అనాథనంటూ ప్రేమ పేరుతో పెళ్లి.. లక్షలు తీసుకుని పరార్‌

ABN , First Publish Date - 2021-06-13T08:40:00+05:30 IST

అనాథనంటూ పరిచయం చేసుకుంది. ప్రేమ వల విసిరి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అప్పులున్నాయంటూ భర్త, అత్తమామల నుంచి లక్షల రూపాయలు తీసుకుంది

అనాథనంటూ ప్రేమ పేరుతో పెళ్లి.. లక్షలు తీసుకుని పరార్‌

అనాథనంటూ ముంచేసింది

ప్రేమ పేరుతో యువకుడితో పెళ్లి 

భర్త నుంచి లక్షలు తీసుకుని పరార్‌ 

గతంలో రెండు వివాహాలు.. పిల్లలు 

తిరుపతి పోలీసులకు బాధితుడి ఫిర్యాదు


తిరుపతి క్రైం, జూన్‌ 12: అనాథనంటూ పరిచయం చేసుకుంది. ప్రేమ వల విసిరి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది.  అప్పులున్నాయంటూ భర్త, అత్తమామల నుంచి లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తరువాత ఇంటినుంచి మాయమైంది. ఆమె ఏమైందని విచారించగా విస్తుపోయే విషయం తెలిసింది. ఆమెకు అప్పటికే రెండు పెళ్లిల్లు అయ్యాయని, తాను మూడో మొగుడని తెలియడంతో ఆ యువకుడికి గుండె ఆగినంత పనైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతిలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా నారపరాజు కండ్రిగకు చెందిన సునీల్‌కుమార్‌ కు ఏడీబీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఎం.సుహాసినితో పరిచయమైంది. తాను అనాథనని చెప్పింది. ఆ తరువాత వారి పరిచయం ప్రేమగా మారింది. గతేడాది డిసెంబరులో పెద్దలు వారికి వివాహం చేశారు. తనకు చిన్నచిన్న అప్పులున్నాయని, తనను ఆదరించినవారికి ఆరోగ్యం బాగాలేదంటూ పలు కారణాలు చెప్పి ఆమె సునీల్‌కుమార్‌ నుంచి మొత్తం రూ. 4 లక్షల దాకా తీసుకుంది. అంతేకాకుండా సునీల్‌కు తెలియకుండా... ఆయన తల్లిదండ్రుల నుంచి మరో 2 లక్షల రూపాయలు తీసుకుని చెక్‌ రాసిచ్చింది. 


ఈ విషయం తెలుసుకున్న సునీల్‌కు అనుమానం వచ్చింది. అనాథనని చెప్పావని, లక్షల రూపాయలు ఏం చేస్తున్నావని ఈ నెల 7వ తేదీన ఆమెను గట్టిగా నిలదీశారు. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూడగా సుహాసిని ఇంట్లో కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఆమె ఆధార్‌ కార్డు దొరికింది. అందులోని వివరాలను బట్టి  నెల్లూరు జిల్లా రాజుపాళెంకు చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకు అప్పటికే వివాహమైనట్టు సునీల్‌ గుర్తించారు. రాజుపాళెంలో విచారించగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని తెలిసింది. అంతేకాకుండా ఆమెకు ఏడాది క్రితం మరొకరితో రెండో వివాహం కూడా జరిగిందని తెలిసింది. ఈ విషయాలు తెలుసుకుంటుండగానే... రెండు రోజుల క్రితం సునీల్‌కు సుహాసిని ఫోన్‌ చేసింది. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తానని, తనపై కేసులు పెడితే ఇబ్బంది పడతావంటూ సునీల్‌ను బెదిరించింది. దీంతో సునీల్‌ అన్ని ఆధారాలతో శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుహాసిని కోసం పోసుఉలు గాలిస్తున్నారు. 



Updated Date - 2021-06-13T08:40:00+05:30 IST