విపత్తుల నిర్వహణకు శాశ్వత వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-21T10:24:56+05:30 IST

వర్షాలను ఎవరూ ఆపలేకపోయినా.. వాటివల్ల జరిగే నష్టం తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) మాజీ వైస్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.

విపత్తుల నిర్వహణకు శాశ్వత వ్యవస్థ

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి.. ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు

విపత్తులకు ముందు తీసుకునే చర్యలు కీలకం

రాష్ట్ర ఆదాయానికి హైదరాబాద్‌ కల్పవృక్షం

దీనిని కాపాడుకోవడానికి 12 వేల కోట్లు లేవా?

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఎన్‌డీఎంఏమాజీ వైస్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వర్షాలను ఎవరూ ఆపలేకపోయినా.. వాటివల్ల జరిగే నష్టం తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) మాజీ వైస్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం శాశ్వత వ్యవస్థ ఉండాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం లో ఆరేళ్లుగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా.. విపత్తుల నివారణకు ప్రభుత్వం వద్ద ప్రణాళికే లేకుం డా పోయిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాన ఆదా య వనరుగా ఉన్న కల్పవృక్షం లాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చుచేయలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రూ.లక్ష కోట్లు ఉంటాయా? అని ప్రశ్నించారు. భారీవర్షాలు, వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో శశిధర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..


ఆంధ్రజ్యోతి: వరదలు పెరగడానికి కార ణమేంటి?

మర్రి శశిధర్‌రెడ్డి: తక్కువ సమయంలో అధికంగా వర్షం కురవడం వల్లే వరదలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేయడం లేదు. గతంలో ఏటా పూడిక తీసేవాళ్లం. ప్రభుత్వం పూడిక తీతపై దృష్టి సారించలేదు. వర్షం ఎంత మేర, ఎక్కడ కురుస్తుందనే దానిపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వినియోగించుకోవడం లేదు. ఎన్‌డీఎంఏ తరపున మార్గదర్శకాలున్నా.. వాటిని అమ లు చేయడంలేదు. హైదరాబాద్‌ లో వర్షపునీరు 13నాలాల ద్వారా మూసీలో కలుస్తుంది. ఈ 13 నాలాలకు ఒక వాటర్‌షెడ్‌ (పరివాహక ప్రాంతం) ఉంది.  దీనిపై అధికారులకు, ప్రభుత్వంలో ఉన్నవారికి అవగాహన లేదు. 


ఆంధ్రజ్యోతి:గ్రేటర్‌లో నాలాల సామర్థ్యమెంత?

మర్రి శశిధర్‌రెడ్డి:గతంలో గంటకు 12-15 మిల్లీమీటర్లు వర్షం పడితే దానికి తగ్గ కెపాసిటీతో నాలాల నిర్మాణం జరిగింది. గంటకు 40 మిల్లీమీటర్లు వర్షపాతం పడినా తట్టుకునే విధంగా నాలాలు విస్తరించాలని ఎన్‌డీఎంఏ సూచనలు చేసింది. వాటిని  పాటించి ఉంటే విపత్తు తీవ్రత ఇలా ఉండేది కాదు. 


ఆంధ్రజ్యోతి:విపత్తులు సంభవించినప్పుడు చేయాల్సిందేంటి?

మర్రి శశిధర్‌రెడ్డి:విపత్తు సంభవించినప్పుడు తక్షణం తీసుకునే రక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అయితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది రక్షణ సహాయ కార్యక్రమాల కోసమే కాదు. విపత్తులకు ముందు, విపత్తుల తర్వాత తీసుకునే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశాం. విపత్తుల నివారణ కోసం ఒక రూపాయి ఖర్చు పెడితే కాలక్రమంలో రూ.25 ఆదా అవుతాయని గుర్తిం చాం. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ కార్యక్రమాలు, పునరావాస కల్పిం చి, రికవరీ, పునర్‌నిర్మాణం జరగాలి. నాలా ల రిటైనింగ్‌ వాల్‌కు ఔట్‌లెట్‌లు పెట్టాలి.


ఆంధ్రజ్యోతి:విపత్తు నిర్వహణ సంస్థ  పని చేయాలంటే?

మర్రి శశిధర్‌రెడ్డి:ఇంత బీభత్సం జరిగినా సీఎం నేతృత్వంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(ఎ్‌సడీఎంఏ) సమావేశం జరగలేదు. కల్పవృక్షం లాంటి హైదరాబాద్‌ను మనం కాపాడుకోవాలి. ఇక ముందు తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. సీఎం నేతృత్వం వహిస్తే యంత్రాంగమంతా మాట వింటుంది.  


ఆంధ్రజ్యోతి:పట్టణాల్లో వర్షపాతం పెరగడానికి కారణాలేంటి?

మర్రి శశిధర్‌రెడ్డి:గత 20 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది. కాంక్రీట్‌ జంగిల్‌ వల్లే వేడి పెరిగి... మేఘాలపై ప్రభావం ఎక్కువ పడి.. వర్షపాతం తక్కువ సమయంలో ఎక్కువ నమోదవుతోంది.  లండన్‌లో ఏటా సగటున 600 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. లండన్‌ సీవరేజీ సిస్టమ్‌... గంటకు 150 మిల్లీమీటర్లు కురిసినా డ్రైనేజీ ద్వారా నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థకు కొలమానం లండన్‌ విధానమే.  2016లో వరద వస్తే... ఒక్క వర్క్‌షాప్‌ పెట్టారు. ఆ తర్వాత దీనిలో తీసుకున్న నిర్ణయాలన్నీ మరిచిపోయారు. సీవరేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి రూ.12 వేల కోట్లు కావాలని సీఎం ప్రసంగాల్లో చెప్పారు. రాష్ట్రానికి ఇంత ఆదాయం ఇస్తున్న హైదరాబాద్‌కు రూ.12 వేల కోట్లు కేటాయించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఇది రాజకీయ విమర్శ కాదు... వాస్తవం.  


ఆంధ్రజ్యోతి: రాష్ట్రం స్వరూపం మారిపోయిందా?

మర్రి శశిధర్‌రెడ్డి:భూమి డిమాండ్‌తో వరదలు ఎక్కువగా వస్తున్నాయి. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగాయి. రాష్ట్రం స్వరూపం కూడా మారిపోయింది. భారీ వర్షాలతో రాష్ట్రమంతా జలమయం అవుతోంది. దీన్ని కట్టడి చేయాలన్నా... నష్టం తీవ్రత పెరగకుండా అడ్డుకోవాలన్నా శాశ్వత వ్యవస్థ ఉండాలి. ప్రధానంగా   ఆస్తి, ప్రాణనష్టం తగ్గించడానికి తగిన ప్రణాళిక ఉండాలి. దాన్ని అమలు చేసేందుకు శాశ్వత వ్యవస్థ ఉండాలి.  దీనికి పరిష్కారం విపత్తులకు ముందే వాటి తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. రాష్ట్రస్థాయిలో శాశ్వతంగా విపత్తుల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేసి, వైస్‌చైర్మన్‌ను పెట్టాలి. ఏడాది పొడవునా పనిచేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే వరదలతో నష్టం తీవ్రతను తగ్గించగలం. వరదల ప్రభావం పరోక్షంగా అభివృద్ధిపై పడుతుంది. అభివృద్ధిలో వెనుకబాటుకు కూడా కారణమవుతుంది. 

Updated Date - 2020-10-21T10:24:56+05:30 IST