Doctor ఉద్యోగాలకు భారీ ఎత్తున అప్లికేషన్లు

ABN , First Publish Date - 2022-08-15T17:12:38+05:30 IST

ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టుల(MBBS Doctor Posts) భర్తీకి ఊహించినదాని కంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. గత నోటిఫికేషన్ల సమయంలో కంటే.. ప్రస్తుతం దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు వైద్య శాఖ(Medicine Department) వర్గాలు

Doctor ఉద్యోగాలకు భారీ ఎత్తున అప్లికేషన్లు

పోస్టులు 969.. దరఖాస్తులు 4,800

ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు ప్రభావం శూన్యం!

ఉద్యోగాలకు ముగిసిన దరఖాస్తు గడువు

తప్పులుంటే 17-24 వరకు ఎడిట్‌ ఆప్షన్‌


హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టుల(MBBS Doctor Posts) భర్తీకి ఊహించినదాని కంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. గత నోటిఫికేషన్ల సమయంలో కంటే.. ప్రస్తుతం దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు వైద్య శాఖ(Medicine Department) వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మొత్తం 969 ఎంబీబీఎస్‌ డాక్టర్‌ పోస్టులకు 4,800 మంది అప్లై చేశారు. చివరి రెండు రోజుల్లో2 వేలమంది కిపైగా దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా, వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,326 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో 357 ట్యూటర్‌ ఉద్యోగాలను వైద్య శాఖ వెనక్కు తీసుకుంది. ఆన్‌లైన్‌లో జూలై 23 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎంబీబీఎస్‌ అర్హతతో ఈ పోస్టులను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులే. ప్రారంభంలో రోజుకు 200 మంది కూడా దరఖాస్తు చేయలేదు. చివరి రెండ్రోజుల్లో మాత్రం భారీగా వచ్చాయి. మరోవైపు డాక్టర్‌ పోస్టులకు రాత పరీక్ష లేదు. కేవలం మెరిట్‌, వెయిటేజీ, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణ అవకాశం (ఎడిట్‌ ఆప్షన్‌) ఇచ్చారు. ఎమ్‌హెచ్‌ఎ్‌సఆర్బీ.తెలంగాణ.గౌ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక 2018లో ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో 525 ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టులను భర్తీ చేశారు. దరఖాస్తుకు నెల గడువిచ్చారు. రాత పరీక్ష లేకుండా, ఎంబీబీఎస్‌ మెరిట్‌ ఆధారంగా నియామకాలను చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు వెయిటేజీ కల్పించారు. 


ప్రైవేటు ప్రాక్టీసు వద్దనే నిబంధన ఉన్నా..

కొత్తగా సర్కారీ కొలువు(Government measure)ల్లో చేరే వైద్యులెవరూ ప్రైవేట్‌ ప్రాక్టీసు(Private practice) చేయకూడదనే నిబంధనను ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టింది. దీన్ని వైద్యులంతా వ్యతిరేకించారు. ఈ నిబంధనతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధి నిర్వహణకు ఎవరూ ముందుకురారని ఆందోళన వ్యక్తం చేశారు. అసలే వేతనాలు తక్కువని, ప్రైవేటు ప్రాక్టీసు కూడా రద్దు చేస్తే దరఖాస్తు చేసేవారే ఉండరన్నారు. కానీ ఈ అంచనాను తలకిందులు చేస్తూ భారీగా దరఖాస్తులొచ్చాయి. గతంలో ఒక్కో డాక్టర్‌ పోస్టుకు ముగ్గురు లేదా నలుగురే పోటీపడేవారని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ముగ్గురే పోటీ పడేవారని వైద్యవర్గాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా చేపట్టిన వైద్యుల భర్తీకి ఐదుగురు పోటీపడుతున్నారని.. ప్రైవేటు ప్రాక్టీసు చేయొద్దనే నిబంధన ప్రభావం పెద్దగా కనిపించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

Updated Date - 2022-08-15T17:12:38+05:30 IST