Abn logo
Aug 9 2020 @ 03:12AM

మార్కెట్లు ముందుకే!

  • మరింత పెరిగే ముందు విరామం
  • దీర్ఘకాలం మదుపర్లకు మంచిదే
  • 12,000 స్థాయికి నిఫ్టీ 
  • మార్చి తర్వాత మార్కెట్‌ 45% కోలుకుంది 
  • మోతీలాల్‌ ఓస్వాల్‌ పైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ అజయ్‌ మీనన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలో పడినప్పుడల్లా అంతే స్థాయిలో త్వరగానే కోలుకుంటోంది. అందువల్ల మార్కెట్‌ పడినప్పుడు వ్యూహాత్మకంగా మదుపు చేస్తే మదుపర్లకు ప్రయోజనం ఉంటుందని మోతీలాల్‌ ఓస్వా ల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ, సీఈఓ అజయ్‌ మీనన్‌ చెబుతున్నారు. మార్కెట్‌ స్థిరపడి.. కొంత విరామం తర్వాత మళ్లీ పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 12,000 స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని, అయితే అంతర్జాతీయ పరిస్థితులు, కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడంపై ఇది ఆధారపడి ఉందని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వివరాలు..


లాక్‌డౌన్‌ ప్రారంభంలో మార్కెట్‌ రికార్డు కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత త్వరగా కోలుకుంది. ఇలాంటి సందర్భాల్లో  రిటైల్‌ మదుపర్లు ఏం నేర్చుకోవాలి?

మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభంలో మార్కెట్‌ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇటువంటి సమయంలో రిస్క్‌ను తగ్గించుకోవడానికి, సంపద విలువను కాపాడుకోవడానికి మదుపర్లు షేర్లను విక్రయిస్తారు. మార్కెట్‌ బాగా పడినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన అంశమని గతంలో రుజువైంది. గతంలో అనేక కీలకమైన ఆర్థిక అంశాలు మార్కెట్‌పై ప్రభా వం చూపాయి. మార్కెట్‌ భారీగా పడిపోయింది. కొద్ది కాలానికి మళ్లీ కోలుకుంది. ప్రధాన మార్కెట్‌ క్షీణతలను పరిశీలించినట్లయితే.. క్షీణత తర్వాత ఏడాదిలో లాభాన్ని అందించింది. గత రెండు దశాబ్దాల్లో 30 శాతానికి పైగా మార్కెట్‌ పడిన నాలుగు ఘటనలను పరిశీలిస్తే.. నాలుగింటిలోనూ ఆరు నెల ల్లో నిఫ్టీ కోలుకుంది. గరిష్ఠంగా 46 శాతం పెరిగింది. ఈసారి కూడా 2020 మార్చిలోని రికార్డు కనిష్ఠ స్థాయి నుంచి 45 శాతం కోలుకుంది. అంటే  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావంతో మార్కెట్‌ పడిపోయినప్పుడు మదుపర్లు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండాలి.


లాక్‌డౌన్‌ కాలంలో కొత్త రిటైల్‌ మదుపర్లు పెరగటానికి గల కారణాలు?

ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కొత్త తరం యువత పొదుపు ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. షేర్‌ మార్కెట్‌ వైపు ఆకర్షితులయ్యారు. డిజిటలైజేషన్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వారిని మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు వీలు కల్పించాయి. అధిక రిస్క్‌ తీసుకునే స్వభావం ఉండడంతో పాటు ఇతర సాధనాలతో పోలిస్తే స్టాక్‌ మార్కెట్లో ప్రతిఫలాలు ఎక్కువ వచ్చే వీలున్నందున మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కొత్త మదుపర్లు పెరిగారు. మార్చి తర్వాత మార్కెట్‌ వెంటనే కోలుకోవడం కూడా మదుపర్లను ఆకర్షించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య సీడీఎ్‌సఎల్‌కు కొత్తగా 19.6 లక్షల ఖాతాలు వచ్చాయి. అంటే సగటున నెలకు 6.5 లక్షల ఖాతాలు ఉన్నాయి. నగదు విభాగం ట్రేడింగ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 2009 ఆగస్టు తర్వాత అత్యధిక గరిష్ఠ స్థాయికి చేరింది. 2019-20లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 50 శాతం ఉంటే.. గత మూడు నెలల్లో ఇది 68 శాతానికి చేరింది.


ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎటువంటి వ్యూహం అనుసరించాలి?

మార్కెట్‌ ఎప్పుడు భవిష్యత్తును అంచనా వేస్తుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఆశలతో భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ ఊహించిన దాని కంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటే నిఫ్టీ మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. లేదంటే ఈ స్థాయిల నుంచి పడిపోవచ్చు. వచ్చే కొద్ది నెలల తర్వాత కానీ స్పష్టమైన అంచనాకు రాలేం. అప్పటి వరకూ మార్కెట్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. ఒడిదొడుకులు దీర్ఘకాల మదుపర్లకు అవకాశం. వచ్చే కొద్ది వారాలు, నెలల్లో మూలాలు బాగున్న, మంచి కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహంగా భావించవచ్చు. అయితే.. ఒక సిస్టమాటిక్‌, స్థిరమైన పద్ధతిలో మదుపు చేయడం ముఖ్యం. స్వల్పకాల మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌పై మీ అంచనా ?

దేశీయ మార్కెట్‌ కోలుకుంది. అంతర్జాతీయ ద్రవ్యలభ్యత, వడ్డీ రేట్లు తగ్గడం షేర్‌ మార్కెట్‌ కోలుకోవడానికి దోహదం చేశాయి. హెల్త్‌కేర్‌, ఐటీ, టెలికాం తదితర రంగాలకు చెందిన షేర్లు కొవిడ్‌కు ముందు స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆటోమొబైల్‌, బీఎ్‌ఫఎ్‌సఐ వంటి రంగాల షేర్లు కూడా కోలుకున్నాయి. మార్కెట్‌ స్థిరపడుతుందని భావిస్తున్నాం. మరో విడత ర్యాలీకి ముందు కొంతకాలం విరామం ఉండగలదని అంచనా. పరిస్థితులు ఇలాగే మెరుగుపడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉంటే నిఫ్టీ 11,800- 12,000 స్థాయి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. 2020 మార్చి నుంచి నిఫ్టీ 46 శాతం, నిఫ్టీ మిడ్‌ క్యాప్‌100/స్మాల్‌క్యాప్‌ 100 వరుసగా 41%, 49% చొప్పున పెరిగాయి. మదుపర్లు టెలికాం, ఐటీ, స్పెషాలిటీ కెమికల్స్‌, హెల్త్‌కేర్‌, ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ షేర్లపై దృష్టి పెట్టొచ్చు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏది బెస్ట్‌ ?

అధిక రిస్క్‌ తీసుకుని వేచి ఉండే వారికి షేర్లే మంచిది. షేర్లలో అధిక ప్రతిఫలాలు వచ్చే వీలుంటుంది. అయితే.. మార్కెట్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. మంచి షేర్లను అంచనా వేయగల సామర్థ్యం ఉండాలి. అందువల్ల కొంత మొత్తాన్ని షేర్లలో తక్కువ రిస్క్‌ ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌లలో కొంత మొత్తాన్ని మదుపు చేయడం మంచిది. కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టాలనుకునే వారు నిపుణుల సలహా తీసుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement