మేరియుపోల్‌ మా వశమైంది

ABN , First Publish Date - 2022-04-22T07:04:01+05:30 IST

ఉక్రెయిన్‌లో కీలకమైన పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌ పూర్తిగా తమ

మేరియుపోల్‌ మా వశమైంది

  •  నగరానికి విముక్తి లభించింది: పుతిన్‌


మాస్కో, ఏప్రిల్‌ 21: ఉక్రెయిన్‌లో కీలకమైన పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌ పూర్తిగా తమ వశమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. మేరియుపోల్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. గురువారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన భేటీలో పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘మేరియుపోల్‌ విముక్తి కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతంగా పూర్తవడం గొప్ప విషయం. మీకు అభినందనలు. అక్కడి పారిశ్రామిక ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదు’’ అని పుతిన్‌ పేర్కొన్నారు.


కానీ, అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం మాత్రం ఇంకా తమ అధీనంలోకి రాలేదని అంగీకరించారు. ఆ కర్మాగారంపై దాడి చేయొద్దని, అక్కడి నుంచి ఈగ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేకుండా దిగ్బంధించాలని బలగాలను ఆదేశించారు. అంటే ఆహారం, ఆయుధ నిల్వలు అడుగంటిపోయిన తర్వాత అందులోని సైనికులు వచ్చి లొంగిపోతారని, అప్పటి వరకు ఎదురు చూడాలన్నది పుతిన్‌ ఉద్దేశమని భావిస్తున్నారు. దాదాపు 11 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కర్మాగారం ఉక్రెయిన్‌ సేనలకు చివరి స్థావరంగా నిలిచింది. ఈ కర్మాగారంలో సొరంగాలు, బంకర్లు ఉన్నాయి.


అజోవ్‌స్తల్‌ లోపల సుమారు 2000 మంది సైనికులు ఉన్నారు. దీని కమాండర్‌ షెర్హీవ్‌ వోల్యన్‌.. తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. కానీ, గాయపడిన 500 మంది సైనికులకు సాయం అందజేయాలని ప్రపంచ దేశాలను కోరారు. వందల మంది పిల్లలు, మహిళలు ఈ ప్లాంట్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ తరఫునమేరియుపోల్‌ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అడెన్‌ అస్లైన్‌, సహున్‌ పిన్నర్‌లను రష్యా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి.


ఈ స్టీల్‌ ప్లాంట్‌లో మిగిలిన మరో దళం అజోవ్‌ బ్రిగేడ్‌. దాదాపు 900 మంది అతివాదులు ఇందులో ఉన్నారు. మెరైన్‌ బ్రిగేడ్‌ బృందం గత వారం నుంచి వీరితో కలిసి రష్యాపై యుద్ధం చేస్తోంది. ఈ కర్మాగారంలో 1000 మందికి పైగా పౌరులు కూడా ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాలని, వారికి ఎటువంటి హాని తలపెట్టమని, వైద్య సాయం అందిస్తామని రష్యా రక్షణ మంత్రి తెలిపారు. 



క్రిమియా-డాన్‌బాస్‌ ‘మార్గం’ సుగమం

ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి మేరియుపోల్‌పై తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు నగరంలో చిక్కుకుపోయారు. మేరియుపోల్‌ను చేజిక్కించుకోవడం రష్యాకు అత్యంత కీలకం. రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్‌బా్‌సకు, 2014లో ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో మేరియుపోల్‌ ఉంది. అంటే ఇకపై క్రిమియాకు, డాన్‌బాస్‌ ప్రాంతానికి మధ్య భూమార్గంలో రవాణాకు రష్యన్లకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు.


కాగా, ఉక్రెయిన్‌ తూ ర్పు భాగాన ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను చేజిక్కించుకునే లక్ష్యంతో రష్యా దాడులను ముమ్మరం చేసింది. మరిన్ని బలగాలను యుద్ధరంగంలోకి దింపింది. డాన్‌బా్‌సను దక్కించుకోవడం తమ ప్రధాన లక్ష్యమని రష్యా ప్రకటించింది. మరోవైపు లుహాన్స్క్‌ ప్రాంతాన్ని 80 శాతం రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని గవర్నర్‌ సెరియ్‌ హయిదాయ్‌ తెలిపారు. 


Updated Date - 2022-04-22T07:04:01+05:30 IST