మసక బారిన నేత్రం

ABN , First Publish Date - 2022-08-17T06:24:43+05:30 IST

‘‘కంటి చూపు తగ్గి పోవడంతో గత నెల 11న నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి చూపించుకున్నాను.

మసక బారిన నేత్రం
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు బంద్‌

సర్జరీ పరికరాల కొరతతో రెండు నెలల నుంచి నిలిచిపోయిన శస్త్రచికిత్సలు

 ఇటీవల డాక్టర్‌ బదిలీ... మరొకరిని నియమించని అధికారులు

కంటి ఆపరేషన్ల కోసం 50 మంది ఎదురు చూపు


నర్సీపట్నం, ఆగస్టు 16 : ‘‘కంటి చూపు తగ్గి పోవడంతో గత నెల 11న నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి చూపించుకున్నాను. అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్‌ చేయాలని కంటి డాక్టర్‌ చెప్పారు. మర్నాడు వెళితే బ్లేడ్లు లేవు... వచ్చిన తర్వాత ఫోన్‌ చేస్తాము అని చెప్పారు. తర్వాత చాలాసార్లు తిరిగాను. అదే సమాధానం వచ్చింది. కంటి ఆపరేషన్‌ జరగలేదు’’ అని ఎలమంచిలికి చెందిన ఆదిరెడ్డి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. 

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో రెండు నెలలుగా కంటి ఆపరేషన్లు నిలిచి పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం.. చుట్టు పక్కల మండలాల్లో కంటి చూపు మందగించిన వారు నేత్ర పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి వస్తుంటారు. రోజూ 40 మందికిపైగా ఓపీ వుంటుంది. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మంగళ, శుక్రవారాల్లో ఆపరేషన్లు చేస్తారు. కాగా సర్జరీకి అవసరమైన బ్లేడ్లు సరఫరా కాకపోవడంతో జూలై  నుంచి ఆపరేషన్లు జరగడంలేదు. కంటి డాక్టర్‌ డేవిడ్‌ ప్రైవేటుగా బ్లేడ్లు తెప్పించి కొంత మందికి ఆపరేషన్లు చేశారు. ఇంకా 50 మందికి ఆపరేషన్లు జరగాల్సి వుంది. ఇంతలో ఆయన అనకాపల్లి జిల్లా ఆస్పత్రికి బదిలీ అయ్యారు. నర్సీపట్నం ఆస్పత్రిలో ఎవరినీ నియమించలేదు. కంటి సమస్యలతో వస్తున్న రోగులకు పారామెడికల్‌ అసిస్టెంట్‌ నవీనా నేత్ర పరీక్షలు చేస్తున్నారు. నేత్ర వైద్యుడు లేకపోవడంతో ఆపరేషన్లు చేయడంలేదు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణిని వివరణ కోరగా, ఈ సమస్యను డీసీహెచ్‌ఎస్‌కి వివరించి, నేత్ర వైద్యుడిని వెంటనే నియమించాలని కోరినట్టు చెప్పారు.


Updated Date - 2022-08-17T06:24:43+05:30 IST