మాస్కు లేకుంటే రిస్కే..!

ABN , First Publish Date - 2020-06-29T11:01:26+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాలో విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా చాలా వరకు పాజిటివ్‌ కేసులు ఆసుపత్రులకు వెళ్లిన వారి నుంచే

మాస్కు లేకుంటే రిస్కే..!

పాలమూరు జిల్లా ఆసుపత్రి వద్ద  నో మాస్క్‌, నో ఎంట్రీ బోర్డు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి అనుమతి నిరాకరణ 

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా

అత్యవసరమైతేనే పిల్లలు, వృద్ధులకు అనుమతి

చర్యలకు పోలీసు బృందాల ఏర్పాటు

నేటి నుంచి కచ్చితమైన నిబంధనలు అమలు 


రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి అధికారులు కచ్చితమైన నిబంధనల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మాస్క్‌ లేకుండా ఎవరినీ అనుమతించేది లేదని, అలా ఎవరైనా వచ్చినా జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోగి వెంట సహాయకులుగా ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. వీరికి కూడా ప్రత్యేక పాస్‌లు ఇవ్వనున్నారు. దీంతోపాటు  అత్యవసరమైతే తప్ప 14 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల వృద్ధులకు అనుమతి ఉండదు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) జూన్‌ 28: కరోనా వైరస్‌ జిల్లాలో విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా చాలా వరకు పాజిటివ్‌ కేసులు ఆసుపత్రులకు వెళ్లిన వారి నుంచే వస్తున్నాయి. అయితే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా ను కట్టడి చేయడంతోపాటు ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు కలెక్టర్‌, మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. రాంకిషన్‌ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనది మాస్కు లేకుండా ఆసుపత్రిలోకి వస్తే అనుమతించేది లేదని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఇందుకోసం పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.


ప్రతి రోజూ ఓపీ 1600 నుంచి 1800 మంది వరకు..

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజుకు 1600 నుంచి 1800 మంది వరకు ఓపీ చూపించుకోవడానికి వస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రిలో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కచ్చి తమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కు లేకుండా ఏ ఒక్కరినీ కూడా ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. మాస్కు లేకుండా ఆసుపత్రి లోపలికి వచ్చినా... మాస్కు సక్రమంగా పెట్టుకోకపోయినా వారికి రూ. 1000 జరిమానా విధించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జిల్లా ఎస్పీతో మాట్లాడి ఆసుపత్రి ఆవరణలో పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేయించా రు. మాస్కు లేకుండా ఎవరైనా కనిపించినా పోలీసులు గుర్తించి జరిమానా విధించనున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయకులుగా ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.


ఇందులో ఒకరు రోగి బెడ్‌ వద్ద ఉండగా, మరొకరు బయట భోజనం తీసుకురావడానికి ఉంటారు. వీరికి ప్రత్యేకమైన పాసులు కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు 14 సంవత్స రాలలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రవేశం కల్పించడం లేదు. అత్యవసర పరిస్థి తుల్లో అనారోగ్యంగా ఉంటే తప్ప వారిని అనుమతించడం లేదు. ఆసుపత్రి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆసుపత్రి బయట ఇన్‌ ఫ్రారెడ్‌ థర్మామీటర్‌తో ఉష్ణోగ్రత చూస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే రోగికి, వారి సహాయకులకు అవసరమైన వస్తువులు, పదార్థాలు తెచ్చుకునే వీలు కల్పించారు. ఈ నిబం ధనలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.


తప్పనిసరి అయితేనే ఆసుపత్రికి రావాలి

అత్యవసర పరిస్థితులు, తీవ్ర అనారోగ్యం, కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తేనే ఆసుపత్రికి రావాలి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు 0 ఓపీలో చూపించుకోవాలి. బీపీ, షుగర్‌, చిన్న చిన్న జబ్బులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులకు వెళ్లాలి. ఎవరూ రోగులకు బయటి నుంచి భోజనం తీసుకురావద్దు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ఆసుపత్రి ఆవరణలో ఉమ్మివేసినా, మాస్కు లేకుండా ఉన్నా జరిమానా విధిస్తారు. కరోనా నివారణ కోసం చేపడుతున్న ఈ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

- డా. రాంకిషన్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - 2020-06-29T11:01:26+05:30 IST