మార్కాపురంపై మమకారమేది!

ABN , First Publish Date - 2020-11-22T06:00:31+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇటీవల ఊపందుకుంది. అందుకు సంబంధించిన అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ముందుగానే గిరిజన ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలోని అరకు లోక్‌సభ ప్రాంతంలో అదనపు జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

మార్కాపురంపై మమకారమేది!

నోరు మెదపని అధికార పార్టీ నేతలు 

ఉద్యమాలకు ఆదిలోనే హంసపాదు

సంతనూతలపాడు కోసం 

పట్టుబడుతున్న అధికారపార్టీ నేతలు 

కొత్త జిల్లాల ఏర్పాటు తీరుతెన్నుపై

పశ్చిమ ప్రజానీకం తీవ్ర అసంతృప్తి 



వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడిన జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఏ సందర్భంలోనూ సరైన న్యాయం జరగటం లేదు. సామాజిక, ఆర్థికాభివృద్ధి అంశాలతో పాటు రాజకీయంగా కూడా ఆ ప్రాంతం చిన్నచూపునకు గురవుతోంది. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలోనూ మార్కాపురం డివిజన్‌ వాసుల ఆలోచనలు, అభిప్రాయాలు, అవసరాలకు మద్దతు పలికేవారు కరువయ్యారు. ప్రత్యేకించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ ఇస్తున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు మా గోడు పట్టించుకోవడం లేదంటూ ఆ ప్రాంత అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అక్కడి ప్రజల ఆకాంక్షలను కనీసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా అధికార పార్టీ నేతలు సాహసించకపోవటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో ఒంగోలులో కలిసి ఉండే సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాన్ని జిల్లాలోనే ఉంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు తెరచాటు రాజకీయాలను ప్రారంభించారు. కానీ మార్కాపురం ప్రాంతవాసులు మాకు జిల్లా కావాలంటూ నినదిస్తున్నా పట్టించుకోకపోగా, ఉద్యమం పెరగకుండా కట్టడి చేయాలంటూ పోలీసు అధికారులకు హుకుం జారీ చేశారు.  

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇటీవల ఊపందుకుంది. అందుకు సంబంధించిన అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ముందుగానే గిరిజన ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలోని అరకు లోక్‌సభ ప్రాంతంలో అదనపు జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రత్యేకించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆపార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటులో చేర్పులు, మార్పుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అందుకనుగుణంగా పార్టీ రహితంగా ఉద్యమాలకు కూడా శ్రీకారం పలికారు.  

మార్కాపురంపై నోరు మెదపని నేతలు 

జిల్లా ఆవిర్భావానికి ముందు మార్కాపురం డివిజన్‌ ప్రాంతం కర్నూలు జిల్లాలో, కందుకూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేవి. వీటితోపాటు గుంటూరు జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. పశ్చిమప్రాంతం వారు ఆరంభం నుంచి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఆరాటపడుతున్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం ఆ ప్రాంతానికి సంబంధించి ఏరంగంలోనూ ఆశించిన అభివృద్ధి జరగలేదు. రాజకీయంగా కూడా ఆ ప్రాంత నాయకులకు పార్టీ ఏదైనా పెద్ద ప్రోత్సాహం ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఒంగోలుకు బహుదూరంలో ఉంది.  దోర్నాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, రాచర్ల లాంటి ప్రాంతాలకు అధికారులు వెళ్లాలంటే ఒకరోజంతా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇక ఆ ప్రాంతవాసులు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వచ్చి పోయేందుకు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలని అక్కడి ప్రజలు ఆశించటంలో ఏమాత్రం తప్పులేదు. అందుకనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనీ భావించారు. మార్కాపురం జిల్లా సాధన ఐక్య కార్యాచరణ  సమితి కూడా ఏర్పడింది. వారు తొలుత అధికారపార్టీ నేతల చుట్టూ తిరిగారు. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, నేతలు కానీ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోయారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు సాధ్యమా.. కాదా అన్న విషయాన్ని పక్కన బెడితే ప్రయత్నించాల్సిన అవసరం లేకపోలేదు. 

అధికార పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి

మార్కాపురం డివిజన్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో  2014, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో అయితే కనిగిరి, దర్శిలోనూ గెలుపొందారు. ప్రారంభం నుంచి కూడా ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆ ప్రాంతాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో సహజంగానే ప్రజల ఆకాంక్షకు అనుగుణ ంగా ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశతో వైసీపీ శ్రేణులు ఎదురుచూశారు. కిందిస్థాయి నాయకులంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. అధికారంలో ఉండి బయటకు రాకూడదన్న ఉద్దేశంతో రోడ్డెక్కలేదు. అయితే ఈ విషయాలను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించి తమవంతు ప్రయత్నం చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వెళ్తే మంత్రులకు వినతిపత్రాలు ఇప్పించటం, ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పటానికే పరిమితమయ్యారు. ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలన్న డిమాండ్‌కి ఎంతో కొంత సడలింపునిచ్చింది.  గిరిజన ప్రాంతంలో అదనపు జిల్లా ఏర్పాటు అందుకు నిదర్శనం. ఆరకంగా చూసినా మార్కాపురం డివిజన్‌లో నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉంది. అందులోనూ గిరిజన ప్రజానీకం నివసిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు అధికార పార్టీ నేతలు వెనుకంజ వేశారన్న భావన ఆపార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. దీంతో పశ్చిమ ప్రాంత ప్రజానీకంలో ప్రత్యేకించి వైసీపీ శ్రేణుల్లో ప్రభుత్వ వైఖరిపైనా, స్థానిక నేతల తీరుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

న్యాయమే అయినా 

సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడే బాపట్ల జిల్లాలో కాకుండా ఒంగోలు జిల్లాలో ఉండాలని కోరటం సమంజసమే. ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కలిసి ఉంటుంది. అలాంటి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపటం ఆ ప్రాంత వాసులకు ఇబ్బందికరమే. వైసీపీ ప్రజాప్రతినిధులు కొందరు సంతనూతలపాడుని ఒంగోలు జిల్లాలో ఉంచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక కీలక ప్రజాప్రతినిధి అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఒక్కో జిల్లాలో కనీసం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని, అత్యధికంగా 8కి మించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరకంగా ఒంగోలు కేంద్రంగా ఏర్పడే జిల్లాలో 8వ అసెంబ్లీ నియోజకవర్గంగా సంతనూతలపాడును ఉంచాలని వారు నేరుగా సీఎంనే కోరినట్లు తెలుస్తోంది. ఒంగోలు కేంద్రంగా ఉన్న జిల్లాకు ప్రకాశం జిల్లా అని నామకరణం చేశారు. దివంగత ప్రకాశం పంతులు జన్మస్థలం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉండటాన్ని కూడా ఓ కారణ ంగా చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో పశ్చిమప్రాంతంలో, మరీముఖ్యంగా మార్కాపురం డివిజన్‌లోని వైసీపీ శ్రేణుల్లో ఆవేదన అధికమైంది. ఒంగోలు లోక్‌సభను జిల్లాగానే ఉంచుతూ కనీసం మధ్యలో ఉండే ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అయినా మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఉద్యమంపై ఉక్కుపాదం? 

జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు విఘాతం కలిగే విధంగా ఎక్కడైనా ఉద్యమాలు ప్రారంభమైతే వాటిని వెంటనే అణిచివేయాలని పోలీసు శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆసందర్భంలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ ప్రారంభమైన డిమాండ్‌ గురించి ప్రస్తావనకు రాగా అలాంటివి కొనసాగటానికి వీల్లేదు, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని నేరుగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా పోలీసు ఉన్నతాధికారులు కూడా జిల్లాలోని పోలీసు అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తదనుగుణ ంగా పోలీసు అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణ ంగా ఎక్కడైనా ఉద్యమించేందుకు ముందుకొచ్చిన వారిని తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-11-22T06:00:31+05:30 IST