‘పెళ్లి అంటే రేప్‌కి లైసెన్స్ కాదు’

ABN , First Publish Date - 2022-04-24T05:39:56+05:30 IST

మారిటల్ రేప్ – వైవాహిక బలాత్కారం నేరమా కాదా అనే అంశంపై ఎడతెగని వివాదం గురించి తెలిసిందే. భర్తకు రేప్ చేసే అధికారం లేదనే సూత్రాన్ని లేవనెత్తుతూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది....

‘పెళ్లి అంటే రేప్‌కి లైసెన్స్ కాదు’

మారిటల్ రేప్ – వైవాహిక బలాత్కారం నేరమా కాదా అనే అంశంపై ఎడతెగని వివాదం గురించి తెలిసిందే. భర్తకు రేప్ చేసే అధికారం లేదనే సూత్రాన్ని లేవనెత్తుతూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒక గృహిణి నిశ్శబ్దాన్ని ఛేదించి, తనపైన తన భర్త తొమ్మిదేళ్ల కూతురి ముందే బలవంతంగా అసహజ రీతిలో అతిక్రూరంగా రతికి పదేపదే ఒడిగడుతున్నాడని ఫిర్యాదు చేసారు. నేరారోపణల రద్దుకోసం తన ముందుకు వచ్చిన ఈ వివాదంలో కర్ణాటక హైకోర్టు ‘పెళ్లి అంటే రేప్ చేయడానికి లైసెన్స్ కాదు’ అని స్పష్టంగా ప్రకటించింది. ఒకవేళ భర్త, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే తప్పక శిక్షార్హుడని తీర్పు చెప్పింది. వివాహం చేసుకున్నంత మాత్రాన ఒక స్త్రీ మానసిక, శారీరక స్థితిని పట్టించుకోకుండా ఆమెతో లైంగిక చర్యలకు పాల్పడే హక్కు పురుషుడికి వుందా? నూటా అరవై రెండేళ్ల నుంచి అమలవుతున్న భారతీయ శిక్షాస్మృతిలో ఈ విషయమై శిక్షలు, నిర్వచనాలు ఉన్నాయా?


తీర్పు గురించి ఆలోచించే ముందు సంఘటన పూర్వాపరాల చర్చ చాలా అవసరం. ఒక మహిళ పోలీస్ స్టేషనుకి వెళ్లి, భర్త కొన్నేళ్లుగా తనతో క్రూరమైన, భయానకమైన, అసహజ పద్ధతుల్లో, తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, అదీ కన్న కూతురి ముందు లైంగిక హింసలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. నోటితో చెప్పలేనంత, రాయలేనంత భయంకరంగా భర్త చర్యల వివరాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని, దర్యాప్తు చేసి, ఆమె ఫిర్యాదులో వాస్తవాలున్నాయని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి సమగ్ర చార్జిషీట్ రూపొందించి జిల్లా సెషన్స్ కోర్ట్ ముందు ఉంచారు. సెషన్స్ కోర్ట్ కూడా ఆ సాక్ష్యాలను పరిశీలించి నేరారోపణల ధ్రువీకరణ ‘ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్’ దశ తరువాత కేసు ప్రాసిక్యూషన్‌కు స్వీకరించింది.


ఒక మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా పురుషుడు ఆమెపై లైంగిక చర్యలకు, వేధింపులకు పాల్పడితే దానిని రేప్, బలాత్కారం అని భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) నిర్వచించింది. ఎటువంటి లైంగిక దాడి, వేధింపు నేరనిర్వచన పరిధిలోకి వస్తాయో, వాటికి మినహాయింపులు ఏమిటో తదుపరి సెక్షన్లలో వివరించింది. పదిహేనేళ్లు దాటిన భార్యతో భర్త రతి జరిపితే అది రేప్‌గా పరిగణించలేం అని సెక్షన్ 375 రేప్ నిర్వచనం స్పష్టంగా చెప్పింది. అంటే 15ఏళ్ల లోపు భార్యతో శృంగారం జరిపితేనే అది వైవాహిక బలాత్కార నేరమై శిక్షార్హమవుతుంది. భారతీయ శిక్షాస్మృతి మారిటల్ రేప్‌ని ఈ విధంగా పాక్షికంగా గుర్తించినప్పటికీ, 15 సంవత్సరాల కన్న పైబడిన భార్య విషయంలో విస్తృత మినహాయింపు ఇచ్చింది. ప్రాథమిక హక్కులను పొందుపరిచిన రాజ్యాంగం రాక ముందు, వచ్చిన తరువాత కూడా ఈ నేర నిర్వచనం కొనసాగుతున్నది. కర్ణాటక మహిళ భర్త దీన్నే ఆసరాగా చేసుకొని హైకోర్టుని ఆశ్రయించాడు. తనమీద సెషన్స్ కోర్టులో ప్రాసిక్యూషన్ ఐపీసీ విరుద్ధమైనదని, తన భార్య వయసు 15ఏళ్ల పైనే కనుక మారిటల్ రేప్ అభియోగం చెల్లదని, కేసు కొట్టివేయవల్సిందేనని అభ్యర్థించాడు.


హైకోర్టు ఆ భర్తపై ఐపీసీ నియమాల ప్రకారం క్రిమినల్ ఆరోపణల ప్రాసిక్యూషన్ చెల్లదని కొట్టివేస్తుందా, లేక భార్య ఆరోపణల తీవ్రత దృష్ట్యా కింది కోర్టులో విచారణ కొనసాగించవచ్చునని ఆదేశిస్తే ఐపీసీ నియమాలకు ఎలా భాష్యం చెబుతుందా అని అందరూ ఎదురుచూసారు. కర్ణాటక హైకోర్టు అతను చేసింది రుజువైతే నేరమేనని, ఆ విధంగా రుజువు కావాలంటే కింది కోర్టులో విచారణ కొనసాగించడమే న్యాయమని తీర్పు ఇచ్చింది. నియమాలు వ్యతిరేకంగా ఉన్నా ఆ భర్తపైన బలాత్కారం నేరారోపణ విచారణను కర్ణాటక హైకోర్టు ఎందుకు అంగీకరించినట్టు? దీనికి సమాధానం కావాలంటే నేర న్యాయానికి సంబంధించిన రాజ్యాంగ మౌలిక నియమాలను హైకోర్టు ఏ విధంగా అన్వయించిందో పరిశీలించాలి.


మెకాలే 1860లో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)ని రచించాడు. భారతదేశంలో నేరనిర్వచనాలను ఈ విదేశీయుడు రూపొందించినప్పటికీ బ్రిటిష్ చట్టాలను ఉన్నదున్నట్టు దించకుండా, ఆనాటి భారతీయ సంప్రదాయాలు, వివక్షాపూరిత కట్టుబాట్లు, ఎగుడు దిగుడు సామాజిక సంబంధాలు, బ్రిటిష్ నేర న్యాయ మౌలిక సూత్రాలతో కలగలిపి సరికొత్త క్రిమినల్ నేరాల నిర్వచనాలను నిర్మించాడు. 1860లో మహిళలకు సమానత్వ హక్కులు, లింగ వివక్ష వ్యతిరేక హక్కులు ఊహాతీతమైన అంశాలు. ఐపీసీ అన్నది రాజ్యాంగం అమలులోకి రాకముందు నుంచే ఉంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భిన్నంగా కొన్ని నియమాలు ఐపీసీలో ఉన్నాయి. ఐపీసీని మన భారత రాజ్యాంగం, మన భారతీయ విలువల ఆధారంగా సవరించాల్సి ఉన్నప్పటికీ మన ప్రభుత్వాలు ఆ పనిచేయకుండా ఏదైనా పెద్ద విషాదసంఘటన జరిగినప్పుడో, కోర్టులు జోక్యం చేసుకొని కొట్టివేస్తూన్నప్పుడో మారుస్తూ నెట్టుకొస్తున్నారు. రాజ్యాంగ విలువలకు, కాలం చెల్లిన చట్టానికి మధ్య వైరుధ్యం వల్ల అప్పుడప్పుడు కొన్ని నేరాలు నేరాలు కాకుండా పోతున్నాయి. ఈ కేసులో భార్య విషాద గాథ దానికి ఉదాహరణ.


ఈ మహిళ ఫిర్యాదులో పేర్కొన్న మూడు అంశాలూ అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కులకు చెందినవి. మొదటిది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యల్లో పాల్గొనమని ఒత్తిడి చేయడం. రెండవది అత్యంత క్రూరంగా, అసహజమైన విధంగా ఆమెతో ప్రవర్తించడం. మూడవది కన్నకూతురు ముందే అసభ్యకరమైన రీతిలో వ్యవహరిస్తూ, కూతురు చూడలేక వెళ్లిపోతానంటే బలవంతంగా ఆపి, బంధించి, ఆమె కళ్లముందు రాక్షసరతికి పాల్పడడం. ఈ దారుణ చర్యలను రాజ్యాంగ సమానతా హక్కు, జీవన హక్కు, అభిప్రాయవ్యక్తీకరణ హక్కులు నిర్వచించే అధికరణాలు అంగీకరిస్తాయా? మరొక తీవ్ర ఆరోపణ ఏమంటే, ఆ కూతురిపైన కూడా భర్త లైంగిక దాడులకు పాల్పడట్టు ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు కనుక, అతనిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టవలసిందే. మెకాలే రాయని పోక్సో చట్టంలో నేరారోపణల విషయంలో భర్తకు మినహాయింపులు ఏమీ లేవు, దానిపై వివాదం కూడా ఏమీ లేదు. చర్చ అంతా భార్య భర్తపై చేసిన బలాత్కారపు ఆరోపణ గురించే.


భార్యాభర్తల ఆనందపూర్వక శృంగారంలో బలాత్కారాలకు తావు ఉంటుందా? ఒకరు మరొకరిని నొప్పించకుండా అనుకూలంగానో ప్రతికూలంగానో ఒప్పించడం కొన్నిసార్లు జరుగుతుంది. ప్రతికూలమైన సందర్భంలో దాన్ని రేప్ అనవచ్చా అనేదే సంక్లిష్టత. ఇష్టానికి వ్యతిరేకమయినా, కష్టమయినా సర్దుకుంటే, ఇబ్బంది లేదనుకుంటే, ఫిర్యాదు దాకా రాకపోతే... అనేక వైవాహిక అత్యాచారాలు పోలీసుల దాకా కోర్టులదాకా రాబోవు. వచ్చినా ప్రస్తుతం అమలులో ఉన్న ఐపీసీ నియమాల ప్రకారం నేరం కాబోదు. ఈ నేర నియమాల వెనుక న్యాయాన్యాయాల వివాదాలు ఉన్నాయి. ఒక స్త్రీకి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే లైంగిక హింస నుంచి రక్షణ కల్పించే ఐపీసీ చట్టం-, ఆ స్త్రీకి ఇష్టంలేకపోయినా, ఒప్పుకోకపోయినా లైంగికంగా హింసించే భర్త నుంచి ఏ విధమైన రక్షణా కల్పించడం లేదు. ఇది సబబేనా?


ఈ కేసులో హైకోర్టు ముందుకు వచ్చింది అప్పీలు కాదు. అంతకుముందు తుది దశ నేర నిర్ధారణ జరగలేదు. ఫిర్యాదులు, పోలీసులు చేసిన నేరారోపణలు స్పష్టంగా ఐపీసీ నియమాలకు విరుద్ధంగా ఉన్నపుడు వాటిపైన ప్రాసిక్యూషన్ జరిపించాలా వద్దా అనే పరిమిత అంశం మాత్రమే హైకోర్టు విచారణకు వచ్చింది. భార్య చేసిన ఆరోపణలు నిజాలని రుజువైతే ఆ దారుణం నేరం కాకుండా పోతుందా? రేప్ ఎందుకుకాదు? రేప్ కాకపోయినా తీవ్రహింస, క్రౌర్యం, దురుద్దేశపూర్వకంగా గాయపరచడం, అసహజరతి వంటి తీవ్ర నేరాల నిర్వచనంలోకి రాదా? భార్యాపిల్లల పట్ల ఇంత తీవ్రమైన నేరాలను భర్త, తండ్రి అనబడే వ్యక్తి చేస్తూ ఉంటే చట్టాలు, రాజ్యాంగ హక్కుల అధ్యాయం కూడా అందుకు అంగీకరిస్తే మనం ఏ నాగరిక వ్యవస్థలో ఉన్నామనుకోవాలి? అనే ప్రశ్నలకు సరైన సంవిధాన పూర్వక సమాధాన ఈ తీర్పు. న్యాయం పట్ల ఆసక్తి ఉన్నవారు, పడకగదిలో నేరాల దుర్మార్గాన్ని శిక్షించే వ్యవస్థ నాగరికతకు నిదర్శనం అనుకునే వారు చదవవలసిన తీర్పు. (‘లైవ్ లా’ వెబ్‌సైట్‌లో ఈ తీర్పు పూర్తిపాఠాన్ని వివరంగా చదువుకోవచ్చు).

మాడభూషి శ్రీధర్

Updated Date - 2022-04-24T05:39:56+05:30 IST