భూమ్‌ఫట్‌

ABN , First Publish Date - 2021-12-20T08:29:48+05:30 IST

భూమ్‌ఫట్‌

భూమ్‌ఫట్‌

ప్రభుత్వ భూమి పరుల పరం!

1,500 కోట్ల విలువైన 5 వేల ఎకరాలు 

ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు

నెల్లూరు జిల్లాలో భారీ అవినీతి

కలిసొచ్చిన గ్రాంట్‌ అప్రూవల్‌ విధానం

రాష్ట్ర ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి

రిజిస్ట్రేషన్‌ అధికారులపై చర్యలకు సిఫారసులు

చర్యలను అడ్డుకొంటున్న వైసీపీ నాయకులు


సుమారు 1,500 కోట్ల రూపాయల విలువచేసే 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసేశారు. నెల్లూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఈ భారీ అవినీతి వెలుగుచూసింది. అవినీతి నిరోధక శాఖ నివేదికల ప్రకారం విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలోని సంబంధిత సబ్‌రిజిస్ర్టార్లతోపాటు ఆ శాఖకు చెందిన ముగ్గురు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపి కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు లేవు. ఈ అవినీతి అధికారులకు అధికార పార్టీ నాయకులు కొమ్ముకాస్తూ వారిపై వేటుపడకుండా కాపాడుకొంటూ వస్తుండటమే కారణం.


(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు రిజిస్ట్రేషన్‌ జిల్లాల పరిధిలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై సమగ్ర విచారణకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ రంగంలోకి దిగింది. జాయింట్‌ ఐజీ రవికుమార్‌ ఆరు నెలల క్రితం జిల్లాకు వచ్చి విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 50 డాక్యుమెంట్ల ద్వారా సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ర్టేషన్లు చేసినట్లు తేలింది. అలాగే, ఈ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ కింద 1.5 కోట్ల రూపాయలను తగ్గించినట్లు ధ్రువీకరించారు. మరోవైపు 250 రిజిస్టర్‌ డాక్యుమెంట్లను స్కాన్‌ చేయకుండా పక్కన పెట్టిన విషయాన్ని గుర్తించారు. ఇదే తరహాలో గూడూరు జిల్లా రిజిస్ర్టేషన్‌ కార్యాలయ పరిధిలో భారీగా ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. గడచిన రెండేళ్లలో నెల్లూరు జిల్లాలో సుమారు ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. గత రెండేళ్ల కాలంలో జిల్లాలో రూ.1500కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరాధీనం చేశారు. ఫలితంగా కోట్ల రూపాయల ముడుపులు దండుకున్నారు. పరాధీనమైన ప్రభుత్వ భూముల్లో అత్యధికం రెసిడెన్షియల్‌ వాల్యూ కలిగినవే కావడం విశేషం. నెల్లూరు జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాల సమీపంలోని భూములు ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతున్నాయి. పరాధీనమైన 5వేల ఎకరాలకు ఎకరం రూ.30 లక్షలు లెక్కకట్టినా రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు పరమైనట్లు తెలుస్తోంది. 


ఏమిటీ గ్రాంట్‌ అప్రూవల్‌ విధానం?..

ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్లు గ్రాంట్‌ అప్రూవల్‌ అనే విధానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఎనీవేర్‌ అనే పద్ధతి ద్వారా ఏ ప్రాంతానికి చెందిన భూమినైనా మరో ప్రాంతానికి చెందిన రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అయితే ఆ భూమి పత్రాలను వారం రోజుల్లోపు ఆ భూమి ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోకి వస్తుందో అక్కడికి పంపుతారు. ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆ డాక్యుమెంట్లలో పేర్కొన్న సర్వే నెంబర్లను రికార్డులో పరిశీలించి వాటిలో ఎలాంటి వివాదం లేకుంటే ఓకే చేస్తారు. ఇలా ఓకే చేయడాన్నే గ్రాంట్‌ అప్రూవల్‌ అంటారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి నెల్లూరు జిల్లాలోని కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు ఈ పద్ధతినే వాడుకొని (ఒకరితో ఒకరు కుమ్మక్కై) భారీగా అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్లు, జిల్లా డీఐజీల సహకారంతో ఈ భారీ అవినీతికి తెరలేపినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు.  


అవినీతికి అధికార పార్టీ అండ!

ఈ కుంభకోణంలో సబ్‌ రిజిస్ట్రార్ల పాత్రతో పాటు ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్‌), ఆ శాఖకు చెందిన జిల్లా డీఐజీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు కొన్ని నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ముగ్గురు ఉన్నతాధికారులను తక్షణం విధుల నుంచి తప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఇందుకు బాధ్యులైన జిల్లా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు కొందరు కాపుకాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదిక బుట్టదాఖలవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ఇటీవలి కాలంలో కొంత మంది అధికార పార్టీ నాయకులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అక్రమ సంపాదనకు నిలయాలుగా మార్చుకున్నారని,  రిజిస్ర్టేషన్ల శాఖ ఽఅధికారుల అవినీతిలో వాటా తీసుకొంటున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నాయకుల అండదండలతోనే అక్రమాలు పెచ్చుపెరుగుతున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పదొపరకో తీసుకునే డాక్యుమెంట్‌ రైటర్లను రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిసరాల్లోకి కూడా రానివ్వకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని పరాధీనం చేస్తున్న అధికారుల విషయంలో మాత్రం రాష్ట్ర ఉన్నతాధికారుల నివేదికలు అందినా చర్యలు తీసుకోకపోవడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-12-20T08:29:48+05:30 IST