మార్కెట్‌ చైర్‌పర్సన్‌..అక్రమ దందా

ABN , First Publish Date - 2020-10-17T07:04:59+05:30 IST

అరికట్టాల్సినోళ్లే అక్రమ దందాకు పాల్పడుతూ అధికారులకు పట్టుబడ్డారు.

మార్కెట్‌ చైర్‌పర్సన్‌..అక్రమ దందా

అనుమతుల్లేని పురుగు మందుల విక్రయం

లక్నెపల్లిలో విక్రయిస్తుండగా పట్టుకున్న అధికారులు

స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణలత కీలకపాత్ర


నర్సంపేట టౌన్‌, అక్టోబరు 16 : అరికట్టాల్సినోళ్లే అక్రమ దందాకు పాల్పడుతూ అధికారులకు పట్టుబడ్డారు. అనుమతుల్లేని పురుగుల మందులు విక్రయిస్తూ శుక్రవారం అధికారులకు చిక్కడం కలకలం రేపింది. ఈ దందాలో ఏకంగా మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉండడం విస్మయానికి గురిచేసింది. అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 


నర్సంపేట మండలం లక్నెపెల్లిలో శుక్రవారం అనుమతుల్లేని పురుగుల మందులను రైతులకు విక్రయిస్తున్నట్టు మండల వ్యవసాయాధికారి టి.కృష్ణకుమార్‌, ఏఈవో మెండు అశోక్‌లకు సమాచా రం అందింది. దీంతో వారు లక్నెపల్లికి వెళ్లగా.. బ స్టాండ్‌ సెంటర్‌లో ఇన్నోవా వాహనంలోని వ్యక్తు లు, ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి రైతులకు పురుగుమందులను విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వాహనంలో ఉన్నది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అకినెపల్లి స్వర్ణలత, డ్రైవర్‌  ఆంజనేయులు, ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తిని సంగెం మండలం ఎల్గూర్‌ రంగంపేటకు చెందిన సేల్స్‌మన్‌ రావుల సదానందంగా గుర్తించారు. రూ.82వేల విలువైన అనుమతుల్లేని మందులు, వాహనంతోపాటు వారిని నర్సంపేట పోలీసు స్టేషన్‌కు తరలించి, పోలీసులకు ఫిర్యాదు  చేసినట్టు అధికారులు తెలిపారు. సమగ్ర  దర్యాప్తు అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేయనున్నట్లు నర్సంపేట టౌన్‌ సీఐని తెలిపారు.


ఊరూరా విక్రయాలు

స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, పెస్టిసైడ్‌ వ్యాపారి స్వర్ణలత.. తన వాహనంలో పురుగు మందులను ఏర్పాటు చేసుకొని ఊరూరు తిరుగుతూ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఏజెంట్లు, సేల్స్‌మెన్‌లను నియమించుకుని దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. తన వాహనంలో ఏదో ఒక గ్రామంలో అడ్డా ఏర్పాటు చేసుకొని అనుమతులు లేని పురుగుమందులను విక్రయిస్తున్నట్లు వ్యవసాయాధికారులు అనుమానిస్తున్నారు.


చైర్‌పర్సన్‌ ఇంట్లో తనిఖీ

స్టేషన్‌ఘన్‌పూర్‌: నకిలీ పరుగుల మందులు నిల్వ చేశారనే ఉన్నతాధికారుల సమాచారంతో మండలంలోని తాటికొండ గ్రామంలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ అక్కెనపల్లి స్వర్ణలత ఇంట్లో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి నాగరాజు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్నెపల్లిలో మార్కెట్‌ చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమతి లేని పురుగుల మందులు విక్రయిస్తుండగా పడ్డుబడ్డారన్నారు. రూరల్‌ జిల్లా అధికారుల అదేశాల మేరకు చైర్‌పర్సన్‌ ఇంట్లో, అదేవిధంగా గ్రామంలో గల ఎరువుల విక్రయ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించామని, ఎక్కడా ఎటువంటి పురుగుమందులు లభించలేదని అన్నారు. 

Updated Date - 2020-10-17T07:04:59+05:30 IST