మర్కజ్ ఖాళీ చేయించేందుకు అజిత్ డోబాల్ ఆపరేషన్

ABN , First Publish Date - 2020-04-01T18:50:11+05:30 IST

ముస్లిమ్ ఉలేమాలను ఆసుపత్రికి తరలించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రంగంలోకి దిగారు.....

మర్కజ్ ఖాళీ చేయించేందుకు అజిత్ డోబాల్ ఆపరేషన్

న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా తబ్లిగ్ జమాత్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా పలువురికి కరోనావైరస్ ప్రబలిన నేపథ్యంలో ముస్లిమ్ ఉలేమాలను ఆసుపత్రికి తరలించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రంగంలోకి దిగారు. నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ మొదట నిరాకరించారు. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ను రంగంలోకి దించారు. విదేశీయులతోపాటు పలువురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ ప్రాంతంలోని బంగ్లేవాలీ మసీదులో ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అజిత్ డోబాల్ ముస్లిమ్ ఉలేమాలతో చర్చించి వారిని ఒప్పించారు. మసీదులోని వారందరికీ పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించి, వైరస్ ప్రబలకుండా మసీదును శుభ్రపర్చారు. మొత్తంమీద 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించారు.


ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలోనే 216 మంది విదేశీయులున్నారు. దీంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మసీదుల్లో 800 మంది ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ లకు చెందిన వారున్నారని తేలడంతో వారందరికీ వైద్యపరీక్షలు చేయించి, వీసా నిబంధనల ఉల్లంఘనపై వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. టూరిస్టు వీసాలపై వచ్చిన విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని హోంశాఖ అధికారులు చెప్పారు.


వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులు మళ్లీ మనదేశంలోకి ప్రవేశించకుండా వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని హోంశాఖ నిర్ణయించింది. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు ఎవరెవరు ఢిల్లీ సమావేశానికి వచ్చారో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఢిల్లీ సమావేశానికి వచ్చిన వారందరినీ క్వారంటైన్ కు తరలిస్తున్నారు. 

Updated Date - 2020-04-01T18:50:11+05:30 IST