ప్రాణత్యాగానికైనా.. సిద్ధమే..

ABN , First Publish Date - 2020-08-07T13:45:48+05:30 IST

రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమంటూ..

ప్రాణత్యాగానికైనా.. సిద్ధమే..

అమరావతిలో ఆగ్రహ జ్వాలలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మోసం చేశాయి

233వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రాజధాని అమరావతి 29 గ్రామాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మోసం చేశాయంటూ ఉరితాళ్లు మెడలో వేసుకొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 233వ రోజుకు చేరాయి. 29 గ్రామాల రైతులు రోడ్డెక్కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ప్రధాని మోదీ మట్టి, నీళ్లు తీసుకొచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారని.. నేడు రాజధాని విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పటం ఏమిటని తుళ్లూరు రైతులు నిలదీశారు.


ఉన్నదంతా ఇచ్చేశామని ఇక తమకు మరణమే శరణ్యం అని సామూహిక మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తుళ్లూరు మహిళలు, రైతులు లేఖలు రాశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు వెలిగించి అమరావతిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో గురువారం రైతులు, మహిళలు, చిన్నారులు నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సరికాదంటూ తాడేపల్లిలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి తుడిమిల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మానికొండ డాంగే, రామారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T13:45:48+05:30 IST