పెళ్లి వేడుకులకు కరోనా గండం

ABN , First Publish Date - 2021-04-22T05:03:16+05:30 IST

వివాహ వేడుకలకు కరోనా గండం వెంటాడుతోంది. రెండోదశ వ్యాప్తిలో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో వివాహాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. మే ఒకటి నుంచి వివాహాలకు ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కూడా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా వివాహాలకు బ్రేక్‌ పడింది.

పెళ్లి వేడుకులకు కరోనా గండం

 మే ఒకటి నుంచి ముహూర్తాలు
 ఇప్పటికే కల్యాణ మండపాలకు, బ్యాండులకు అడ్వాన్సులు
  కొవిడ్‌ నేపథ్యంలో వివాహాల నిర్వహణపై తల్లిదండ్రుల్లో అయోమయం
(మెళియాపుట్టి)

వివాహ వేడుకలకు కరోనా గండం వెంటాడుతోంది. రెండోదశ వ్యాప్తిలో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో వివాహాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. మే ఒకటి నుంచి వివాహాలకు ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కూడా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా వివాహాలకు బ్రేక్‌ పడింది. అప్పట్లో మార్చి నుంచి కరోనా వ్యాప్తి చెందడంతో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల నుంచి కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ నెలల్లో కొందరు వివాహాలు చేసుకున్నారు. ఈ ఏడాది 70 రోజుల పాటు శుక్రమూఢం కారణంగా వివాహాలు జరగలేదు. ఇక కరోనా తగ్గుముఖం పట్టిందని భావించి.. ఈ ఏడాది మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించారు. ముహూర్తాలు నిర్ణయించుకుని కల్యాణ మండపాలు, బ్యాండు మేళాలు, లైటింగ్‌, డెకరేషన్‌, కేటరింగ్‌లకు అడ్వాన్సులు ఇచ్చేశారు. తీరా ఈ నెల ఆరంభం నుంచి కరోనా రెండో దశ విజృంభిస్తూ.. రోజూ వేలాది సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది.  ప్రస్తుత పరిస్థితి చూస్తే వివాహాలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రోజు రోజుకూ కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేస్తుండడంతో వివాహాలు ఎలా నిర్వహించేది అన్న మీమాంసలో పడ్డారు. గత ఏడాది కన్నా పరిస్థితి దారుణంగా ఉండడంతో వివాహాలు వాయిదా వేసుకునే పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.


ఉపాధి పోతోందంటూ వ్యాపారుల ఆందోళన
వివాహాలు నిలిచిపోతే తమ ఉపాధి పోతుందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కల్యాణమండపం, కేటరింగ్‌, లైటింగ్‌, డెకరేషన్‌, కిరాణా దుకాణాలు ఇలా అనేక మంది వివాహాలపై ఆధారపడే వారు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదనకు గురవుతున్నారు. గత ఏడాది లాగే ఈ ఏడాది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికంగా బ్యాంక్‌లు, పైవేటు వ్యక్తుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడతామని  కొసమాలకు చెందిన  లైటింగ్‌ నిర్వహకుడు ధనంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-22T05:03:16+05:30 IST