మరణ గణన

ABN , First Publish Date - 2021-06-18T06:12:03+05:30 IST

పదహారు నెలలుగా మనదేశంలో తాండవమాడుతున్న కొవిడ్ ఉపద్రవం ఎందరిని బలితీసుకున్నది అన్న లెక్క సంక్లిష్టంగా మారింది...

మరణ గణన

పదహారు నెలలుగా మనదేశంలో తాండవమాడుతున్న కొవిడ్ ఉపద్రవం ఎందరిని బలితీసుకున్నది అన్న లెక్క సంక్లిష్టంగా మారింది. అధికారిక లెక్కలు ఒకరకంగా ఉంటున్నాయి. రోజుకొక రాష్ట్రంలో పత్రికలో, వార్తాచానెళ్లో, స్వచ్ఛంద సంస్థలో లెక్కలను సమీక్షించి, కొత్తగా సేకరించి అధికారిక సంఖ్యకు ఎంత అదనంగా చేర్చాలో చెబుతున్నారు. ఈ సంఖ్యలన్నిటిని కూడితే, దేశం దిగ్భ్రాంతి చెందవలసి వస్తుంది. మరణాల లెక్కలే కాదు, ఎన్ని పరీక్షలు జరిగాయి, ఎందరికి వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ జరిగింది, ఎందరు ఆస్పత్రులలో, ఎందరు ఇళ్లలో చికిత్సలు పొందారు, మరణాలు ఎన్ని వైద్యకేంద్రాలలో, ఎన్ని నివాసాలలో, ఎన్ని మార్గమధ్యాలలో జరిగాయో కూడా లెక్కలు సరిగా లేవు. గురువారం నాటికి దేశంలో 3 లక్షల 82 వేల మరణాలు కొవిడ్ కారణంగా జరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పదిలక్షలకు పైగా ఉండవచ్చునని కనిష్ఠంగా వేసిన లెక్కలే సూచిస్తున్నాయి. 


తాజాగా అస్సాం రాష్ట్ర లెక్కలు బయటపడుతున్నాయి. పోయిన ఏడాది మొదటి విడత కొవిడ్ వచ్చినప్పుడు నాలుగు నెలల కాలంలో, సాధారణంకంటె 55 శాతం (77,845) అధికంగా మరణాలు నమోదయ్యాయి. ఈ కాలంలో ప్రభుత్వం చెప్పిన సంఖ్య కంటె 30 రెట్లు అధికంగా మరణాలు సంభవించాయి. కొవిడ్ వల్ల సంభవించిన వాస్తవ మరణాలను లెక్కించడానికి మీడియా, పౌరకార్యకర్తలు అనేక తులనాత్మక, సృజనాత్మక పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి ఉన్న మాసాలలో మరణాలను, మునుపటి సంవత్సరాలలో అదేకాలంలో జరిగిన మరణాలతో పోల్చిచూస్తున్నారు. కొందరు ఒకటి రెండు సంవత్సరాల లెక్కలను చూశారు. మరికొందరు నాలుగైదేళ్ల లెక్కలను కూడా పోల్చిచూశారు. మరణధ్రువపత్రాల సంఖ్యను సాక్ష్యంగా తీసుకుంటున్నారు. ఒక ఆంగ్ల పత్రిక ఈ మధ్య ప్రకటించిన ప్రకారం, హైదరాబాద్ నగరంలో సంభవించిన మరణాలు పదిరెట్లు అధికంగా ఉన్నాయి. గత ఏడాది, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మరణాల సంఖ్య వాస్తవికంగా లేదని భావించి ఆంధ్రజ్యోతి, అంత్యక్రియలతీరును ప్రత్యక్షంగా పరిశీలించి అంతరాన్ని కథనం చేసింది. ఆ కథనం ప్రభుత్వానికి, ప్రభుత్వ సమర్థకులకు నచ్చలేదు. కానీ, ఆ తరువాత దేశవ్యాప్తంగా అదే పద్ధతిలో అనేక పత్రికలు, వార్తాచానెళ్లు అధికారిక లెక్కల్లో తేడాను బయటపెట్టాయి. అలాగే, మరణ ధ్రువపత్రాల ఆధారంగా అంతరాన్ని వెల్లడి చేసే కథనం కూడా మొదట ఆంధ్రజ్యోతియే ప్రచురించింది. గుజరాత్‌లో ఒక పత్రిక, శ్రద్ధాంజలి ప్రకటనలను లెక్కించి, అధికారిక లెక్కలను ప్రశ్నించింది. మధ్యప్రదేశ్‌లో ప్రతి ఏడు మే మాసంలో 34 వేల మరణాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం మేలో జరిగిన మరణాల సంఖ్య 1,64,000 పైచిలుకే. ఆంధ్రప్రదేశ్‌లో సగటు మే మాసపు మరణాలు 27 వేలు కాగా, ఈ ఏడాది మేలో 1,30,000 మరణాలు సంభవించాయి. ఈ లెక్కలనే జాతీయస్థాయికి అన్వయించి ప్రముఖ కాలమిస్టు యోగేంద్ర యాదవ్ ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన అదనపు మరణాల సంఖ్య 44.29 లక్షలుగా తేల్చారు. అతి భయంకరమైన అంకెలు అవి. 


జనన, మరణాల నమోదు విషయంలో మన దేశంలో లెక్కలు సరిగా ఉండకపోవడం ఎప్పటి నుంచో ఉన్నది. గ్రామాధికారుల దగ్గర అన్ని జననాలు, మరణాలు నమోదు కావడం ఆనవాయితీయే తప్ప, తప్పనిసరి కాదు. ఇక పట్టణ ప్రాంతాలలో అయితే, నియంత్రణ కష్టతరంగా ఉండేది. 1969లో చేసిన చట్టం ద్వారా మన దేశంలో జనన, మరణాల నమోదును తప్పనిసరి చేశారు. దానితో ఆ మరుసటి సంవత్సరం నుంచి నమోదు పెరిగింది కానీ, 2018నాటికి నమోదు శాతం 86 శాతానికి మాత్రమే చేరుకున్నదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. అంటే కనీసం 14 శాతం మరణాలు లెక్కలోకి రావడం లేదన్న మాట. అందులోనూ ఉత్తర, దక్షిణ వ్యత్యాసం ఉన్నది. గోవా, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలలో నూటికి నూరుశాతం నమోదు ఉంటుండగా, బిహార్‌లో 37 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అక్కడ కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం. ఇక, మరణకారణాలను గుర్తించి లెక్కించడం ఇంతకు మునుపు సాధారణ స్థాయిలో లేదు. మలేరియా, అతిసార వంటి వ్యాధుల కారణంగా మరణించేవారి సంఖ్యలో హెచ్చుతగ్గులను గుర్తించడానికి అటువంటి గణన జరిగేది. కానీ, కొవిడ్ పోయిన సంవత్సరం మన దేశంలో ప్రవేశించేదాకా, చావుకు కారణాన్ని పేర్కొంటూ మరణ పత్రాన్ని జారీ చేసే సార్వజనీన పద్ధతి లేదు. 2018లో జరిగిన మరణాలలో 21 శాతానికి మాత్రం మరణకారణాన్ని ప్రభుత్వ పత్రాలలో పేర్కొన్నారు. ఇప్పటికీ 1970 దశకం ముందు పుట్టినవారిలో అనేకులు జనన ధ్రువపత్రాలు లేక, స్వీయవాంగ్మూలాల ద్వారా అవసరాలు నెరవేర్చుకోవలసి వస్తున్నది. ఇటువంటి నేపథ్యం ఉన్న మనదేశంలో కొవిడ్ వంటి ఉత్పాత స్థితిలో సంభవించే మరణాల లెక్క సరిగా ఉంటుందని ఆశించలేము. అయితే, గతంలో లెక్కలు సరిగా లేకపోవడానికి లెక్కించే పద్ధతి లేకపోవడం కానీ, ఉన్నా అది అరకొరగా ఉండడం కానీ కారణంగా ఉన్నది. గత్తరవ్యాధులు, వైపరీత్యాల వంటి కారణాలతో మరణించేవారి సంఖ్యను తగ్గించి చూపడానికి ప్రభుత్వాలకు ప్రత్యేకమైన అవసరమేమీ ఉండేది కాదు. ప్రభుత్వం నేరుగా బాధ్యత పడవలసివచ్చే ఆకలిచావులు, సంక్షోభ ఆత్మహత్యలు, పోలీసు కాల్పులు వంటి సందర్భాలలో మృతుల సంఖ్యను తగ్గించి చూపడానికి కారణముంటుంది. కొవిడ్ ఆవిర్భావానికి, వ్యాప్తిలో అధికభాగానికి ప్రభుత్వాల తప్పిదాలు కారణం కాకపోయినా, పరిస్థితిని ఎదుర్కొనడంలో వైఫల్యాల రీత్యా, మరణాల సంఖ్య వాస్తవికంగా ఉంటే ప్రజలలో ఆందోళన, ప్రభుత్వంపై నిరసన భావం పెరుగుతాయన్న భయంతోనే లెక్కలను కప్పిపుచ్చడం జరిగింది. ఇదేదో తెలంగాణలోనో, ఆంధ్రలోనో, భారతదేశంలోనో అని కాదు, ప్రపంచవ్యాప్తంగా అరకొర లెక్కలు విడుదల అయ్యాయి. కాకపోతే, మన దేశంలో పరిస్థితి మరీ అధ్వాన్నం. సంపన్నదేశాల వారు తిరిగి లెక్కవేసి, అదనంగా చేర్చి మృతుల సంఖ్యను పెంచారు. భారత ప్రభుత్వానికి ఇంకా ఆ ధైర్యం రావడం లేదు. పైగా, కొత్త లెక్కల తర్కాన్ని ప్రభుత్వం కాదంటున్నది. 


లెక్కలు వాస్తవికంగా ఉండడం ఎందుకు అవసరమంటే, అవి జరిగినదాని గురించిన వాస్తవిక అంచనా ఇవ్వడమే కాకుండా, జరగబోయేదాని గురించి హెచ్చరిస్తాయి కూడా. అంకెలలో పరిణామాల క్రమం, ధోరణి వ్యక్తమవుతుంది. దాచిపెట్టడం అంటే, ఆ అంకెలు కలిగించే స్పందన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే. భయం కూడా కొన్ని సందర్భాలలో అవసరమే. అది జాగ్రత్తను పెంచుతుంది. వాస్తవికమైన లెక్కలు ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలుపుతాయి. బాధ్యతారాహిత్యం మాత్రమే వాస్తవాన్ని తగ్గించో, హెచ్చించో చూపుతుంది.

Updated Date - 2021-06-18T06:12:03+05:30 IST