‘మసాలా’ అంటే మంచి అర్థమూ ఉంది!

ABN , First Publish Date - 2020-11-09T06:50:39+05:30 IST

‘కొండగట్టు’ నవల శ్రీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో వుంచుకొని మసాలా దట్టించి రాసినదని విమర్శిస్తూ ‘‘జీవిత చిత్రణలో ‘మసాలా’ అవసరమా’’ అన్న శీర్షికతో...

‘మసాలా’ అంటే మంచి అర్థమూ ఉంది!

అందరికీ ఆమోదయోగ్యమైన, ఆచరణీయమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏ రచయితకీ లేదనే అనుకుంటాను. కథా గమనానికీ, పాత్ర మానసిక స్థితికీ తగ్గట్టు పాత్రోచితమైన సంభాషణలను రచయిత సమకూరుస్తాడేగానీ, తన నవలలోని అన్ని పాత్రలూ ఒక ఆదర్శాన్నే సూచిస్తున్నట్టు రాయడు. గిరీశానికీ, సౌజన్యారావుకీ ఒకేలాగ రాశారా గురజాడవారు సంభాషణలు?


‘కొండగట్టు’ నవల శ్రీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో వుంచుకొని మసాలా దట్టించి రాసినదని విమర్శిస్తూ ‘‘జీవిత చిత్రణలో ‘మసాలా’ అవసరమా’’ అన్న శీర్షికతో 12.10.2020 నాటి వివిధలో శ్రీ సౌరవ వ్యాసం రాశారు. అది చదివేక నాలో కలిగిన ప్రతిస్పందన ఇది. 


నాకు తెలిసి- ఒక నిజాయితీ, నిబద్ధత కలిగిన రచయితగా సన్నపురెడ్డి కథలు గానీ, నవలలు గానీ చదివినవారెవరూ ఈ ఆరోపణని సమర్థిం చరు. మొదటి నుంచీ ఆయన రైతు పక్షపాతిగా సమాజంలోని బడుగువర్గాల వారిని సానుభూ తితో తలకెత్తుకున్న రచయిత. తన ఇటీవలి నవల ‘ఒంటరి’లో రైతు తాత్త్వికతను ప్రస్ఫుటిం చారు, ఇప్పుడీ ‘కొండపొలం’ నవలలో సమాజం అసలు పట్టించుకోని గొర్ల కాపర్లను, వారి జీవన పోరాటాన్ని, వారి స్త్రీ పురుష సంబంధాలనూ హృద్యంగా చిత్రించారు. ‘కొండపొలం’ నవలలో వెంకట్రామిరెడ్డిగారు కథావస్తువును ఎన్నుకోవ డంలోనే ఎంతో వైవిధ్యం చూపారు. పాపులారిటీ కోసం ‘మసాలా’ దట్టించాల్సిన అవసరం వున్నవాడు కాదు ఈ రచయిత. శ్రీ సౌరవ తన ఆర్టికల్‌లో అభూత కల్పనలుగానూ అసంభావ్యతలు గానూ లేవనెత్తిన కొన్ని అంశాలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను. 


కథానాయకుడు రవి ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా అడవిని, జంతువులని రక్షించినట్లు చిత్రించడం చాలా అసహజంగా ఉందనీ, పెట్టుబడిదారీ సమాజంలో కార్పొరేట్ల, రాజకీయశక్తుల నెట్‌వర్క్‌ని ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ తన నిజాయితీతో మార్చగలగడం జరగని పని అనీ వారు విమర్శించారు. 


నిజమే. కానీ ఏ మార్పైనా ఎవరో ఒకరు ఏదో ఒక స్థాయిలో ప్రారంభించాల్సిందే. కన్యాశుల్కాన్ని నిరసించిన గురజాడ; మహిళా విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించిన వీరేశలింగం పంతులు; వ్యావహారిక భాష తరఫున ఉద్యమించిన గిడుగు... ఈ అన్ని సందర్భాల్లోనూ ప్రారంభం ఒక్కరితోనే జరిగింది. అంతెందుకు మొన్న మొన్న ఎన్నికల ప్రధానాధికారిగా శ్రీ టి.ఎన్‌. శేషన్‌ దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకూ చెమటలు పట్టించలేదా?


ఈ విషయాన్నే రచయిత కూడా తన ముందు మాటలో ‘‘అతని ఒక్కని వల్లనే వ్యవస్థ బాగుపడుతుందనే అత్యాశ లేదు గానీ అతని లాగానే ప్రతి ఉద్యోగీ నిక్కచ్చిగా పనిచేసి పర్యావరణ పరిరక్షణ చేయాలనే ఆశ అతని గమ్యాన్ని మార్చింది’’ అన్నారు. వ్యక్తి జీవిత పరిధిలో లభించే పరిష్కారాలు కూడా ఆ వ్యక్తి జీవితానుభవానికి చెందినవే అయివుంటాయి. ఇదే వ్యవస్థలో వున్న చట్టాల్నీ, అధికా రాల్నీ సక్రమంగా వినియోగించుకుంటే ఎంతో కొంత మార్పు తేవచ్చునని అనుకుంటాను. 


ఈ నవలలో ఒక రైతు పాత్ర చేత ‘‘నెలకి అయిదువేల రూపా యలు కిట్టుబడి అయినా నా పొలంలో నేను కూలీగా వుండిపోతాను’’ అనిపించారనీ, ఇది ప్రభుత్వాలకీ, కార్పొరేట్లకీ భూమిని అప్పగించి రైతుని కూలీగా మార్చడానికి సామాజిక ఆమోదయోగ్యతను డిమాండ్‌ చేస్తుందనీ అన్నారు సౌరవ.


ఇదే పాత్ర (తిరుపేలు) అంతకుముందు తన కూతురి పెళ్ళి సంబంధం విషయంలో పలికిన సంభాషణను శ్రీ సౌరవ పట్టించుకోలేదు:

‘‘సేద్దగానికి పిల్లనిచ్చేది లేదు.’’


‘‘సేద్దగానికి పిల్లనిచ్చి, వాడు మందు తాగి సచ్చే- ముండ మోసుకుని పుట్టింటికి వచ్చిన కూతుర్ని సాకేంత సత్తవ నా కాడ లేదు. బూములూ, పుట్రలూ, ఆస్తులు పాస్తులు వద్దు. ఏ పూటకాపూట తిండి సంపాదించుకుంటే చాలు. అప్పులు కూడబెట్టి పానాలు పోగొట్టుకునే బతుకు నా కూతురికి వద్దు.’’- జీవిత పోరాటంలో యింతగా డస్సిపోయిన రైతు అలాకాక యింకెలా మాట్లాడతాడు? ఇదే పాత్ర వానలొస్తే మళ్లీ సేద్యం చేస్తానంటుంది. రైతుకీ మట్టికీ వున్న బంధం అలాంటిది.


అందరికీ ఆమోదయోగ్యమైన, ఆచరణీయమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏ రచయితకీ లేదనే అనుకుంటాను. కథా గమనానికీ, పాత్ర మానసిక స్థితికీ తగ్గట్టు పాత్రోచితమైన సంభాష ణలను రచయిత సమకూరుస్తాడేగానీ, తన నవలలోని అన్ని పాత్రలూ ఒక ఆదర్శాన్నే సూచిస్తున్నట్టు రాయడు. గిరీశానికీ, సౌజన్యారావుకీ ఒకేలాగ రాశారా గురజాడవారు సంభాషణలు?


రవి అడవిలో పులిని ఎదుర్కొన్న విధానంపై కూడా విమర్శ గుప్పించారు సౌరవ. రవి మీదకు దూకే పులిని హఠాత్తుగా అతని పెంపుడు కుక్క వెనకా ముందూ చూడకుండా దాని కాళ్ళ సందున తల దూర్చి బీజాల్ని నోటకరచుకుంటుంది. వెనకనించి పట్టుకోడానికీ, బీజాల్ని కరచుకోడానికీ తేడా వుంటుంది కదా. పులి అటు యిటు తిరిగిందా, ‘‘వెన్నుని నేలపై మోపి తన ముందు పంజాలతో వెనక భాగాన్ని అందుకోవడానికి’’ ప్రయత్నం చేసిందా అన్నది కాదు యిక్కడ ముఖ్యం. కుక్క దాడి పులి దృష్టిని మరలించి దాని ప్రతిస్పందన సమయాన్ని ఆలస్యం చేసి, రవికి పుంజుకునే అవకాశాన్నిచ్చింది. ఆ సమయాన్ని రవి పులిని గాయపరచడానికి ఉపయోగించుకున్నాడు. ప్రాణభ యంతో పులి మీద చేసిన దాడిలో అతనికి అమితమైన ఆవేశం, బలం వచ్చాయి. నవలలో ముఖ్య పాత్రకి ధైర్యాన్నీ, తన మీద తనకి నమ్మకాన్నీ కలిగించే విధంగా ఈ సంఘటనని వాడుకున్నారు రచయిత. 


‘మసాలా’ అంటే పరిమళించే, ఉత్తేజపరిచే అన్న మంచి అర్థం కూడా వుంది. ఆ విధంగా రెడ్డిగారి రచన మసాలా భరితమే. 

కాళ్ళకూరి కృష్ణారావు

98662 30405


Updated Date - 2020-11-09T06:50:39+05:30 IST