వీరి పెళ్లి... కాస్త స్పెషల్‌

ABN , First Publish Date - 2021-02-21T17:02:09+05:30 IST

అంటూ ఈ ఫిబ్రవరి 1న తమిళనాడుకు చెందిన చిన్నాదురై, శ్వేతలు బంగాళాఖాతంలో 60 అడుగుల లోపల పెళ్లి చేసుకున్న వార్త అం అంటూ ఈ ఫిబ్రవరి 1న తమిళనాడుకు చెందిన చిన్నాదురై, శ్వేతలు...

వీరి పెళ్లి... కాస్త స్పెషల్‌

‘అగ్ని సాక్షిగా కాకుండా... నీటి సాక్షిగా...’ అంటూ ఈ ఫిబ్రవరి 1న తమిళనాడుకు చెందిన చిన్నాదురై, శ్వేతలు బంగాళాఖాతంలో 60 అడుగుల లోపల పెళ్లి చేసుకున్న వార్త అం అంటూ ఈ ఫిబ్రవరి 1న తమిళనాడుకు చెందిన చిన్నాదురై, శ్వేతలు బంగాళాఖాతంలో 60 అడుగుల లోపల పెళ్లి చేసుకున్న వార్త అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ‘క్రేజీ మ్యారేజ్‌’ అని కొందరంటే, ‘అబ్బో... చాలా ధైర్యం కావాలి’ అంటూ అభినందించినవారూ ఉన్నారు. అయితే డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌, బిగ్‌ ఫాట్‌ వెడ్డింగ్స్‌తో పాటు ఆసక్తి ఉంటే వెరైటీగా సముద్రం లోపల కూడా పెళ్లి చేసుకోవచ్చనే కలను నిజం చేసి చూపించింది మాత్రం ‘టెంపుల్‌ అడ్వెంచర్స్‌’ అనే సంస్థ. దాని యజమాని ఎస్‌.బి.అరవింద్‌ తన బృందంతో కలిసి చేసిన మాయాజాలం ఇది. 


‘‘నిజానికి ఈ టైపు పెళ్లి నేను 11 ఏళ్ల క్రితం చేసుకోవాలనుకున్నా. అయితే అప్పటి నా కల ఇన్నాళ్లకు వీళ్లిద్దరి పెళ్లితో నెరవేరింది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు స్కూబా డైవింగ్‌ శిక్షకుడు, ‘టెంపుల్‌ అడ్వెంచర్స్‌’ యజమాని అరవింద్‌. సముద్రంలో పెళ్లి అనే కాన్సెప్ట్‌ను ఆయన చాలామందికి వినిపించాడు. కొన్నిసార్లు వధూవరులు భయపడటం, ఇంకొన్నిసార్లు వారి తల్లిదండ్రులు వద్దనడంతో... ప్రతీసారి ఎక్కడో చోట ఆయన ఆలోచనకు బ్రేక్‌ పడేది. పాండిచ్చెరీకి చెందిన ఈ సంస్థ ఆధ్వర్యంలో చాలామందికి స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇచ్చాడు. శిక్షణలో భాగంగా సముద్రంలోకి వెళ్లిన ప్రతీసారి అరవింద్‌కు నీటిలో పెళ్లి కాన్సెప్ట్‌ గుర్తుకొచ్చేది. ఎట్టకేలకు ఆయన కలను నిజం చేసేందుకు ముందుకొచ్చాడు చిన్నాదురై. ఇతను ఎవరో కాదు... అరవింద్‌ కజిన్‌. 12 ఏళ్ల క్రితమే స్కూబా డైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న చిన్నాదురై తప్పకుండా తన పెళ్లి సముద్రంలోనే జరుగుతుందని అరవింద్‌కు మాటిచ్చాడు. 


సముద్రంలో పెళ్లి ఆలోచన వినడానికి బాగున్నా, ప్రాక్టికల్‌గా చాలా సమస్యలుంటాయనే విషయం అరవింద్‌కు నెమ్మదిగా అర్థమయ్యింది. చిన్నాదురై ఎంగేజ్‌మెంట్‌ కాగానే కాన్సెప్ట్‌ను కాబోయే వధువు శ్వేతకు చెప్పారు. మొదట ఆమె భయపడినప్పటికీ శిక్షణ గురించి, తీసుకునే జాగ్రత్తల గురించి అర్థమయ్యేలా చెప్పడంతో సరేనంది. అప్పటికి ఆమెకు కనీసం ఈత కొట్టడం కూడా రాదు. ముందుగా స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్పించి తర్వాత అక్కడే పెళ్లితంతు ట్రయల్స్‌ను నిర్వహించారు. ఆ తర్వాత సముద్రంలో శిక్షణ ఇచ్చారు. 


పెళ్లిరోజు రానే వచ్చింది. అరవింద్‌ భార్య తనుశ్రీ వధూవరుల పెళ్లి దుస్తులను నీటిలో తేలకుండా గమ్‌ టేపులు, పిన్నుల సాయంతో అతికించింది. దండలను కూడా ప్రత్యేకంగా తయారుచేశారు. సముద్రపు ఒడ్డున పెద్దల సమక్షంలో కొంత సాంప్రదాయ పెళ్లి వేడుకను ముగించి, ఏడుగురు బృందంతో ఉన్న పడవ వధూవరులను తీసుకుని దక్షిణ చెన్నై దగ్గర్లోని నీలాంకరి నుంచి సముద్రంలోకి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అంతా నీటిలోకి డైవ్‌ చేశారు. అరవింద్‌ నీటిలోపల కెమెరా ఆపరేట్‌ చేశారు. సరిగ్గా ముహూర్తం సమయానికి నీటిలో తేలియాడుతూనే చిన్నాదురై, శ్వేత మెడలో తాళి కట్టాడు. 40 నిమిషాల్లో పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఒడ్డుకు చేరుకున్నారు. ‘‘ఇంత సాహసం చేస్తాననుకోలేదు. అదొక అద్భుతమైన అనుభవం’’ అని ఆనందం వ్యక్తం చేస్తోంది నవ వధువు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైన శ్వేత. 

Updated Date - 2021-02-21T17:02:09+05:30 IST