TPT : గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరాతీస్తే..!

ABN , First Publish Date - 2021-11-23T12:46:07+05:30 IST

ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది...

TPT : గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరాతీస్తే..!

  • ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
  • అత్తింటి వేధింపులే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు

చిత్తూరు జిల్లా/మదనపల్లె క్రైం : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమబిడ్డ ఆత్మహత్య చేసుకుంద ని మృతురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఆనంద్‌రెడ్డి కుమార్తె నవిత(25)కు ఐదేళ్ల కిందట మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ కాట్లాటపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రవీణ్‌ పట్టణంలో చిల్లరదుకాణం నిర్వహిస్తుండేవాడు.


కాగా.. నవిత గ్రామ వలంటీర్‌గా పనిచేసేది. సోమవారం ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆమెను కిందకు దించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలో మృతి చెందినట్లు నిర్ధరణ చేశారు. అనంతరం కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న నవిత తల్లిదండ్రులు ఆనంద్‌రెడ్డి, అమరావతి.. మదనపల్లెకు చేరుకుని అత్తింటి వేధింపుల కారణంగానే తమబిడ్డ ఆత్మహత్య చేసుకుందని తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తామామలు శాంతమ్మ, ఓబుల్‌రెడ్డి వేధించడంతోనే ఇటీవల ఉద్యోగం మానేసిందన్నారు. గతంలో కూడా పలుమార్లు కొట్టి హింసించారని, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-11-23T12:46:07+05:30 IST