మార్కెట్‌ ఫీజు దందా..!

ABN , First Publish Date - 2022-08-17T05:32:48+05:30 IST

నెల్లూరుకి చెందిన ఓ ఎరువుల లారీ ఈ నెలలో ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది.

మార్కెట్‌ ఫీజు దందా..!

లారీ యజమానుల నుంచి అధిక వసూళ్లు
అడిగినంత ఇవ్వకపోతే దాడులు
అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న కాంట్రాక్టరు
పట్టించుకోని అధికారులు, పోలీసులు


నంద్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):  నెల్లూరుకి చెందిన ఓ ఎరువుల లారీ ఈ నెలలో ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. సరుకు అన్‌లోడ్‌ చేసే సమయంలో మార్కెట్‌ ఫీజు చెల్లించాలని బండ్లమెట్ట కాంట్రాక్టర్‌ లారీ యజమానిని అడిగాడు. అందుకు లారీ ఓనర్‌ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌కు   ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఏదైనా ఉంటే సంబంధిత షాపుల వాళ్ల దగ్గరే వసూలు చేసుకోవాలని సమాధానమిచ్చాడు.  అంతే.. రెచ్చిపోయిన కాంట్రాక్టర్‌ లారీ ఓనర్‌పైన దాడి చేశాడు. లారీ టైర్ల గాలి తీసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఇదీ ఆళ్లగడ్డలో మార్కెట్‌ ఫీజుల దందా. ఈ దౌర్జన్యం వెనుక అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే  కాంట్రాక్టర్లు రెచ్చిపోయి  తాము చెప్పినంత ఫీజు కట్టాల్సిందేనని, లేకపోతే  లారీలను ఆళ్లగడ్డలోనికి అడుగుపెట్టనివ్వబోమనన్న హుకుం జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా  అధికారులు తమ దృష్టికి రాలేదని తప్పించుకుంటున్నారు.  పోలీసులు కేసులు పెట్టకుండా చూస్తూ ఊరుకుంటున్నారు.  

ఆళ్లగడ్డ పట్టణానికి  నిత్యం వందల సంఖ్యలో లారీలు సరుకుల రవాణా చేస్తుంటాయి.  దీనికి   మునిసిపాలిటీకి ఫీజు చెల్లించాలి.  ఆ పనిని మునిసిపాలిటీ అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది.  వాళ్లు  నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.  లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే, చేయించుకునే షాపుల వారి వద్ద నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా, లారీల యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయంలో చిన్న లారీకి రూ.100, పెద్ద లారీకి రూ.300 వసూలు చేయాలని మునిసిపాలిటీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా చిన్న లారీకి రూ.400, పెద్ద లారీకి రూ.600 వసూలు చేస్తున్నారు. అంటు ఉన్న దానికి దాదాపు రెండు రెట్లు వసూలు చేస్తున్నారు.  

అధికార పార్టీ వారికి కొంత..

 కాంట్రాక్టర్లు దండుకుంటున్న దాంట్లో అధికార పార్టీ నాయకులకు వాటా ఉందనే వదంతులు ఉన్నాయి. వైసీపీ నాయకులు తమ జేబులు నింపే వారికే  కాంట్రాక్టుల న్నీ ఇస్తున్నారు. తమకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండటంతో తమను ఎవరేం చేస్తారన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత బండ్లమెట్ట కాంట్రాక్టరు కూడా వైసీపీకి చెందిన వార్డు కౌన్సిలరే అని సమాచారం. వారం రోజుల కింద ఆహోబిలంలో టోల్‌ నిర్వాహకులు బోర్డు మీద ఉన్న దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు దొరికిపోయారు.  

ఎస్పీ చెప్పినా..

లారీ యజమాని మీద స్థానిక కాంట్రాక్టరు దాడి చేయడంతో లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యవర్గం మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. తమ తప్పు లేకపోయినా దాడి చేయడం ఏమిటని, తమకు న్యాయం జరగాలని స్థానిక పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ రాజీకి ప్రయత్నించారు. దీంతో తమకు న్యాయం జరిగే పరిస్థితి లేదని భావించిన వారు నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్పీ టౌన్‌ పోలీసులకు ఫోన్‌ చేసి కేసు నమోదు చేయాలంటూ ఆదేశించారు. అయినా ఆళ్లగడ్డ పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు కలెక్టరు మన్‌జిర్‌ జిలాని సామూన్‌కు ఫిర్యాదు చేశారు.  

ఎందుకు కట్టాలి అన్నందుకు దాడి చేశారు

 నా పేరు చంద్రశేఖర్‌. మాది నెల్లూరు. ఈ నెల 14ను ఎరువులు లోడ్‌ తీసుకుని ఆళ్లగడ్డ పట్టణం బండ్లమెట్టకు వచ్చాను. అన్‌లోడింగ్‌ చేసే సమయంలో ఇక్కడి కాంట్రాక్టరు వచ్చి ఫీజు చేల్లించాలని అడిగాడు. షాపుల నుంచి వసూలు చేసుకోమని చెప్పాను. దీంతో  నా పై దాడి చేసి నా లారీ టైర్ల గాలి తీసి ధ్వంసం చేశారు.   

 ఇలా అయితే లారీలు నడపడం కష్టం
లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఫీజులు షాపుల వారి వద్ద నుంచే వసూలు చేయాలని  స్పష్టంగా ఆదేశాలున్నాయి. కానీ స్థానిక కాంట్రాక్టర్లు మా నుంచే వసూలు చేస్తున్నారు.  వారితో గొడవ ఎందుకుని సర్దుకు పోతున్నాం.  ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ దందాను ఆపాలి.

 - హిదాయతుల్లా, ట్రెజరర్‌, ఏపీ నమత లారీ యజమానుల సంఘం.

నా దృష్టికి రాలేదు
బండ్లమెట్ట మార్కెట్‌లో జరిగిన గొడవ నా దృష్టికి రాలేదు. స్థానిక పోలీసు స్టేషనులో కూడా ఎలాంటి కేసు నమోదు కాలేదని ఇప్పటి వరకున్న సమాచారం. కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించాలి. అలా కాకుండా ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

 - రమేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌, ఆళ్ళగడ్డ

Updated Date - 2022-08-17T05:32:48+05:30 IST