బోర్డు తిప్పేసిన ‘అగంతకుడు’... రైతులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివానంటూ..!

ABN , First Publish Date - 2021-01-23T21:09:50+05:30 IST

రైతు నేతలను చంపేందుకు వచ్చి పట్టుబడ్డానంటూ నిన్న మీడియా ముందు మాస్కు కట్టుకుని మాట్లాడిన వ్యక్తి ఇవాళ యూటర్న్ తీసుకోవడంపై...

బోర్డు తిప్పేసిన ‘అగంతకుడు’... రైతులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివానంటూ..!

న్యూఢిల్లీ: రైతు నేతలను చంపేందుకు వచ్చి పట్టుబడ్డానంటూ నిన్న మీడియా ముందు మాస్కు కట్టుకుని మాట్లాడిన వ్యక్తి ఇవాళ యూటర్న్ తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శుక్రవారం సోనిపట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి ఓ వీడియోలో అతడు పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు. తనకు ఏ పాపం తెలియదనీ.. రైతులు ముందుగా రాసిచ్చిన స్క్రిప్టునే తాను మీడియా ముందు చదివానంటూ సదరు వీడియోలో అతడు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో అసలైనదా కాదా అనేది పోలీసులు నిర్ధారించలేదు. కస్టడీలో అతడిని పూర్తిగా విచారించిన తర్వాత తాము మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం హర్యానాలోని సోనిపట్‌ క్రైం బ్రాంచ్ పోలీసులు 21 ఏళ్ల ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నట్టు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు. కాగా సోనిపట్‌కు చెందిన ఆ యువకుడికి ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. ‘‘అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. అతడిని ఎంత విచారించినా కుట్రపన్నినట్టు ఎలాంటి ఆధారాలు లభించడంలేదు. మరింత స్పష్టత కోసం తదుపరి విచారణ కొనసాగుతోంది..’’ అని ఆయన అన్నారు. కాగా శుక్రవారం రాత్రి సింఘు సరిహద్దు వద్ద రైతులు ఓ వ్యక్తిని మీడియా ముందుకు పట్టుకొచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే రోజు అతడు, అతడి అనుచరులు పోలీసుల మాదిరిగా నటిస్తూ రైతులపై లాఠీచార్జి జరపాలని చెప్పినట్టు అతడు నిన్న మీడియాతో చెప్పాడు. నలుగురు రైతులను చంపి, ఆందోళన చెడగొట్టేందుకు కుట్రపన్నినట్టు పేర్కొన్నాడు. సింఘు సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని రైతులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. 



Updated Date - 2021-01-23T21:09:50+05:30 IST