విడుదలకు ముందే రూ.100 కోట్ల కలెక్షన్లు.. బాలీవుడ్‌ రికార్డులను తిరగరాస్తున్న సౌత్ సినిమాలు

ఇంకా కరోనా గండం పూర్తిగా తొలగిపోలేదు. అయినా కూడా అప్పుడే బాక్సాఫీస్ బంగారు బాతులా మారిపోయింది. మళ్లీ వందల కోట్ల కలెక్షన్లు కొత్త ఆశలు రేపుతున్నాయి. సరికొత్త ఉత్సాహం తీసుకొస్తోన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక చిత్రాలు మాత్రం మరింత సంచలనంగా మారాయి. అవేంటో, వాటి కలెక్షన్ల కోలాహలం ఏంటో ఓ సారి చూసేద్దాం పదండీ... 


కరోనాతో నెలల తరబడి మూతబడ్డ థియేటర్లకు పూర్తిస్థాయి కళని తెచ్చి పెట్టింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీ ‘మరక్కార్’. విడుదలకు ముందే జాతీయ అవార్డ్ పొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే వంద కోట్ల రికార్డు కూడా బ్రేక్ చేసింది. 4100 థియేటర్లలో జనం ముందుకొచ్చిన ‘మరక్కార్’ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 16 వేల షోలు అమ్ముడుపోయింది!


కమర్షియల్‌గానే కాదు కంటెంట్ పరంగా కూడా మన సినిమాలు ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమాలకి రేటింగ్స్ ఇఛ్చే ‘ఐఎండీబీ’ వెబ్‌సైట్‌లో సూర్య ‘జై భీమ్’ ఏకంగా 10 కి 9.6 మార్కులు సాధించింది. ఇంత వరకూ ‘ద షాషాంక్ రీడింప్షన్’ అనే సినిమానే అత్యధికంగా 9.3 రేటింగ్స్‌తో కొనసాగేది. ‘జై భీమ్’ ఆ రికార్డుని బద్ధలు కొట్టగలిగింది!తమిళ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా సైతం కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. ఇళయదళపతి బాక్సాఫీస్ స్టామినాకి తొలి రోజు 42 కోట్ల వసూళ్లు మామూలు విషయమే. కానీ, కరోనా నేపథ్యంలో కేవలం 50 శాతం ప్రేక్షకులతోనే ‘మాస్టర్’ అన్ని కోట్లు కొల్లగొట్టింది. పూర్తి స్థాయి సామర్థ్యంతో థియేటర్లు కొనసాగి ఉంటే కలెక్షన్లు భారీగా పెరిగేవి! కరోనా కాలంలో భారీ ఓపెనింగ్ విషయంలో ‘మాస్టర్’దే రికార్డ్... 


హిందీ సినిమాల విషయానికి వస్తే... అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ ఇండియాలో 4100 స్క్రీన్స్ పైన, 66 ఇతర దేశాల్లో 1300 స్క్రీన్స్ మీద ఈ మధ్యే విడుదలైంది. అత్యధిక స్క్రీన్స్ ఆక్రమించిన సినిమా ‘సూర్యవంశీ‘ రికార్డ్ నమోదు చేయగలిగింది! మరో అక్షయ్ కుమార్ సినిమా ‘అత్రంగీ రే’ డిజిటల్ వేదికపై దుమ్ము రేపింది. డిసెంబర్ 24న ఓటీటీలో వచ్చేస్తోన్న ధనుష్, సారా అలీఖాన్ స్టారర్ ఏకంగా 200 కోట్లకు అమ్ముడుపోయింది! మొత్తం మీద, కరోనా కొన్నాళ్లు సినీ పరిశ్రమని క్వారంటైన్ చేసినా... మరోసారి మన సినిమాలు మాత్రం విజృంభిస్తూనే ఉన్నాయి... 

Advertisement