Abn logo
Oct 27 2021 @ 01:51AM

మార్‌క్రమ్‌ మెరుపుల్‌

 ఆల్‌రౌండ్‌ షోతో వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయం అందుకోగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది..అయితే గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే రెండు జట్ల బ్యాటింగ్‌ మెరుగైంది..కాకపోతే మరింత బాగా ఆడిన సఫారీలదే పైచేయి అయింది..విండీస్‌ ఓపెనర్‌ లెండిల్‌ సిమన్స్‌ ఎక్కువ బంతులు ఎదుర్కొని కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టని చెత్త రికార్డు నెలకొల్పగా, సఫారీ కీపర్‌ డికాక్‌ మ్యాచ్‌ నుంచి అనూహ్యంగా వైదొలగి సంచలనం రేపాడు. 

 సౌతాఫ్రికా విజయం

విండీస్‌కు మళ్లీ నిరాశ


దుబాయ్‌: తొలుత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌, ఆపై మార్‌క్రమ్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో సూపర్‌-12లో సౌతాఫ్రికా బోణీ చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌-1 మ్యాచ్‌లో వెస్టిండీ్‌సను ఎనిమిది వికెట్లతో ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. లూయిస్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) అర్ధ శతకం సాధించాడు. కెప్టెన్‌ పొలార్డ్‌ (26) పర్లేదనిపించారు. ప్రిటోరియస్‌ (3/17) మూడు, కేశవ్‌ మహరాజ్‌ (2/24) రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 144/2 స్కోరు చేసి గెలుపొందింది. మార్‌క్రమ్‌తోపాటు డుసెన్‌ (43 నాటౌట్‌), హెన్‌డ్రిక్స్‌ (39) సత్తా చాటారు. హుస్సేన్‌ (1/27) ఒక వికెట్‌ తీశాడు. నోకియా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. 


శుభారంభం దక్కకున్నా..: లక్ష్యం ఓ మోస్తరుదే అయినా కెప్టెన్‌ బవుమా (2) ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే రనౌట్‌ కావడంతో..గత మ్యాచ్‌లో వలే సఫారీల బ్యాటింగ్‌ విభాగం చేతులెత్తేస్తుందా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ డికాక్‌ స్థానంలో వచ్చిన హెండ్రిక్స్‌, డుసెన్‌ రెండో వికెట్‌కు 57 రన్స్‌ జతచేసి పరిస్థితి చక్కదిద్దారు. 10వ ఓవర్లో హెన్‌డ్రిక్స్‌ నిష్క్రమించినా అనంతరం మార్‌క్రమ్‌, డుసెన్‌ మరో వికెట్‌ కోల్పోకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. 


సిక్స్‌తో మొదలై సిక్స్‌తో పూర్తి: వాల్ష్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టడం ద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన మార్‌క్రమ్‌..పొలార్డ్‌, రాంపాల్‌ బౌలింగ్‌లలో మరో రెండు సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. ఆపై రస్సెల్‌ బంతులు రెండింటిని బౌండరీకి తరలించిన అతడు..ఆనక అదే రస్సెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో తన అర్ధ శతకం పూరించడంతోపాటు ఆపై సింగిల్‌తో జట్టును లక్ష్యానికి చేర్చాడు. 


లూయిస్‌ ధనాధన్‌: టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టులో ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌, కెప్టెన్‌ పొలార్డ్‌ మినహా అంతా విఫలమయ్యారు. మరో ఓపెనర్‌ లెండిల్‌ సిమన్స్‌ ఎక్కువసేపు క్రీజులో ఉన్నా బంతులు తినడం మినహా పెద్దగా స్కోరు చేయలేకపోయాడు. అయితే దూకుడుగా ఆడిన లూయి్‌సకు సిమన్స్‌ మరోఎండ్‌ నుంచి చక్కటి సహకారం అందించాడు. మూడు ఓవర్ల వరకు అత్యంత నెమ్మదిగా కదిలిన విండీస్‌ స్కోరుబోర్డు ఆ తర్వాత ఎవిన్‌ చెలరేగడంతో దూసుకుపోయింది. రబాడ వేసిన నాలుగో ఓవర్లో లూయిస్‌ 4,6, మార్‌క్రమ్‌ వేసిన తదుపరి ఓవర్లో 6,6,4తో మరింత రెచ్చిపోయాడు. ఫలితంగా రెండు ఓవర్లలోనే 30 పరుగులు లభించాయి.. మొత్తంగా పవర్‌ ప్లే ముగిసే సరికి విండీస్‌ 43/0తో నిలిచింది. అదే జోరును కొనసాగించిన లూయిస్‌.. స్పిన్నర్లు మహరాజ్‌, షంసీ, బంతుల్లో సిక్సర్లు దంచి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆపై మహరాజ్‌ బౌలింగ్‌లోనే మరో సిక్స్‌ కొట్టాడు. అలాంటి మరో భారీ షాట్‌ ప్రయత్నంలో రబాడకు లూయిస్‌ క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ పూరన్‌ (12) రెండు వరుస పోర్లు కొట్టినా ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. సిమన్స్‌ రబాడ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో స్వల్ప తేడాతో విండీస్‌ మూడు వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా ఆ జట్టు పరుగుల వేగానికి బ్రేక్‌ పడింది. రెండు సిక్సర్లతో గేల్‌ బ్యాట్‌ ఝళిపించినా ప్రిటోరియస్‌ అతడికి చెక్‌ పెట్టాడు. ఆపై కెప్టెన్‌ పొలార్డ్‌ మినహా మిగిలిన వారు యధాప్రకారం బ్యాట్లెత్తేయడంతో విండీస్‌ స్కోరు 150కి కూడా చేరలేదు.  


స్కోరుబోర్డు

వెస్టిండీస్‌: లెండిల్‌ సిమ్మన్స్‌ (బి) రబాడ 16;  లూయిస్‌ (సి) రబాడ (బి) కేశవ్‌ 56;  పూరన్‌ (సి) మిల్లర్‌ (బి) కేశవ్‌ 12; గేల్‌ (సి) క్లాసెన్‌ (బి) ప్రిటోరియస్‌ 12; పొలార్డ్‌ (సి) డుసెన్‌ (బి) ప్రిటోరియస్‌ 26; రస్సెల్‌ (బి) నోకియా 5; హెట్‌మయెర్‌ (రనౌట్‌/మిల్లర్‌-క్లాసెన్‌) 1; డ్వేన్‌ బ్రావో (నాటౌట్‌) 8; వాల్ష్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) ప్రిటోరియస్‌ 0; ఆకెల్‌ హుస్సేన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-73, 2-87, 3-89, 4-121, 5-132, 6-133, 7-137, 8-137; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 3-1-22-0,  రబాడ 4-0-27-1, నోకియా 4-0-14-1, కేశవ్‌ మహరాజ్‌ 4-0-24-2, షంసీ 3-0-37-0,  ప్రిటోరియస్‌ 2-0-17-3.


దక్షిణాఫ్రికా: బవుమా (రనౌట్‌/రస్సెల్‌) 2; హెండ్రిక్స్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హుస్సేన్‌ 39; డుసెన్‌ (నాటౌట్‌) 43; మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 51; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 18.2 ఓవర్లలో 144/2; వికెట్ల పతనం: 1-4, 2-61; బౌలింగ్‌: ఆకెల్‌ హుస్సేన్‌ 4-0-27-1, రవి రాంపాల్‌ 3-0-22-0, రస్సెల్‌ 3.2-0-36-0, వాల్ష్‌ 3-0-26-0, డ్వేన్‌ బ్రావో 4-0-23-0, పొలార్డ్‌ 1-0-9-0.