పెళ్లింట విషాదం

ABN , First Publish Date - 2020-10-30T07:12:55+05:30 IST

అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.. పెళ్లి వేడుకతో అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది.

పెళ్లింట విషాదం
చెట్టును ఢీకొన్న కారు

  • ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
  • వేములవాడలో చెట్టును ఢీకొన్న కారు
  • యువకుడు, ఒక బాలుడు దుర్మరణం

అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.. పెళ్లి వేడుకతో అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లిలో సందడి చేసిన ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృత్యువాత పడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. కరప మండలం వేములవాడ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన విషాదమిది..


కరప, అక్టోబరు 29: మండలంలోని వేములవాడ గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్న అప్పనపల్లి గోవిందమాధవ కుమారుడు, పాట్నీడి సత్తిబాబు కుమార్తెల వివాహం బుధవారం రాత్రి జరిగింది. పెండ్లికుమారుడి స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన కోటా శ్రీను వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లికి వచ్చిన అతను తిరిగి వైజాగ్‌ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన, పెండ్లికుమార్తెకు వరుసకు సోదరుడైన పాట్నీడి వీరేంద్రశ్రీకృష్ణభగవాన్‌ (33) తన స్నేహితుడి కారులో శ్రీనును కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లాడు. వారికి తోడుగా అదే కారులో గ్రామానికే చెందిన బొండా సాయిమధు(15), రౌతు సురేష్‌, అప్పనపల్లి వెంకట సాయిశివరామ్‌లు వెళ్లారు. శ్రీనును కాంప్లెక్స్‌లో దించి, వేములవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపక్కన ఉన్న చెట్టును వీరు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఆ శబ్దానికి సమీపంలోని ఇళ్లల్లో నిద్రిస్తున్నవారు లేచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. అతివేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. స్టీరింగ్‌ విరిగిడ్రైవింగ్‌ సీటులో ఉన్న భగవాన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, పక్క సీటులో కూర్చున్న 15 ఏళ్ల సాయిమధు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్‌తో కారు డోర్లను లాగి, కట్టర్‌తో వాటిని కోసి కారులో ఇరుక్కుపోయిన భగవాన్‌ మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఇక వెనుక సీటులో కూర్చున్న సురేష్‌, వెంకటసాయిశివరామ్‌లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిమధు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కరప పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టా రు. అతివేగం, మద్యం మత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించే ముందు చేసిన కోవిడ్‌ పరీక్షల్లో మృతుడు భగవాన్‌కు కరోనా ఉన్నట్టు తేలిందని ఏఎస్‌ఐ పి.వీరభద్రరావు తెలిపారు. దీంతో ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా కొవిడ్‌ నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. గొల్లపాలెం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ నేతృత్వంలో కరప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామంలో విషాదచాయలు

ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడడంతో పెళ్లివారింట, వారి కుటుంబాల్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు భగవాన్‌ మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 ఏళ్ల సాయిమధు మరణించడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పండ్ల వ్యాపారం చేసే సాయిమధు తండ్రి వీరభద్రరావు కొంతకాలం కిందట చెట్టు మీద నుంచి పడి మంచానికే పరిమితమయ్యాడు. తల్లి దుర్గ ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తూ కుటుంబానికి ఆధారమైంది. ఇంట్లోని పరిస్థితులతో సాయిమధు చదువు మానేసి ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన సాయిమధు పవన్‌ ఎక్కడ మీటింగ్‌ జరిగినా వెళ్లేవాడని స్థానికులు తెలిపారు.

Updated Date - 2020-10-30T07:12:55+05:30 IST