మరో మూడు నెలలు మాస్కులు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-03-22T16:25:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరో మూడు మాసాల దాకా ప్రజలు మాస్కులు ధరించితీరాల్సిందేనని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు.

మరో మూడు నెలలు మాస్కులు తప్పనిసరి

మంత్రి సుబ్రమణ్యం


చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరో మూడు మాసాల దాకా ప్రజలు మాస్కులు ధరించితీరాల్సిందేనని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. చెన్నైలో సోమవారం ఉదయం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ల ద్వారా టీకాలు వేయడం వల్లే కరోనా బాధితులు ప్రాణగండం నుంచి బయటపడుతున్నారని, పదిరోజులకు పైగా రాష్ట్రంలో కరోనా బాధితులెవరూ మృతి చెందకపోవడం ఊరట కలిగిస్తోందని చెప్పారు. కరోనా నిరోధక టీకాల వల్ల ప్రజలలో రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందన్నారు.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ఆసియా దేశాలపైనే తీవ్రప్రభావం చూపుతోందని, ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పారు.


చైనాలోనూ మళ్ళీ వైరస్‌ ఉగ్రరూపం దాల్చడం, ఈ నెల 27  నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతుండటంతో మళ్లీ విదేశాల నుండి వచ్చేవారివల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం వుందని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజలందరూ మరో మూడు మాసాల వరకూ తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-22T16:25:26+05:30 IST