సూపర్‌ సిక్స్‌

ABN , First Publish Date - 2020-06-02T09:21:05+05:30 IST

రాష్ట్రఅవతరణ తరువాత జరిగిన జిల్లాల విభజన మరింత అభివృద్ధికి బాటలు వేసింది. గతంలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను

సూపర్‌ సిక్స్‌

అభివృద్ధివైపు ఉమ్మడిరంగారెడ్డి జిల్లా అడుగులు 

కొత్త రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో ఆరేళ్లు పూర్తి


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలంగాణ వచ్చిన తరువాత వరుసగా రె ండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. పేద ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తలసరి, స్థూల ఉత్పత్తిలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రాష్ట్రఅవతరణ తరువాత జరిగిన జిల్లాల విభజన మరింత అభివృద్ధికి బాటలు వేసింది. గతంలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలుగా విభజించారు. పాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు ఆశించిన మేరకు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా విభజన తరువాత కూడా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌ జిల్లాను అధిగమించి ఆయా రంగాల్లో ఈ రెండు జిల్లాలు శరవేగంగా అభివృద్ధిసాధిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా కూడా గతంకంటే ఎంతో అభివృద్ధి సాధిం చింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్ధిక సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తలసరి ఆదాయంలో రంగారెడ్డిజిల్లా (రూ.5,78,978లతో) రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మేడ్చల్‌ జిల్లా రూ. 1,67,231 తలసరి ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. అలాగే వికారాబాద్‌ జిల్లా కూడా గతం కంటే మెరుగపడింది. గతేడాది రాష్ట్రంలో 25వ స్థానంలో ఉన్న వికారాబాద్‌ ఈ ఏడాది (రూ.143,994లతో) 18వస్థానంలో నిలిచింది. ఇక స్థూల ఉత్పత్తి లోనూ రంగారెడ్డిజిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే అత్యధికంగా  రూ.1,73,143 కోట్ల స్థూల ఉత్పత్తి సాధిం చగా, మేడ్చల్‌ జిల్లా రూ.66.156కోట్ల స్థూల ఉత్పత్తి సాధించి మూడో స్థానంలో, వికారాబాద్‌ 17వ స్థానంలో నిలిచింది. టీఎస్‌ఐ పాస్‌ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సులభ మైంది. ఈ విఽధానం అమల్లోకి వచ్చిన తరువాత కొత్తపరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులు వస్తున్నాయి. జిల్లాలో పరిశ్రమల స్థాపనకై వివిధ అనుమతులను స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం 2014 ద్వారా ఇస్తున్నారు.


ఇప్పటి వరకు జిల్లాలో 975 మంది పారిశ్రామిక వేత్తలకు  రెండు వేలకుపైగా అనుమతులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఇంటింటికి తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల తాగునీరు అందిస్తున్నారు. రూ. 1457కోట్ల వ్యయంతో రూ. 2361 కి.మీ పైపు లైన్‌ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు రూ.1115 కోట్లు ఖర్చుచేసి  2.84లక్షల అవాసాలకు  నల్లాల కనెక్షన్లు ఇచ్చారు. 


పాలమూరు- రంగారెడ్డిపైనే ఆశలు

ఉమ్మడి జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గతంలో ఉమ్మడి జిల్లాకు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు పనులు చేపట్టారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి గోదావరి జలాల తరలింపును పక్క జిల్లా వరకే పరిమితం చేసింది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు కృష్ణా నుంచి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు పనులు కూడా మొదలు పెట్టింది. అయితే ఈ పనులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ వరకే పరిమితమయ్యాయి.  


నత్తనడకన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు

ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత ఆయా ప్రాంతాల్లో కలెక్టర్‌ భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ నిర్మాణ పనులు వేగంగా సాగలేదు. దీంతో మూడు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు ప్రారంభం కాలేదు. 


ముందుకు సాగని ‘డబుల్‌’

రంగారెడ్డిజిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గాల్లో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఆరు గ్రామీణ నియోజకవర్గాల్లో 6,777 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా... ఇందులో 6,338 గృహనిర్మాణాలకు టెండర్లు పిలిచి 3,300 ఇళ్లు నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో ఇప్పటివరకు 50ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 


డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకం...

తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేదలకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఇళ్లనిర్మాణం 2017 లో ప్రారంభమైంది. ఇందుకోసం 256ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా 38,000 ఇళ్లను నిర్మిస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గానికి మొ త్తం 2,350 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 485 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 1422 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు దశ లో ఉన్నాయి. జిల్లాలోని మేడ్చల్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో టెండర్లు పూర్తైనచోట ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 


కేశవాపూర్‌ రిజర్వాయర్‌

హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌లో రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరం ఎత్తి పోతల పథకంలో భాగంగా గోదావరి నీటిని తెచ్చి, నగరానికి సరఫరా చేసేందుకు ప్రణాళికను రూ పొందించింది. మొదటగా 20టీఎంసీలతో రిజ ర్వాయర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిం చింది. భూసేకరణ సమస్యగా ఉండటంతో 5 టీఎం సీలకు పరిమితం చేసింది. ఇప్పటి వరకు 1000ఎకరాల వరకు అటవీ భూమిని సేకరించారు. దాదాపు మరో 500ఎకరాలను రైతుల వద్ద సేకరించనున్నారు. భూ సర్వే పూర్తయింది.  త్వరలోనే ముఖ్యమంత్రి చేత రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.


మిషన్‌ భగీరథ ప్రాజెక్టు...

ఇంటింటికి తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. మేడ్చల్‌జిల్లాను పైలెట్‌ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. జిల్లాలోని ఔటర్‌రింగురోడ్డుకు వెలుపల ఉన్న 104గ్రామాలకు తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులను 2015 డిసెంబర్‌ మొదటివారంలో ప్రారంభించారు. మొదటిదశలో 270కిలోమీటర్ల పైపులైన్లకు రూ.160కోట్లు విడుదలయ్యాయి. రెండోదశలో గ్రామాల్లో 360కిలోమీటర్ల అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి రూ.74.75కోట్లు నిధులు వచ్చాయి. 2017లో ఆప్టికల్‌ కేబుల్‌ పనులకు రూ.1.41కోట్లు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం కోసం రూ.13.25కోట్లు సర్కార్‌ మంజూరుచేసింది. ఔటర్‌రింగు రోడ్డుకు వెలుపల, ఔటర్‌ లోపల గల గ్రామాల్లో 36,589 కుటుంబాలకు నల్లాకనెక్షన్లు ఇవ్వాలి. మొత్తం 2,12,251మంది జనాభాకు నీరందించాలి. పనులు పూర్తయ్యి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. 


తుదిదశకు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం

జిల్లా సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ సమీపంలోని కొత్త కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారు. 2017 అక్టోబరు 12న రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి పద్మారావు పనులను ప్రారంభించారు. రూ.30కోట్ల వ్యయంతో, 40ఎకరాల్లో జీప్లస్‌-3 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. 


రైతు వేదికలపై నజర్‌

సాగు విధానాలపై చర్చించుకునేందుకు వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 83 వేదికలను నిర్మించనున్నారు. ఇప్పటికే 60కిపైగా క్లస్టర్ల కోసం భూములను గుర్తించారు. త్వరలో మిగిలినవాటిని గుర్తించి నిర్మించేందుకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చర్యలు తీసుకుం టున్నారు. ఒక్కో రైతువేదిక నిర్మాణం కోసం రూ. 12.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. 


పారిశ్రామిక ప్రగతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టీఎస్‌ ఐపాస్‌ చట్ట ద్వారా రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోంది. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చాక జిల్లాలో ఇప్పటివరకు 975పరిశ్రమలు రూ.63,902.10కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో, 8,39,406మంది ప్రతిపాదిత ఉపాధితో వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రూ.14164.73 కోట్ల పెట్టుబడితో 702పరిశ్రమలు వెలిశాయి. ప్రస్తుతం 2,06,497 మంది ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా మేడ్చల్‌-మల్కాజ్‌గిరిజిల్లా టీఎ్‌సఐపాస్‌ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచింది. అప్పటి కలెక్టర్‌ ఎంవీరెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ రవీందర్‌ అవార్డులు అందుకున్నారు. జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 2,983 పరిశ్రమలు ఏర్పాటుచేసి, 1.40లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించారు. 


సంక్షేమానికి పెద్దపీట !

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. వికలాంగులకు ప్రతినెలా రూ.3,016 ఫించన్‌ ఇస్తుంటే, మిగతావారికి రూ.2,016 అందజేస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో 1,00,817 మంది ఆసరా ఫించన్‌తో లబ్ధి పొందుతున్నారు. పేదింటి యువతుల పెళ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట రూ.1,00,116 ఆర్థిక సాయమందిస్తున్నారు. ఆహార భద్రత కింద ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,07,057 ఆహార భద్రత కార్డులు ఉండగా, 2.33 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.


గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల వంతున 1.79 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.255 కోట్లు జమ చేశారు. రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో మరణించిన 272 మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.5 లక్షల వంతున జమచేశారు. భూ పంపిణీ కింద భూమి లేని నిరుపేద దళితుల కోసం ఇప్పటి వరకు 69 మంది లబ్దిదారులకు రూ.6.20 కోట్లు వెచ్చించి 162.39 ఎకరాలు పంపిణీ చేశారు. పంట రుణాల మాఫీ పథకం కింద మొదటి విడత కింద రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేసేలా చర్యలు చేపట్టారు.


చేపట్టిన పనుల్లో కొన్ని..

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.42.24 కోట్లతో చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. టీయూఎఫ్‌ఐడీసీ కింద మంజూరైన రూ.25 కోట్లతో తాండూరు, రూ.20 కోట్లతో వికారాబాద్‌ మునిసిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. తాండూరు పరిగి, వికారాబాద్‌, నవాబ్‌పేట్‌, ధారూరు, మర్పల్లిలో రూ.18 కోట్ల వ్యయంతో మార్కెటింగ్‌ గోదాములు నిర్మించారు. మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం జిల్లాలో రూ.8 కోట్ల వ్యయంతో కొత్తగా ఆరు సబ్‌ స్టేషన్లు నిర్మించారు.


ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా జిల్లాలో రూ.54 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. జిల్లాలో గత ఏడాది 99 రోడ్ల అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు కేటాయించగా, వాటిలో 47 పనులు పూర్తయ్యాయి. జిల్లాలో వైకుంఠధామాలు, మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో నాలుగు విడతల్లో రూ.234.78 కోట్లతో 733 చెరువుల మరమ్మతులు, పునరుద్దరణ పనులు చేపట్టారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 9,45,561 మందికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంకా అనేక రంగాలకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నారు.


అభివృద్ధిలో పరుగులు :మంత్రి సబితాఇంద్రారెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో దూసుకు పోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె ఓప్రకటనలో శుభా కాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు ఒకచోట 500ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామ న్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత 975 మంది పారిశ్రామిక వేత్తలకు రెండు వేలకుపైగా అనుమతులు ఇచ్చారన్నా రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి, వికారాబాద్‌ ప్రాంతా న్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.


Updated Date - 2020-06-02T09:21:05+05:30 IST