బ్రేకింగ్ : RK మరణాన్ని ధృవీకరించిన మావోయిస్ట్ పార్టీ

ABN , First Publish Date - 2021-10-15T18:41:51+05:30 IST

మావోయిస్టు పార్టీ అగ్రనేత, చర్చల రామకృష్ణగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే...

బ్రేకింగ్ : RK మరణాన్ని ధృవీకరించిన మావోయిస్ట్ పార్టీ

అమరావతి/హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీ అగ్రనేత, చర్చల రామకృష్ణగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే(65) మరణించారని గత 24 గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించినప్పటికీ.. మావోయిస్టు పార్టీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ శ్రేణుల సమక్షంలో అంత్యక్రియలు కూడా పూర్తిచేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్ అమరత్వం పార్టీకి తీరని లోటని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది.


కాగా.. 28 ఏళ్ల వయసులోనే విప్లవోద్యమంలోకి వెళ్లిన ఆర్కేకు భార్య శిరీష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. ఓ కేసులో అరెస్ట్‌ అయిన తర్వాత ఆమె బెయిలుపై విడుదలయి బహిరంగ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్కే కుమారుడు మున్నా 2016లో ఏఓబీ పరిధిలోని రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 32 మంది మావోయిస్టులు ఈ ఘటనలో మరణించారు. ఈ సంఘటనలో ఆర్కేకు రెండుచోట్ల బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారని, చికిత్స తీసుకున్నాక ఏడాదిన్నరపాటు దండకారణ్యంలోనే విశ్రాంతి తీసుకున్నారని తెలిసింది. 2020 ఫిబ్రవరి నుంచి ఆర్‌కే తిరిగి ప్రత్యక్షంగా ఏఓబీ వ్యవహరాలు చూస్తూ వస్తున్నారు.



Updated Date - 2021-10-15T18:41:51+05:30 IST