వేధింపులు తట్టుకోలేక గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-23T12:54:52+05:30 IST

అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక గృహిణి ఆత్మహత్య

వేధింపులు తట్టుకోలేక గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్/నిజాంపేట్‌ : అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వరంగల్‌ జిల్లాకు చెందిన పల్లవి, శ్రీనివాస్‌లకు 2016లో వివాహమైంది. బతుకుదెరువు కోసం వచ్చి బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో శ్రీనివాస్‌కు కట్నకానుకల కింద 10లక్షల నగదు, 25 తులాల బంగారం ముట్టజెప్పారు. పెళ్లైన కొద్దినెలల నుంచి అదనంగా డబ్బు కావాలని భార్య పల్లవిని వేధించేవాడు. నాలుగేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఆమెను మానసికంగా వేధించేవాడు. వేధింపులు మానుకోవాలని పల్లవి పుట్టింటి నుంచి రెండు విడతల్లో రూ.7లక్షలు ముట్టజెప్పింది.


గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గదుల్లో పడుకున్నారు. తెల్లవారుజామున భార్య పడుకున్న గది తలుపులు తట్టినా లేవకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్‌ బావమరిదికి ఫోన్‌లో సమాచారం అందించాడు. వెంటనే పల్లవి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా, గదిలో పల్లవి ఉరేసుకుని కనిపించింది. భర్త శ్రీనివాస్‌, అత్త బాలమణి వేధింపుల కారణంగానే పల్లవి ఆత్మహత్య చేసుకుందని బాచుపల్లి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-23T12:54:52+05:30 IST