ముఖం చూపించే మాస్క్

ABN , First Publish Date - 2020-05-28T05:30:00+05:30 IST

సంక్షోభాన్ని జీవితంలో పైకెదగటానికి ఓ అవకాశంగా చూడాలన్న ప్రధాని మోదీ మాటను స్ఫూర్తిగా తీసుకున్నాడు కేరళకు చెందిన డిజిటల్‌ ఫొటోగ్రాఫర్‌ బినేష్‌ జీ పాల్‌.

ముఖం చూపించే మాస్క్

సంక్షోభాన్ని జీవితంలో పైకెదగటానికి ఓ అవకాశంగా చూడాలన్న ప్రధాని మోదీ మాటను స్ఫూర్తిగా తీసుకున్నాడు కేరళకు చెందిన డిజిటల్‌ ఫొటోగ్రాఫర్‌ బినేష్‌ జీ పాల్‌. కరోనా వల్ల మాస్క్‌లు పెట్టుకుంటే దగ్గరవాళ్లు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ‘‘అందుకే జనాల ముఖాలను వారు పెట్టుకునే మాస్క్‌లపైనే ప్రింట్‌ చేస్తే?’’ అనే ఆలోచన బినేష్‌కు వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టి మంచి బిజినెస్‌ చేస్తున్నాడు. ‘‘మాస్క్‌ పెట్టుకున్నా కూడా మన ముఖం కనిపిస్తే, జనాలు మనల్ని గుర్తుపట్టగలిగితే అంతకన్నా కావలసిందేముంది’’ అని జనం కూడా ఆలోచించడంతో ఈ మాస్క్‌లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. వాటిని తయారుచేయటంలో బినేష్‌ తలమునకలుగా ఉన్నాడు. 


అసలు ఈ ఆలోచన బినేష్‌కు ఎందుకు వచ్చిందంటే... ఇప్పుడు కరోనా వల్ల ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరిస్తున్నారు. ఏటీఎంల దగ్గరా, ఎయిర్‌పోర్టులు, పరీక్షాకేంద్రాల్లో తనిఖీల దగ్గరా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం బినేష్‌ దృష్టికి వచ్చింది. డిజిటల్‌ ఫొటోగ్రఫీలో తన పదేళ్ల అనుభవానికి పదును పెట్టాడు. జనాల ఇబ్బందులు తీర్చే కొత్తరకం మాస్క్‌ను కనిపెట్టాడు. 


ఇంతకీ ఈ మాస్క్‌లు ఎలా తయారుచేస్తారంటే ముందు హై రిజల్యూషన్‌ కెమెరాతో వ్యక్తిని ఫొటో తీస్తారు. ఇమేజ్‌ సైజ్‌ పెంచి ప్రత్యేకమైన పేపర్‌పైన ప్రింట్‌ తీస్తారు. మాస్క్‌ పెట్టుకున్నప్పుడు పైకి కనిపించని భాగం వరకూ కట్‌ చేసి అధిక ఉష్ణోగ్రత వద్ద క్లాత్‌ మాస్క్‌ పైన ప్రింట్‌ చేస్తారు. దవడ భాగాన్ని ముందుగానే కొలత తీసుకొంటారు కాబట్టి ముఖం భాగానికి కచ్చితంగా సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఖర్చు కూడా తక్కువే. ముఖం ప్రింట్‌ చేసిన మాస్క్‌ ఖరీదు 60 రూపాయలు మాత్రమే. దీంతో బినేష్‌కు కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు వస్తున్నాయి. 


‘‘టామ్‌ అండ్‌ జెర్రీ, మిక్కీ మౌస్‌, ఛోటా భీమ్‌ లాంటి కామిక్‌ క్యారెక్టర్లు, సినీ నటుల బొమ్మలు ఉన్న మాస్క్‌లు ఇప్పటిదాకా అమ్ముతున్నారు. అదే వారి ముఖాన్నే మాస్క్‌పైన ప్రింట్‌ చేస్తే చూసేవాళ్లు కూడా వారిని సులువుగా గుర్తుపడతారు కదా అనిపించింది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరూ ఇలా ట్రై చేయలేదు. నా ఐడియా పనిచేసింది. మొదటి రెండు రోజుల్లో వెయ్యి మాస్క్‌లు తయారుచేసి ఇచ్చాను. ఇంకో ఐదు వేల మాస్క్‌లకు ఆర్డర్లు ఉన్నాయి. ఇంకా చాలామంది అడుగుతున్నారు. అయినా మాస్క్‌ల నాణ్యత, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదు’’ అని తన విజయగాథను వివరించారు బినేష్‌.

Updated Date - 2020-05-28T05:30:00+05:30 IST