వాళ్లే జైలుకు వెళ్తారు: ఈడీ రైడ్స్‌పై సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-03-08T22:49:19+05:30 IST

ఈడీలో ఉన్న కొంత మంది అధికారులు బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీకి ఈడీ ఏటీఎంలాగ మారింది. ఈ అధికారుల దోపిడీకి సంబంధించిన రికార్డులను నేను ప్రధానమంత్రికి అందించాను. క్రిమినల్ సిండికేట్, ఈడీ అధికారుల..

వాళ్లే జైలుకు వెళ్తారు: ఈడీ రైడ్స్‌పై సంజయ్ రౌత్

ముంబై: శివసేన నేతలకు సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాలల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) నిర్వహిస్తోన్న సోదాలపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. క్రిమినల్ సిండికేట్, ఈడీ అధికారుల దోపిడీ రాకెట్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నారన్న ఆయన.. ఈరోజు తమ పార్టీ వ్యక్తులపై సోదాలకు వచ్చిన ఈడీ అధికారుల్లో కొందరు తొందరలోనే జైలుకు వెళ్తారని అన్నారు. బెంగాల్, మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలను ఎంచుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించిన ఆయన మహా వికాస్ అగాఢి ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదని విమర్శించారు.


మంగళవారం ఈడీ అధికారులు ముంబై, పూణె నగరాల్లోని కొన్ని కార్యాలయాలు, ఇళ్లల్లో ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలు నిర్వహించిన కార్యాలయాలు, ఇళ్లు.. శివసేన నేతలైన ఆదిత్య థాకరే, అనిల్ పరబ్‌లకు సన్నిహితులవి. దీంతో సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఈడీలో ఉన్న కొంత మంది అధికారులు బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీకి ఈడీ ఏటీఎంలాగ మారింది. ఈ అధికారుల దోపిడీకి సంబంధించిన రికార్డులను నేను ప్రధానమంత్రికి అందించాను. క్రిమినల్ సిండికేట్, ఈడీ అధికారుల దోపిడీ రాకెట్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించబోతున్నారు. నా మాటలు రాసి పెట్టుకోండి. ఈడీ అధికారుల్లో కొందరు తొందరలోనే జైలుకు వెళ్తారు’’ అని అన్నారు.

Updated Date - 2022-03-08T22:49:19+05:30 IST