స్థలాల చదునులో స్వాహా పర్వం

ABN , First Publish Date - 2020-07-15T18:04:41+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..

స్థలాల చదునులో స్వాహా పర్వం

మార్కాపురంలో రూ. కోటి దోచుకునేందుకు రంగం సిద్ధం 

మట్టి కోసం కొండను కరిగిస్తున్న అధికార పార్టీ నాయకులు

ఉపాధి కూలీల కోసం ప్రత్యేకంగా రూ. 14లక్షలకు ప్రతిపాదనలు 

యంత్రాలతో పనులు 

కన్నెత్తిచూడని అధికారులు 


ప్రకాశం(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అక్రమార్కులకు వరంగా మారింది. ఎంపిక చేసిన భూములకు సంబంధించి లేఅవుట్ల పనుల్లో  అధికారపార్టీ నాయకులు భారీ అవినీతికి తెరతీశారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూములను చదును చేయడం, మెరకలు తోలడం వంటి పనులను చేజిక్కించుకున్న వారు ఆదాయమే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మార్కాపురంలో రూ. కోటి మేర స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉపాధి కూలీలకు పని కల్పించకుండానే చేయించినట్లు రికార్డుల్లో చూపించి మరో రూ. 14లక్షలు కాజేసేందుకు పన్నాగం పన్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


మార్కాపురం పురపాలక సంఘంలోని పేదలకు నివేశన స్థలాలను రెండు విడతలుగా పంపిణీ చేసేందుకు మండలంలోని ఇడుపూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. రెండో విడత 720 మందికి 1,600 ప్లాట్లను పంపిణీ చేసేందుకు సర్వే నంబర్‌ 265/2లో 18 ఎకరాలు కేటాయించారు. అయితే ఆ భూమి వాగులు, వంకలతో ఉంది. ఈ రెండుచోట్ల భూమిని అభివృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పథకం కింద రూ.99,36,500తో అంచనాలు తయారు చేశారు. దానికి ఉపాధి కూలీలకు చెల్లించే రూ. 13,84,348 అదనం. ఆ ప్రకారం చూస్తే ఆ భూమి అభివృద్ధికి రూ.1.13కోట్లు వెచ్చించనున్నారు. 


నిబంధనలు ఇలా...

ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హౌసింగ్‌ కాలనీ పేరుతో అభివృద్ధి పనులను ఉపాధి హామీ కింద చేసేందుకు అను మతిచ్చింది. ఇందులో పనిచేసిన కూలీకి రోజుకు రూ. 205 చెల్లించాలి. ఇడుపూరు వద్ద అభివృద్ధి చేస్తున్న హౌసింగ్‌ కాల నీకి సంబంధించి నాలుగు వర్క్‌ ఐడీలలో రూ.13,84,348లకు కూలి డబ్బులుగా అంచనాలు తయారు చేశారు. అంటే 5,840 పనిదినాలు కల్పించాలి. అంతేకాకుండా భూమిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన మట్టిని 5 కిలో మీటర్ల పరిధి నుంచి తీసుకొచ్చినందుకు ఒక ట్రాక్టర్‌ కు రూ.500 చెల్లిస్తారు. ఆ ప్రకారం  4ఐడీల కింద మట్టి సరఫరా చేసినందుకు రూ. 99,36,500 లక్షల మేరకు అంచనాలు తయారు చేశారు. దీనికి సాంకే తిక పరమైన అనుమతులు లభించాయి. ఉపాధి  పనులు కావడంతో వలన పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్లర్‌ బిల్లులు సమర్పిస్తే వెంటనే చెల్లిస్తారు. 


కొండను తవ్వేస్తున్నారు...

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి స్థలాల పంపి ణీకి ఎంపిక చేసిన భూముల అభివృద్ధి పనులను అధికార పా ర్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు  దక్కించుకున్నారు. స్థలాల అభివృద్ధికి అవసరమైన మట్టికోసం ఆ భూమిని ఆనుకొని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రతిరోజూ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు అక్కడకు వెళుతున్న రెవెన్యూ అధికారులు ఇదేమిటి అన్న పాపానపోలేదు. ప్రభుత్వ నిబం ధన మేరకు తవ్వకం పనులను పర్యవేక్షించాల్సిన గనుల శాఖా ధికారులు విషయం తెలిసినప్పటికీ మిన్నకున్నారు. ఇందుకు సంబంధించి అధికారపార్టీ నాయకుడి నుంచి ఆయా అధికా రులకు ఫోన్లు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.


ఉపాధి కూలి డబ్బులకూ ఎసరు..

కరోనాతో అన్నిరకాల పనులు నిలిచిపోయాయి. ఉపాధి పనులు చేసుకుంటూ ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. ఈ నేపఽథ్యంలో ఉపాధి హామీ కింద డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హౌసింగ్‌ కాలనీలో చేపట్టే మట్టి పనులను కూలీలతో చేయించాలి. అందుకోసం ఇడుపూరు వద్ద భూమి అభివృద్ధికి రూ.13,84,348ల కూలి చెల్లించాల్సి ఉంది.  కానీ యంత్రాలతోనే పనులు పూర్తి చేస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ పని మాదికాదు, మరో శాఖదని ఒక అధి కారి, మాది కాదు వారిదని ఇంకో అధికారి ఇలా.. ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. ఆ పనుల జోలికి వెళ్తే నియో జకవర్గంలోని అధికారపార్టీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మరికొందరు అటు వైపు చూడటం లేదు.


రెవెన్యూ అధికారులను అడగండి

కొండను తవ్వే విషయం మా దృష్టికి రాలేదు. కొండలు, వాగులు మొదలగు వాటన్నింటినీ పరిరక్షించాల్సింది రెవెన్యూ అధికారులే. వారి నుంచి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అక్కడ తవ్వకాలు జరపటానికి మాకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. 

- వెంకట కృష్ణ, ఏడీ, గనులశాఖ


Updated Date - 2020-07-15T18:04:41+05:30 IST