Wuhan నగరంలో కీలక నిర్ణయం.. మొట్టమొదటి కరోనా కేసు నమోదైన 20 నెలల తర్వాత..

ABN , First Publish Date - 2021-08-03T16:32:01+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా ఎంతటి కల్లోల పరిస్థితులను సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా జనజీవనం అంతా స్తంభించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే ఛిన్నాభిన్నమయ్యాయి.

Wuhan నగరంలో కీలక నిర్ణయం.. మొట్టమొదటి కరోనా కేసు నమోదైన 20 నెలల తర్వాత..

చైనా, బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా ఎంతటి కల్లోల పరిస్థితులను సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా జనజీవనం అంతా స్తంభించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే ఛిన్నాభిన్నమయ్యాయి. దీనికంతటికీ చైనాయే ప్రధాన కారణమనీ, ఆ దేశంలోనే వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే అసలు మతలబు ఉందంటూ పలు దేశాలు ఆరోపిస్తున్నాయి కూడా. దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైన చైనాలోని వూహాన్ నగరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అధికారులు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 


వూహాన్ నగరంలో మొట్టమొదటి కరోనా కేసు 2019వ సంవత్సరం డిసెంబర్ నెలలో నమోదయింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతూ వచ్చాయి. అది చైనాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింస్తూ వచ్చింది. వరుస లాక్‌డౌన్లతోనూ, వ్యాక్సిన్లతోనూ కరోనాను ప్రపంచ దేశాలు కాస్త కట్టడి చేస్తూ వస్తున్నాయి. వూహాన్‌లో కూడా కొద్ది నెలల క్రితం కరోనా కాస్త కంట్రోల్‌లోనే ఉంది. అయితే తాజాగా ఆ వూహాన్ నగరంలో డెల్టా వేరియంట్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయట. సోమవారం ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయని అక్కడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డెల్టా వేరియంట్ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందనీ, దీన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అరికట్టడం మంచిదని వూహాన్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వూహాన్ నగరంలోని ప్రతీ ఒక్క పౌరుడికి కరోనా టెస్టులను నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


‘వూహాన్ నగరంలో దాదాపు ఒక కోటి 10 లక్షల మంది పౌరులు ఉన్నారు. వారందరికీ కరోనా టెస్టులను చేయాలని నిర్ణయించాం. అత్యంత వేగంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం’ అంటూ వూహాన్ సీనియర్ అధికారి లీ టాయో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడాన్ని సాధ్యమయినంత మేరకు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బీజింగ్ నగరంలోని పౌరులకు ఇప్పటికే కరోనా టెస్టులను ఎక్కడికక్కడ చేస్తూ వస్తున్నారు. కరోనా కేసులను గుర్తించి వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-03T16:32:01+05:30 IST