అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-11-25T05:11:58+05:30 IST

మందస మండలం దున్నూరు పంచాయతీ మర్రిపాడులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం ఉదయం మృతిచెందింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తిరుపతమ్మ మృతదేహం


 హత్యేనంటున్న బంధువులు

హరిపురం: మందస మండలం దున్నూరు పంచాయతీ మర్రిపాడులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం ఉదయం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... పలాస మండలం రంగోయికి చెందిన దున్న తిరుపతమ్మకు(40) పదేళ్ల కిందట మర్రిపాడుకు చెందిన ఢిల్లీరావుతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు సాయికిరణ్‌ ఉన్నాడు. కొంతకాలం కిందట భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో పెద్దలు రాజీ చేశారు. ఇద్దరి మధ్య మరోసారి సోమవారం రాత్రి ఘర్షణ జరగడంతో తిరుపతమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. తెల్లవారేసరికి కొబ్బరితోటలో తిరుపతమ్మ మృతదేహం కనిపించింది. శరీరంపై గాయాలు ఉండడంతో తిరుపతమ్మ కుటుంబసభ్యులు  హత్యేనని మందస పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో సీఐ సతీష్‌, ఎస్‌ఐ రామారావు సంఘటనా స్థలాన్ని సందర్శించి హత్యకోణంలో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీముతో ఆధారాలు సేకరించారు. జీడిపిక్కల పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్న తిరుపతమ్మ కుమారుడ్ని చదివిస్తోందని, అందరితోనూ కలివిడిగా ఉండే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు తెలిపారు. పోలీసులు నిజాలు నిగ్గుతేల్చి,అనాఽథగా మారిన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బారువా ఆసుపత్రికి తరలించారు. మందస ఎస్‌ఐ జి.రామారావు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..

పోలాకి: దీర్గాశి పంచాయతీ కింజరాపువానిపేట గ్రామం వద్ద  సోమవారం రాత్రి జరిగిన రోడ్డ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బూసి అచ్చెయ్య(69) అనే వృద్ధుడు మృతి చెందాడు. పొలం పనులు చూసుకొని రోడ్డు దాటుతున్న అచ్చెయ్యను  ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  ఎస్‌ఐ చిన్నంనాయుడు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-25T05:11:58+05:30 IST