‘పీడిత ప్రజలు దోపిడీ వర్గాలపై ఉద్యమించాలి’

ABN , First Publish Date - 2020-02-20T08:47:36+05:30 IST

పీడిత ప్రజలంతా దోపిడీ వర్గాలపై ఐక్యంగా ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ విశాఖ-ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ కోరారు. ఆదివాసీ చట్టాలు, హక్కుల పరిరక్షణకు జరుగుతున్న

‘పీడిత ప్రజలు దోపిడీ వర్గాలపై ఉద్యమించాలి’

పాడేరు, ఫిబ్రవరి 19: పీడిత ప్రజలంతా దోపిడీ వర్గాలపై ఐక్యంగా ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ విశాఖ-ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ కోరారు.  ఆదివాసీ చట్టాలు, హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని, గిరిజన చట్టాలపై పోరాటాన్ని ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య సమస్యగా చూడవద్దని విన్నవించారు. ఈ మేరకు ఆమె పేరిట బుధవారం మీడియాకు లేఖ విడుదలైంది. పాడేరు వర్తక సంఘం నేత ఆదివాసీయేతరుడు రొబ్బి శంకరరావు 1/70 చట్టాన్ని సవరించాలని హైకోర్టును ఆశ్రయించడాన్ని ఖండిస్తూ, ఆదివాసీ ప్రజల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆదివాసీ చట్టాలు కొంత మంది ఆదివాసీయేతర వర్తకులకు, సహజ సంపద దోచుకోవాలనుకునే వర్గాలకు మాత్రమే అడ్డంకిగా ఉన్నాయని, ఆదివాసీయేతర పీడిత ప్రజలకు ఈ చట్టాల సవరణ/రద్దు వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉండవని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు ద్వారా లాభాలు పొందుతున్నది ఆదివాసీ యేతర దోపిడీ వ్యాపార వర్గాలేనన్నారు. పర్యాటకాభివృద్ధి పేరుతో లంబసింగి, చెరువులవేనం, కొత్తభల్లుగుడ తదితర ప్రాంతాల్లో అక్రమంగా గుడారాలు వేసి ఆదివాసీ సంస్కృతిని నాశనం చేస్తున్నారన్నారు.


నిర్బంధకాండపై సమాధానం చెప్పండి

బాక్సైట్‌ తవ్వకాలపై ఆదివాసీల పోరాటాలకు తలొగ్గి జీవో 97ను రద్దు చేసి ఆదివాసీల రక్షకుడుగా పోజు కొడుతున్న నేటి సీఎం జగన్‌, బాక్సైట్‌ పోరాటంలో అరెస్టయిన వారిపై ఇప్పటికీ కేసులు ఎందుకు ఎత్తేయలేదని మావోయిస్టు నేత అరుణ ప్రశ్నించారు. అలాగే అడవిపై హక్కు కోసం ఏపీఎఫ్‌డీసీకి వ్యతిరేకంగా పోరాడి కాఫీ తోటలను స్వాధీనం చేసుకున్న ప్రజలపై తీవ్రమైన నిర్బంధకాండను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తున్నదో ఆదివాసీ ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అడవిపై హక్కు కోసం పోరాడుతున్న మన్యం ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ మన్యాన్ని పోలీస్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంప్‌గా మార్చారని జగన్‌ను విమర్శించారు. దీనిపై అధికార, విపక్ష, వామపక్ష పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని మావోయిస్టు నేత అరుణ ప్రశ్నించారు.


ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య సమస్యగా చూడొద్దు

నేటి సమాజంలో చట్టాలు సవరించినా, రద్దు చేసినా లబ్ధిపొందేది దోపిడీ ప్రభుత్వాలు మాత్రమేనని, అందువల్ల ఈ సమస్యను ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య సమస్యగా కాకుండా, దోపిడీ వర్గాలు, పీఢిత ప్రజల మధ్య సమస్యగా పరిగణించాలని కోరారు. అన్ని వర్గాల పీడిత ప్రజలు దోపిడీ పాలకవర్గాలపై ఐక్యంగా ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ విశాఖ-ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-02-20T08:47:36+05:30 IST