ఇంతకాలం కాళ్ల కింద ఎత్తుగా వాడుకున్న రాయి.. ధర ఎంతో తెలిసి..

ABN , First Publish Date - 2021-01-09T01:12:51+05:30 IST

గుర్రపు స్వారీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ ఇష్టం బాగా ఎక్కువగా ఉంటే సొంతగా గుర్రాలు కొనుక్కునే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. ఇలా గుర్రపు స్వారీ అంటే బాగా ఇష్టం ఉన్న ఓ యువతికి.. గుర్రం ఎక్కడం కష్టం అయిపోయింది.

ఇంతకాలం కాళ్ల కింద ఎత్తుగా వాడుకున్న రాయి.. ధర ఎంతో తెలిసి..

లండన్ : గుర్రపు స్వారీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ ఇష్టం బాగా ఎక్కువగా ఉంటే సొంతగా గుర్రాలు కొనుక్కునే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. ఇలా గుర్రపు స్వారీ అంటే బాగా ఇష్టం ఉన్న ఓ యువతికి.. గుర్రం ఎక్కడం కష్టం అయిపోయింది. అంత ఎత్తున ఉండే గుర్రాన్ని ఎక్కడం ఆమె వల్ల కాలేదు. దీంతో కొంచెం హైట్ తీసుకోవాలని అనుకుంది. అందుకోసం పెరట్లో పడి ఉన్న ఓ మార్బుల్ స్లాబ్ ముక్కను తెచ్చుకొని కాళ్ల కింద వేసుకుంది. గుర్రం ఎక్కడానికి ఆ రాయి ఆమెకు సరిగ్గా సరిపోయింది. దీంతో ఆ రాయిని అలానే వాడటం మొదలు పెట్టింది. ఈ ఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి ఆమె ఈ రాయిని అలా గుర్రం ఎక్కడానికే ఉపయోగిస్తోంది.


ఆ యువతి బ్రిటన్‌లోని వైట్‌పారిష్ గ్రామ వాసి. తను ఇంతకాలం కాళ్ల కింద వేసుకొంటున్న రాయిపై ఏదో బొమ్మ ఉండటం చూసింది. ఆ బొమ్మ ఏంటా? అని పరిశీలనగా చూసింది. ఆమెకు అనుమానం వచ్చి ఆ రాయిని తీసుకొని ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు వెళ్లింది. అక్కడి అధికారులకు తన చేతిలోని మార్బుల్ స్లాబ్ రాయిని చూపించింది. ఇది ఎప్పటిదో కొంచెం చూసి చెప్పాలని కోరింది.


ఆ రాయిని పరీక్షించిన ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. అది క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందిన రాయని వాళ్లు గుర్తించారు. గ్రీసుదేశం లేదా ఆసియాలోని టర్కీ దేశం నుంచి ఆ రాయి వచ్చుండొచ్చని చెప్పారు. సదరు రాయి ఇంగ్లండ్‌కు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని, అయితే ఇలా ఓ ఇంటి పెరట్లోకి ఎలా వచ్చిందో మాత్రం తెలియడం లేదని పరిశోధకులు అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ మార్బుల్ స్లాబ్ ముక్క ధర కనీసం 20వేల డాలర్లపైగానే ఉండొచ్చని అంటున్నారు. దీన్ని వేలం వేయడానికి నిర్ణయించగా.. 15లక్షల రూపాయల వరకూ ధర పలకొచ్చని చెప్తున్నారు. ఇంతకాలం తను కాళ్ల కింద ఎత్తు కోసం వాడుకున్న రాయి ఇంత ధర పలుకుతుందని తెలిసిన సదరు యువతికి నోట మాట రావడం లేదు.

Updated Date - 2021-01-09T01:12:51+05:30 IST