పోలీసుల దెబ్బలకే మరియమ్మ మృతి: బంధువులు

ABN , First Publish Date - 2021-06-20T10:55:38+05:30 IST

యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు కొట్టిన దెబ్బలకే దళిత మహిళ మరియమ్మ గురువారం రాత్రి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల దెబ్బలకే మరియమ్మ మృతి: బంధువులు

విచారణ జరిపించాలని కాంగ్రెస్‌, షర్మిల అనుచరుల ధర్నా

యాదాద్రి, జూన్‌19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు కొట్టిన దెబ్బలకే  దళిత మహిళ మరియమ్మ  గురువారం రాత్రి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌, దళిత సంఘాలు, వైఎస్‌ షర్మిల అనుచరులు భువనగిరి ఏరియా ఆస్పత్రి వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో చర్చిఫాదర్‌ వద్ద మరియమ్మ వంటపనికి కుదిరింది. ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతని స్నేహితుడు శంకర్‌ చర్చి ఫాదర్‌ ఇంట్లో దాదాపు రూ.3 లక్షల నగదు చోరీ చేసి స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకానికి పరారయ్యారు. అడ్డగూడూరు పోలీసులు గురువారం అక్కడికి వెళ్లి ఇద్దరు నిందితులతో పాటు మరియమ్మను అదుపులోకి తీసుకున్నారు. 


ఆ రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. భువనగిరి ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టి, కొట్టిన దెబ్బలకే తన తల్లి మరియమ్మ మృతి చెందిందని  కూతురు సుజాత ఆరోపించారు. మహిళా పోలీసులు లేకుండా రాత్రి సమయంలో పోలీసులు మరియమ్మను ఎలా అదుపులోకి తీసుకుంటారని బంధువులు ప్రశ్నించారు. పోలీసులు గుండెపోటుతో మరణించినట్లు కట్టుకథలు చెబుతూ, కుటుంబ సభ్యులతో రాజీప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.ప్రీతం ఆరోపించారు. పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆస్పత్రి వద్ద బైఠాయించిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను  పోలీసులు అరెస్టు చేసి  బీబీనగర్‌ పోలీ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత వైఎస్‌ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టల రాంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన  కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, విచారణ పేరుతో మరియమ్మను కొట్టిచంపిన పోలీస్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ షర్మిల ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.  

Updated Date - 2021-06-20T10:55:38+05:30 IST