మామిడి రైతుకు మార్కెటింగ్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-04-15T04:58:25+05:30 IST

మామిడి రైతుకు మార్కెటింగ్‌ కష్టాలు తప్పడం లేదు. ఫలరాజును పండించిన అన్నదాతలు ఆశించిన ధరలు అందక లబోదిబోమంటున్నారు.

మామిడి రైతుకు మార్కెటింగ్‌ కష్టాలు
జగిత్యాలలో కొనుగోలు చేసిన మామిడిని ప్యాక్‌ చేస్తున్న కార్మికులు

- ఆశించిన ధరలేక ఇబ్బందులు

- ఇరవై రోజుల్లో టన్నుకు రూ. 35 వేలు తగ్గిన మామిడి ధర

- సీజన్‌ ప్రారంభంలో టన్నుకు రూ. 65 వేలు, ప్రస్తుతం రూ. 30 వేలు

- వ్యాపారులు నిర్ణయించిందే ధర

జగిత్యాల, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): మామిడి రైతుకు మార్కెటింగ్‌ కష్టాలు తప్పడం లేదు. ఫలరాజును పండించిన అన్నదాతలు ఆశించిన ధరలు అందక లబోదిబోమంటున్నారు. దళారులు, వ్యాపారులు నిర్ణయించిందే ధరగా కొనసాగుతోంది. సీజన్‌ ప్రారంభంలో ఉన్న ధర ప్రస్తుతం సగానికి పైగా తగ్గింది. వ్యాపారుల మాయాజాలంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులే పంటల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకొని అధిక లాబాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మర్‌ పొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్‌లు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లాలో ఎక్కువగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ప్రతీ యేటా మార్కెటింగ్‌ కోసం ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చుకొని మార్కెట్‌కు మామిడి పండ్లను తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మామిడి తోటలను ముందస్తుగానే వ్యాపారులు గుత్తా చొప్పున ధరలు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు పండించిన మామిడిని మార్కెట్‌కు తరలించి ధరను పొందుతున్నారు. 

- సగానికి పైగా ధరలు తగ్గుముఖం..

జగిత్యాల జిల్లాలో మామిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుత సీజన్‌కు గానూ జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో మార్చి 25వ తేదిన వ్యాపారులు మామిడి కొనుగోళ్లు ప్రారంభించారు. సీజన్‌ ప్రారంభ రోజుల్లో టన్నుకు రూ. 65వేలు ధర పలికింది. సుమారు వారం రోజుల పాటు ధరలు కొంత అటు ఇటుగా పలికాయి. సీజన్‌ ప్రారంభమై ఇరవై రోజులైనా గడవక ముందే ధరలు సగానికి పైగా తగ్గాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారడం వల్లనే ధరలు తగ్గుముఖం పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జగిత్యాల మార్కెట్‌లో టన్ను మామిడి ధర రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. కేవలం ఇరవై రోజుల్లో టన్ను మామిడికి రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు తగ్గడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిందే ధరగా కొనసాగుతోంది.


- పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు.. 

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో మామిడి కొనుగోలు చేసే వ్యాపారులు దుకాణాలు తెరిచారు. పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ప్రత్యేక ఏజెంట్లను నియామకం చేసుకొని జగిత్యాలలో మకాం వేశారు. జిల్లా కేంద్రంలో గతంలో 73 మంది వ్యక్తులు లైసెన్స్‌లు పొంది వ్యాపారాలు చేశారు. ప్రస్తుత ఏడాది సుమారు మరో 20 మంది వ్యక్తులు లైసెన్స్‌లు పొంది వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అంచనాలున్నాయి. వ్యాపారుల సంఖ్య పెరిగినప్పటికీ రైతులకు ఎటువంటి లాబాలుండడం లేదు. వ్యాపారులు చెప్పిందే మామిడి ధరగా కొనసాగుతోంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో జగిత్యాల జిల్లాలోనే సుమారు 42 వేల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు మూడు నుంచి మూడున్నర టన్నుల మామిడి దిగుబడి వస్తుందన్న అంచనా ఉంది. ఉమ్మడి జిల్లాలోని మామిడిని సైతం పలువురు రైతులు జగిత్యాలకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రతీ యేటా జగిత్యాల కేంద్రంగా సుమారు రూ. 100 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. దేశంలోని పంజాబ్‌, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌, జైపూర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు జగిత్యాలకు వచ్చి ఏజెంట్లను నియామకం చేసుకొని మామిడిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన పంటను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కాగా మామిడిని మార్కెట్‌కు తరలించిన సమయాల్లో ధరలు లేకపోవడం వల్ల రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

Updated Date - 2021-04-15T04:58:25+05:30 IST