Sep 17 2021 @ 20:43PM

‘మరో ప్రస్థానం’ ట్రైలర్: ప్రపంచంలో ఇద్దరే అసలైన మనుషులు.. వారెవరంటే?

తనీష్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా జాని దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర వంటి వారు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 


ట్రైలర్‌లోని.. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు.. ఒకడు చనిపోయిన వాడు ఇంకొకడు ఇంకా పుట్టనివాడు..’ డైలాగ్ ఈ చిత్రం ఏ తరహాలో తెరకెక్కిందో చెప్పేస్తోంది. బేస్డ్ ఆన్ టు అవర్స్ సిట్టింగ్ ఆపరేషన్ అనే టైటిల్‌తో మొదలైన ఈ ట్రైలర్.. చూస్తుంటేనే ఇదొక కొత్త తరహా చిత్రమనేది అర్థమవుతోంది. అనాధ అయిన నాకు జీవితం ఎప్పుడూ యుద్ధంలాగే అనిపించింది. ప్రపంచం ఒక యుద్ధభూమిలా కనిపించేది. మేఘీని నేను మొదటిసారి చూసినప్పుడు నా జీవితంలో లేనిది ఏంటో అర్ధం అయిన క్షణం.. అని తనీష్ చెప్పిన డైలాగ్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ హైలెట్‌గా ఉన్నాయి. అలాగే కెమెరా ఈ చిత్రానికి ప్రధానం అన్నట్లుగా షూట్ చేస్తున్న సీన్స్ చూయించారు. నేచురల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కెమెరా విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. టాలీవుడ్‌కి ఓ వైవిధ్యభరిత చిత్రం ఇవ్వబోతున్నాడనే విషయాన్ని డైరెక్టర్ జాని ఈ ట్రైలర్‌తోనే చెప్పేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది.