భారం పడుతున్నట్లు తెలుస్తోం ది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించే ధాన్యం నింపేందుకు గోనెసంచులను వినియోగిస్తారు. కాగా, ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రం నుంచి 40లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోవటానికి ఎఫ్‌సీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టా ర్గెట్‌ పూర్తి కావాలంటే 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యం సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు 15 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయి. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. ఒక సీజన్‌లో ధాన్యం కొనుగోలుకుగాను 54 శాతం కొత్త గోనెసంచులు, 46 శాతం పాత గోనెసంచు లు వినియోగించాల్సి ఉంది. అయితే కొత్త గోనె సంచులను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి పంపిస్తుంది. పాత సంచులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ నుంచి, రేషన్‌ డీలర్ల నుంచి కొనుగోలు చేస్తుంది. 


కేంద్రం నుంచి కొత్త గోనెసంచులు..

 ఈసారి ఎఫ్‌సీఐ ఇచ్చిన టార్గెట్‌కు మించి ఽధాన్యం సేకరణ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొత్త గోనెసంచులను 8.10 కోట్లకు బదులుగా 14 కోట్లు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ, కేంద్రం ఇప్పటివరకు కేవలం 6.40 కోట్ల గోనె సంచులు మాత్రమే పంపించింది. రాష్ట్ర ప్రభు త్వం ఈ వానాకాలం సీజన్‌కు 10 కోట్ల పాత గోనెసంచులను కాంట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను అక్టోబరు 7న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. గత కొన్నేళ్లుగా ఈ కార్పొరేషన్‌కు గన్నీ బ్యాగులు సరఫరా చేస్తూ పౌరసరఫరాల సంస్థ పెద్దలకు, అధికారులకు సుపరిచితులైన కాంట్రాక్టర్లే ఈ టెండర్లలోనూ పాల్గొన్నారు. ఒక్కో పా త గోనెసంచికి రూ.30.25 చొప్పున 10 కోట్ల పాత గోనె సంచులను రూ.302.50 కోట్లకు సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. 


మార్కెట్‌ ధర రూ.26 మాత్రమే..

సాధారణంగా రేషన్‌ డీలర్లు బియ్యం విక్రయించిన తర్వాత.. ఆ పాత బస్తాలను మార్కెట్లో అమ్ముకోవద్ద ని, తిరిగి పౌరసరఫరాల శాఖకే అప్పగించాలనే నిబంధన పెట్టారు. దీంతో రేషన్‌ డీలర్లు పాత గోనెసంచులను బియ్యం గోదాముల (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లలో అప్పగిస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో సంచికి రూ.21 చొప్పున రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చెల్లిస్తోంది. ఓపెన్‌ మార్కెట్‌లోనైతే బస్తాకు రూ.26 చొప్పున ధర ఉంది. దీంతో తమకు అదే రేటు ఇవ్వాలని రేషన్‌ డీలర్లు డి మాండ్‌ చేస్తున్నారు. కానీ, మార్కెట్‌ ధర కంటే రూ.5 తక్కువకు డీలర్లనుంచి పాత బస్తాలు కొంటున్నారు. టెండర్‌ ధరను మాత్రం రూ.30.25కు కట్టబెట్టారు. రేషన్‌ డీలర్‌కు ఇచ్చే ధరతో పోలిస్తే ఒక్కో ఖాళీ బస్తాకు రూ.9.25 అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 కోట్ల బస్తాలకు రూ.92.50 కోట్ల ఆర్థికభారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై పడుతోంది. 


ఇక బహిరం గ మార్కెట్‌ ధర రూ.26 ప్రకారం చూస్తే... ఒక్కో బస్తా కు రూ.4.25 పైసల చొప్పున ధర ఎక్కువ పెట్టారు. మార్కెట్‌ ధర లెక్కన చూస్తే రూ.42 కోట్ల అదనపు భారం సంస్థపై పడుతోంది. అయితే ఒక్కో గోనెసంచి మీద రూ.2.00 గుడ్‌విల్‌ ఇచ్చేలా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ పెద్దలకు, గన్నీబ్యాగులు సరఫరాచేసే కాంట్రాక్టర్లకు మధ్యం ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. 10 కోట్ల పాత బస్తాలకుగాను రూ.2 చొప్పు న రూ.20 కోట్లను కాంట్రాక్టర్లు ముట్టజెప్పినట్లు ప్రచా రం జరుగుతోంది. ఈ భారీ మొత్తం ఎవరెవరి చేతు లు మారి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. కోటా కేటాయింపుల విషయంలో కాంట్రాక్టర్ల మధ్య అభిప్రా య బేధాలు రావడంతో వ్యవహారం బయటకు పొక్కిం ది. 2020-21వానాకాలం సీజన్‌లోనూ 3.66కోట్లు, యా సంగిలో 8.21 కోట్లు కలిపి 11.87కోట్ల పాత గోనెసంచులను పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. అప్పు డూ రూ.2 గుడ్‌విల్‌ దందా జరిగినట్టు వినికిడి.

తెలంగాణ మరిన్ని...