ఏయూ సహకారంతో సముద్ర ప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2022-05-20T05:47:44+05:30 IST

విశాఖ సాగర్‌ తీరంలో రిప్‌ కరెంట్‌ల బారినపడి సంభవిస్తున్న మరణాలను తగ్గించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది.

ఏయూ సహకారంతో సముద్ర ప్రాజెక్ట్‌
సముద్ర తీరాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

రుషికొండ తీరంలో ప్రారంభమైన పనులు

ఏయూ క్యాంపస్‌, మే 19: విశాఖ సాగర్‌ తీరంలో రిప్‌ కరెంట్‌ల బారినపడి సంభవిస్తున్న మరణాలను తగ్గించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. ఇస్రోతో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రుషికొండ తీరంలో టవర్‌పై ప్రత్యేకమైన కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ కెమెరా సాయంతో తీరంలో కెరటాల ఉధృతి, తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. మరొక ప్రత్యేకమైన పరికరంతో సమద్ర గర్భంలో ఐదు మీటర్ల లోపున కెరటాల గమనాన్ని, తీరును, ఉధృతిని అంచనా వేస్తారు. వీటి సహాయంతో లభించిన సమాచారాన్ని విశ్లేషించి న్యూమరికల్‌ మోడల్స్‌ను సిద్ధం చేస్తారు. భవిష్యత్తులో రిప్‌ కరెంట్‌లు ఎప్పుడు సంభవిస్తాయి, ఎలా సంభవిస్తాయి, వాటి తీవ్రత ఎలా వుంటుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తారు. ఈ సమాచారం ఆధారంగా సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు, ప్రజలు మృత్యువాత పడుకుండా వారిని ముందస్తుగా హెచ్చరించడం, అప్రమత్తం చేయడం, ముందస్తు చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది. తద్వారా రిప్‌ కరెంట్‌ల బారిన ఎవరూ పడకుండా, మరణాలు సంభవించకుండా నివారించడం సాధ్యపడుతుంది. ఈ కార్యక్రమానికి ఏయూ మెటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సీవీ నాయుడు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు, ఏయూ  పరిశోధకులు ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులు ఇటీవల రుషికొండ తీరంలో ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో ఇదే విధానాన్ని యారాడ, భీమిలి, ఆర్‌కే బీచ్‌లలో సైతం ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తున్నారు. 


Updated Date - 2022-05-20T05:47:44+05:30 IST