Sep 23 2021 @ 22:54PM

‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ

చిత్రం: ‘మరో ప్రస్థానం’

విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021

నిడివి: 2 గంటల 3 నిమిషాలు

నటీనటులు: తనీష్, ముస్కాన్ సేథి, రిషికా ఖన్నా, భానుశ్రీ మెహ్రా, గగన్ విహారి, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర, అమిత్, రవికాలే తదితరులు 

కెమెరా: ఎమ్ఎన్ బాల్ రెడ్డి

ఎడిటింగ్: క్రాంతి

సంగీతం: సునీల్ కశ్యప్

సమర్పణ: ఉదయ్ కిరణ్

నిర్మాణం: మిర్త్ మీడియా

రచన-దర్శకత్వం: జాని


‘మరో ప్రస్థానం’.. ఈ పేరు వినబడితే గుర్తొచ్చే పేరు శ్రీశ్రీ. ఈ టైటిల్‌తో సినిమా అంటే ఇదేదో విప్లవ సినిమా అయ్యింటుందని అంతా అనుకుంటారు. కానీ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రమని చిత్రయూనిట్ మొదటి నుండి చెబుతూ వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ స్పెషల్ ట్రీట్ ఇస్తుందని, ఇప్పటి వరకు ఈ తరహా చిత్రం రాలేదని, కొత్తగా ప్రయోగం చేశామని.. సినిమాకు సంబంధించిన ప్రతీ వేడుకలో చిత్రయూనిట్ చెబుతూనే ఉంది. అలాగే సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే నటీనటులందరితో రిహర్సల్ చేయడం జరిగిందని చెప్పారు. మరి ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న హీరో తనీష్‌కు ఈ చిత్రం బ్రేకిచ్చిందా?. అసలు ఈ సినిమాలో ఉన్న మ్యాటరేంటి? బాక్సాఫీస్ వద్ద నిలబడే సత్తా ఈ చిత్రంలో ఉందా? వంటి విషయాలను రివ్యూలో తెలుసుకుందాం. 


కథ:

ముంబై మాఫియా డాన్‌‌ ఇబ్రహీం(రవికాలే)తో కలిసి భారతదేశాన్ని నాశనం చేసి పాకిస్తాన్ వెళ్లిపోవాలనే ప్లాన్‌లో ఉన్న భాయ్ రాణే(కబీర్ దుహాన్ సింగ్).. హైదరాబాద్ కేంద్రంగా అనేక దురాగతాలు(హత్యాచారాలు, మర్డర్లు, పిల్లల్ని కిడ్నాప్ చేసి కిడ్నీలు తీయించడం వంటివి) చేస్తుంటాడు. క్రైమ్‌కి అడ్డాగా మారిన రాణే గెస్ట్‌ హౌస్‌లో పోలీసులు, మంత్రుల విలాసానికి అంతే ఉండదు. ఆ గ్యాంగ్‌లో అందరికంటే షార్ప్ అయిన శివ(తనీష్).. రాణే ఇచ్చిన ప్రతి పనిని చక్కబెడుతూ అతనికి రైట్ హ్యాండ్‌గా మారతాడు. అలాంటి శివ.. నైనీ(రిషికా ఖన్నా)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత క్రిమినల్ వృత్తిని వదిలేసి గోవాలో మంచి జీవితం ప్రారంభిద్దామనుకున్న శివ.. సడెన్‌గా మారి రాణే పక్కన ఉంటూనే అతని నేర సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని.. సీక్రెట్‌ కెమెరాతో బంధిస్తుంటాడు. శివలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటి? రాణే గ్యాంగ్‌కి సపర్యలు చేసే యువిధ(ముస్కాన్ సేథి)కు, శివకు ఉన్న లింకేంటి? తన మాఫియా వ్యవహారాలకు అడ్డుపడుతున్నాడని అడ్డగోలుగా నేవీ ఆఫీసర్‌ ఆల్బర్ట్(రాజా రవీంద్ర)ని చంపేసిన రాణే.. తన నేర సామ్రాజ్య రహస్యాలు తెలిసిన జర్నలిస్ట్ సమీరా(భానుశ్రీ మెహ్రా)ని ఎందుకు బంధించి ఉంచాడు? తనకి నమ్మకద్రోహం చేస్తుంది శివే అని రాణేకి ఎలా తెలుస్తుంది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? వంటి విషయాలకు సమాధానం తెలియాలంటే ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్రం అంతా తనీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. కేవలం ఒకే ఒక్క రోజు(24గంటలు) జరిగిన సంఘటనలతో నడిచిన ఈ చిత్రంలో ఇప్పటి వరకు కనిపించని తనీష్ కనిపిస్తాడు. అతని కెరీర్‌లో ఇదొక ఢిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. రాణే గ్యాంగ్‌లో ఇంటిలిజెంట్‌గా.. అలాగే నైనీ ప్రేమికుడిగా తనీష్ తన నటనలో వైవిధ్యతను కనబరిచాడు. యువిధగా ముస్కాన్ సేథి చలాకీగా కనిపించింది. లంగా, వోణిలో సినిమాకు రొమాంటిక్ టచ్ ఇచ్చేలా ఆమె పాత్ర ఉంది. ‘అంతకుమించి’ ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. నైనీ పాత్రలో రిషికా ఖన్నా కనిపించింది కాసేపే అయినా.. అందంగా ఉంది. తనీష్, రిషికా జోడీ బాగుంది. ఈ సినిమా టర్న్ అవ్వడానికి ఆమె పాత్రే కీలకం. విలన్‌ రాణే పాత్రకు మంచి వెయిటేజ్ ఇచ్చాడు దర్శకుడు. ఆ పాత్ర చేసిన కబీర్ దుహాన్ సింగ్ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు కానీ.. అంత పెద్ద భాయ్ అయి ఉండి గుంపులో గోవిందయ్యలా ప్రతి దానికి అతను ఇన్‌వాల్వ్ అవడమే.. లాజిక్‌గా అనిపించదు. తనీష్ ఫ్రెండ్ ఉద్ధవ్‌గా గగన్ విహారి‌కి మంచి పాత్ర లభించింది. జర్నలిస్ట్‌గా భానుశ్రీమెహ్రా పాత్రని కుర్చీకే పరిమితం చేశారు. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.. కానీ ఆమె నుంచి నిజం రాబట్టేందుకు చేసిన ఓ సన్నివేశం ప్రేక్షకులని అలరిస్తుంది. నేవీ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, ముంబై మాఫియా డాన్‌గా రవికాలే ఒక్కొక్క సీన్‌కే పరిమితం అయ్యారు. అమిత్‌, చాచా పాత్రలతో పాటు ఇతర పాత్రలలో చేసిన వారంతా.. వారి పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్. మాంటేజ్ సాంగ్స్ మంచి సాహిత్యంతో ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఎడిటింగ్‌తో పాటు మిగతా సాంకేతిక నిపుణుల పనితీరంతా ఓకే. ఇది సింగిల్ షాట్ మూవీ. మళ్లీ మళ్లీ చేసేందుకు వీలు లేనటువంటి మూవీ. అందుకే ముందే రిహర్సల్స్ చేసి మరీ తెరకెక్కించారు. సో నిర్మాణం పరంగా మంచి సపోర్ట్ లభించింది కాబట్టే దర్శకుడు ఇటువంటి ప్రయత్నం చేసి ఉంటాడనేది అర్థమవుతుంది. దర్శకుడు జాని ఓ కొత్త ప్రయత్నం చేశాడు. అందులో డౌటే లేదు. అతని ప్రయత్నానికి అభినందించవచ్చు. కాకపోతే స్టోరీలో థ్రిల్లింగ్ అనిపించే అంశాలు పెద్దగా లేవు. ఏదైనా తన వరకు వస్తే కానీ నొప్పి తెలియదు అనే విషయాన్ని తనీష్ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. అలాగే క్రైమ్ చేసిన ఎవడికైనా చావే శరణ్యం అనేలా సినిమా ముగించిన తీరు బాగుంది. స్టోరీ పరంగా ఆకట్టుకునే అంశాలు అంతగా లేవు కానీ.. కొత్తదనం కోరుకునేవారు సినిమా తెరకెక్కిన విధానం కోసం చూడవచ్చు. ‘‘విప్లవం యాడుందిరా.. నీ గుండెలోనే కూకుందిరా..’’ అంటాడు శ్రీశ్రీ. తనలో వచ్చిన మార్పుతో శివగా తనీష్ చేసిన యుద్ధమే ఈ మరో ప్రస్థానం. 

ట్యాగ్‌లైన్: సరికొత్త ప్రయత్నం