Abn logo
Sep 25 2021 @ 23:12PM

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

సీతంపేట రాజేంద్రనగర్‌లో ఘటన

అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు

విశాఖపట్నం, సెప్టెంబరు 25: విశాఖ నగరం సీతంపేట రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహిత శనివారం రాత్రి మూడంతస్తుల భవనం పైనుంచి గెడ్డలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  రాత్రి  ఏడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ద్వారకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. 


ఓ వాహన విక్రయ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌, గొంప సత్యవతి (35)లు దంపతులు. 2008లో పెళ్లయిన వీరికి హర్షిత్‌, ఆదిత్య ఇద్దరు కొడుకులున్నారు. సత్యవతి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిక ఆందోళనకు గురైన ఆమె బుధవారం ఇంటి వద్ద ఉన్న షంప్‌లోకి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి రక్షించి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్‌చేసి పుట్టింటికి వచ్చేస్తానని చెప్పడంతో రెండు రోజుల్లో తాము వచ్చి తీసుకువెళ్తామని వారు తెలిపారు.


ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మూడో అంతస్తులోని తమ ఇంట్లో పిల్లలకు భోజనం పెట్టింది. టీవీ సౌండ్‌ తగ్గించండంటూ వారికి చెప్పింది. అనంతరం పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి వెనుక ఉన్న గెడ్డలోకి దూకేసింది. దీంతో గెడ్డలో ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని అక్కడికక్కడే చనిపోయింది. పెద్ద శబ్దం రావడంతో పిల్లలు, ఇంట్లో ఉన్న వారు పరుగున వచ్చి చూడగా అప్పటికే విగత జీవిగా మారింది.


మృతురాలి భర్త చంద్రశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వారి సహాయంతో గెడ్డలోని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.