మాస్క్‌ .. మహరాజా!

ABN , First Publish Date - 2020-07-12T08:57:46+05:30 IST

కరోనా కాలం కొత్త అవసరాలను ముందుకు తెచ్చింది. కొన్నింటిని నిత్యావసరాలుగా మార్చివేసింది. మాస్కులు వాటిలో ఒకటి. తమను తాము కాపాడుకోవాలంటే మాస్క్‌

మాస్క్‌ .. మహరాజా!

  • జనం జాగ్రత్తపై జోరుగా దందా
  • కరోనా కాలంలో నయా ట్రెండు
  • గ్లామర్‌, స్టేట్‌సను పెంచే ధోరణి
  • 500కు 3 అంటూ ఓపెన్‌ ఆఫర్‌
  • కొవిడ్‌ నుంచి కట్టడి అంతంతే


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : కరోనా కాలం కొత్త అవసరాలను ముందుకు తెచ్చింది. కొన్నింటిని నిత్యావసరాలుగా మార్చివేసింది. మాస్కులు వాటిలో ఒకటి. తమను తాము కాపాడుకోవాలంటే మాస్క్‌ ధరించడం తప్పనిసరి అనే జాగ్రత్త జనాల్లో వ్యాపించింది. మంచిదే. అయితే, ఇదే పాయింట్‌పై రాష్ట్రంలో నయా బిజినెస్‌ మంచి జోరుగా సాగుతోంది. పునర్‌వినియోగానికి వీలయ్యేలా ఇంట్లోనే కాటన్‌ క్లాత్‌తో సొంతంగా మాస్క్‌లు తయారుచేసుకోవాలని కేంద్రం ప్రోత్సహిస్తూ ఏప్రిల్‌ 10న మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ విధానం మాస్క్‌ వ్యాపారులకు మరింత ఊతమిచ్చింది. మాస్క్‌లకు రకరకాల సృజనాత్మకతలను జోడించి కళ్లు చెదిరే ఆకర్షణలతో తయారు చేస్తున్నారు. సూపర్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌ దగ్గరి నుంచి పిల్లులు, బల్లులు, స్నేక్‌లు, కిండర్‌టాయ్‌ బొమ్మలతో మాస్క్‌లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌తోపాటు ఓపెన్‌కౌంటర్ల రూపంలో కంపెనీలు, వస్త్ర సంస్థలు వందల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క మాస్కులపైనే చేస్తున్నాయి.  ఎటుచూసినా ఇప్పుడు మాస్కుల బిజినెస్సే రాజ్యం చేస్తోంది. దీంతో ఐదు రూపాయలకు దొరికే సాధారణ మాస్క్‌ 15 నుంచి 50 రూపాయల ధర పెరిగింది. వైద్యులు మాత్రమే ఉపయోగించే ఎన్‌95 మాస్క్‌లు 500 నుంచి 695 వరకు అమ్ముడుపోతున్నాయి. ఆస్పత్రుల్లోని ఆపరేషన్‌ థియేటర్లు, సర్జికల్‌ వార్డుల్లో ఉపయోగించే సర్జికల్‌ మాస్క్‌లు ఇప్పుడు ప్రతీ ఒక్కరు వాడుకోవచ్చంటూ అమ్మేస్తున్నారు.


ఆకర్షణకే.. అడ్డుకోలేవు

కరోనా విజృంభించిన తర్వాత మాస్క్‌ల తయారీలోకి అనేక కంపెనీలు శరవేగంగా దూసుకొచ్చాయి. అప్పటివరకు దేశంలో 196 కంపెనీలు సర్జికల్‌, ఎన్‌-95 మాస్క్‌లను తయారు చేస్తుండేవి. ఇప్పుడు ఆ సంఖ్య వేలల్లో ఉన్నాయి. ప్రమాదకరమైన  వైర్‌స,బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి కణాల నుంచి కాపాడేందుకు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) సిఫారసుల ఆధారంగా రూపొందించిన మాస్క్‌లనే రక్షణకోసం వాడాలి. డిస్పోజబుల్‌ (ఒక్కసారికే వినియోగించేవి) , సర్జికల్‌, ఎన్‌-95(రెస్పిరేటరీ) మాస్క్‌లు ఉన్నాయి. వీటి తయారీపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. సాధారణ డిస్పోజబుల్‌ మాస్క్‌లపై తయారీ కంపెనీ పేరు, ఇతర ప్రమాణాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. సర్జికల్‌, ఎన్‌-95 మాస్క్‌లపై కంపెనీ పేరు, తయారీ తేదీ, ప్రమాణాలను పేర్కొనాలి. వాటి రంగు విషయంలోనూ కచ్చితమైన ప్రామాణికతను పాటించాల్సి ఉంది. ఇవన్నీ కూడా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌కు లోబడి ఉండాలి. అయితే, ఇప్పుడు మాస్కుల తయారీలోకి ఏమాత్రం అనుభవం లేని కంపెనీలు ప్రవేశించాయి. సెల్‌ఫోన్‌ స్ర్కీన్‌గార్డులు, ప్రొటెక్టివ్‌ కేసులు తయారు చేసే కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చాయి. మరోవైపు సాధారణ మాస్క్‌ ధర 5 నుంచి 15 రూపాయలకు పెరిగింది. చేతి గ్లౌజులు ఇంతకు ముందు ఒక జత రూ. 10కి లభించేవి. 


ఇప్పుడు రూ. 25కు పెంచేశారు. సాధారణ ఎన్‌-95 మాస్కు రూ. 100 ఉండేది. రెస్పిరేటరీ సిస్టమ్‌ను ఉపయోగించే మాస్క్‌ను రూ. 250వరకు అమ్మేవారు. ఇప్పుడు సాధారణ ఎన్‌-95 మాస్కునే రూ.500కు విక్రయిస్తున్నారు. ఇక వాటికి రకరకాల రంగులు, కార్టూన్‌ బొమ్మలు జోడించి చాలా ఆకర్షణీయంగా తయారు చేసి.. రూ. 800కు కూడా అమ్మేస్తున్నారు. ఇవేవి అనుభవం ఉన్న కంపెనీలు తయారు చేస్తున్నవి కావు. మెడికల్‌ టెక్స్‌టైల్‌ రంగంలో నమోదుకాని వస్త్ర బ్రాండ్లు కూడా మాస్క్‌లను  తయారు చేస్తున్నాయి. రూ. 500కు మూడు, వె య్యికి ఏడు మాస్క్‌ల చొప్పున విక్రయిస్తున్నాయి. వీటిపై ఆయా కంపెనీల బ్రాండ్‌లోగోలను ముద్రిస్తున్నారు. త్రిబుల్‌ లేయర్‌, సిక్స్‌ లేయర్‌ సెక్యూరిటీ, యాంటీ బ్యాక్టీరియల్‌ కోటింగ్‌ అంటూ అనేక అంశాలను జోడిస్తూ విపరీత ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి, అధికాదాయ వర్గాలను దృష్టిలోపెట్టుకొని.. మాస్కుల డిస్కౌంట్‌ ఆఫర్‌సేల్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మూడు మాస్కులు రూ. 500 అనగానే.. అబ్బో ఇదే చక్కని అవకాశం అనుకొని ఈ వర్గాలు ఒకేసారి వందల కొద్ది సెట్లు కొనేస్తున్నారు. అంతేకాదు... బ్రాండెడ్‌ మాస్క్‌లు ధరిస్తే వారి స్టేటస్‌ ఏమిటో తెలిసిపోతుంది. ధరించే మాస్క్‌ను బట్టి, వారి హోదా ఏమిటో తెలిసిపోయేలా వాటి డిజైన్లు ఉంటున్నాయి. అయితే, ఒక్కసారి వాడిపడేసే సాధారణ మాస్క్‌ 90 శాతం వైరస్‌, బ్యాక్టీరియాను అడ్డుకుంటే, బ్రాండెడ్‌ మాస్క్‌లు 70 శాతం మాత్రమే రక్షణ ఇస్తాయి. ఇది స్వయంగా కేంద్రం ప్రకటించిన సత్యం!

Updated Date - 2020-07-12T08:57:46+05:30 IST