సీపీఎస్‌కు మంగళం

ABN , First Publish Date - 2022-06-25T09:12:29+05:30 IST

సీపీఎస్‌ రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మంగళం పాడేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేస్తానని ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారు.

సీపీఎస్‌కు మంగళం

  • మడమ, మాట రెండూ తిప్పేసిన సీఎం
  • అధికారంలోకి రాగానే రద్దు చేస్తానన్న జగన్‌
  • రద్దు చేయలేమని నేడు చేతులెత్తేసిన వైనం
  • వారంలో చేస్తానని చెప్పి మూడేళ్లు
  • ఇన్నాళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన
  • రగిలిపోతున్న సీపీఎస్‌ ఉద్యోగులు


(అమరావతి- ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మంగళం పాడేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేస్తానని ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి ముచ్చటగా మూడేళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మాటను తీసి గట్టున పెట్టేశారు. అంత ఆర్థికభారం మోస్తూ ప్రభుత్వాలను నడపలేమని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టంగా తేల్చిచెప్పారు. దీంతో రెండు లక్షలమంది సీపీఎస్‌ ఉద్యోగులు తాము నయ వంచనకు గురయ్యామని రగిలిపోతున్నారు. నమ్మించి తడిగుడ్డతో గొంతుకోశారని వాపోతున్నారు. ఎన్నికల హామీగా సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి... మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్‌, బైబిలు అని కాకమ్మ కథలు చెప్పి... చివరికి చేతులె త్తేయడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఇచ్చిన హామీని  చాపచుట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, సీపీఎస్‌ రద్దు అంశం ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ప్రస్తావించని వేదిక లేదు. 


కమిటీల డ్రామా...

అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే సీపీఎస్‌ రద్దుకు సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అప్పటి సీఎస్‌ అధ్యక్షత టక్కర్‌ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి అంటూ కమిటీని వేశారు. ఆ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మంత్రులతో మరో కమిటీని ప్రకటించారు. ఆ తర్వాత కేఏ పండిట్‌కి చెందిన కన్సల్టెన్సీతో సీపీఎ్‌సపై అధ్యయనం చేయిస్తున్నామంటూ ఓ ప్రైవేటు కమిటీ వేసింది. ఇలా మూడేళ్లు నెట్టుకువచ్చారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఓపిగ్గా ఎదురుచూసిన ఉద్యోగులకు ఈ డ్రామాలు ఆగ్రహం తెప్పించాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. ఉద్యోగుల నుంచి అనూహ్యంగా ఎదురైన తిరుగుబాటుతో జగన్‌ సర్కారు బాణిమార్చింది. జీపీఎస్‌ పాట అందుకుంది. 30 ఏళ్లసర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు చివరిబేసిక్‌లో 33 శాతం పెన్షన్‌ను అందించే జీపీఎస్‌ ప్రతిపాదనను సీపీఎస్‌ ఉద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రం గా వ్యతిరేకించాయి. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ పట్టుబట్టాయి. అయినా ప్రభుత్వం మొండికేసింది. జీపీఎస్‌పై అధ్యయనానికి అంటూ మంత్రులతో సబ్‌కమిటీ వేసింది. దీనిపై రగిలిపోతున్న సీపీఎస్‌ ఉద్యోగులు తమ సమస్యలపై వినూత్న రీతిలో పోరాడుతున్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. ‘సీపీఎస్‌ రద్దు చేస్తేనే మా ఇళ్లకు రండి’ అంటూ ఇళ్లగేట్లకు బోర్డులు తగిలించారు. ఇన్ని చేసినా వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు కుదరదని తేల్చేసింది. 


అప్పుడు సజ్జలతో చెప్పించి....

సీపీఎ్‌సపై ఉద్యోగసంఘాలతో ఏప్రిల్‌ 25న మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సీపీఎస్‌ రద్దు కుదరదని..ఆర్థికభారం అని..సీపీఎస్‌ కన్నా జీపీఎస్‌ మంచిదంటూ ఉద్యోగ సంఘాల ఎదుట కమిటీ తొలిసారి కొత్త రాగం అందుకుంది. విషయం గ్రహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు..సర్కారు ప్రతిపాదనను వ్యతిరేకించాయి. మూడేళ్లుగా నాన్చి ఇప్పుడు సీపీఎస్‌ రద్దు కుదరదు... జీపీఎస్‌ అంటే ఎలా అని ప్రశ్నించాయి. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడిపెట్టి పీఆర్సీకి ఒప్పించిన రీతిలోనే మరోసారి వేసిన పాచికలు పారలేదు. జీపీఎ్‌సపై చర్చించడానికి తమను పిలవవద్దు అని గత నెల 24న జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ తేల్చిచెప్పాయి. బయటకు రాగానే.. ఇవేవీ పట్టించుకోకుండా జీపీఎస్‌ బెస్ట్‌ అన్న ధోరణిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల క్రితం సజ్జల నోటి నుంచి పలికించి ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో సీఎం అదే విషయం స్పష్టం చేయడం గమనార్హం.   


భారం కాదని నిరూపిస్తాం...

‘‘అధికారంలోకొచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఆరోజు ఎన్నికల ముందు చెప్పి, ఈ రోజు ఆర్థికభారంపడుతుందంటూ చేతులెత్తేయడం దారు ణం. నమ్మించి తడిగుడ్డతో మా గొంతుకోశారు. సీపీఎస్‌ రద్దు చేస్తే ఆర్థికంగా భారంపడుతుందంటూ ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. అవకాశం ఇస్తే  సీపీఎస్‌ రద్దు వల్ల ఏ విధంగా ప్రభుత్వంపై భారం పడదో నిరూపిస్తాం. దీనిపై ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతోంది. సీపీఎస్‌ రద్దుపై అధికారులు ఇచ్చిన లెక్కలతో కాకుండా సామాజిక దృక్ఫథంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ రద్దు చేయాలి’’

- సీఎం దాస్‌, ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

Updated Date - 2022-06-25T09:12:29+05:30 IST