దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ.. ఉద్యోగుల డిమాండ్లకు అంగీకారం!

ABN , First Publish Date - 2020-06-06T13:39:48+05:30 IST

జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ ఓ మెట్టు దిగిరాకతప్పలేదు. సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన ఇటీవల హామీ ఇచ్చారు.

దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ.. ఉద్యోగుల డిమాండ్లకు అంగీకారం!

 మెన్లో పార్క్(క్యాలిఫోర్నియా): జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ ఓ మెట్టు దిగిరాకతప్పలేదు. సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన ఇటీవల హామీ ఇచ్చారు.


వివాదాస్పద కామెంట్లను ఇప్పటి వరకూ ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడమేమిటంటూ ఉద్యోగులు.. ఆల్ హ్యాండ్స్ డౌన్ సమావేశంలో మార్క్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే. ‘లూటీలు మొదలైతే కాల్పులు మొదలవుతాయి’ అంటూ ట్రంప్ పెట్టిన పోస్ట్‌ విషయంలో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌ను తక్షణం తొలగించడమో లేక వినియోగదారులను హెచ్చరి్ంచే విధంగా మరేదైనా చర్య తీసుకోవడమో చేయాలంటూ డిమాండ్ చేశారు.


అయితే..మార్క్ ఈ సూచనకు తొలుత అంగీకరించలేదు. అధ్యక్షుడి పోస్టులను తొలగించడం కష్టం అని, అవి కంపెనీ నిబంధనలను అతిక్రమించలేదని మార్క్ తొలుత సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  సంస్థ విధానంలో సంస్కరణల విషయమై యోచిస్తానంటూ ఆయన పొడి పొడిగా సమాధానం ఇచ్చారు.


ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలగ జేసింది. ఈ క్రమంలో కొందరు సిబ్బంది సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కూడా సమాచారం. ఇలా నిరసనల సెగ తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఈఓ మార్క్ తాజాగా ఓ మెట్టు దిగివచ్చారు. ఉద్యోగులు కోరుకున్న విధంగా వివాదాస్పద ఫేస్‌బుస్ పోస్టులకు సంబంధించి సంస్థ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అంగీకరించారు.


‘ట్రంప్ పోస్టును వివాదాస్పదమైనదిగా గుర్తించాలంటూ మీరు కొరుకుంటున్నారని నాకు తెలుసు. దీనిపూ సమీక్షిస్తున్నాం. ప్రభుత్వాలు బలప్రయోగాన్ని పోత్సహించే విషయాలకు సంబంధించి ఫేస్‌బుక్ నిబంధనలు పరిశీలిస్తున్నాం. చేయవలసిన మార్పులను తప్పక చేస్తాం. వివాదాస్పద పోస్టులను తొలగించడం లేదా అట్టే పెట్టడంతో పాటూ ఇతర చర్యలు ఏమైనా తీసుకోగలమా అనే విషయంలో కూడా సమీక్షలు చేపడుతాం’ అని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-06T13:39:48+05:30 IST