కాంటాక్ట్‌ భయం

ABN , First Publish Date - 2020-04-10T11:04:41+05:30 IST

జిల్లాలో కాంటాక్ట్‌ కరోనా భయం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన

కాంటాక్ట్‌ భయం

కరోనా పాజిటివ్‌ల సన్నిహితుల్లో గుబులు

జిల్లాలో ప్రమాద ఘంటికలు

అనంతపురం, హిందూపురం దిగ్బంధం

పాజిటివ్‌ కేసులతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి

‘కాంటాక్ట్‌’ అయిన వారి కోసం వేట

క్వారంటైన్‌లకు పలువురి తరలింపు... శాంపిళ్లు సేకరణ


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 9 : జిల్లాలో కాంటాక్ట్‌ కరోనా భయం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికే కరోనా వ్యాధి నిర్ధారణ అవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి వ్యక్తుల నుంచి ఇతరులకు కరోనా సోకడం మొదలైంది. ఇందుకు ఉదాహరణ జిల్లా ఆస్పత్రిలో కరోనా బాధితుడికి చికిత్స చేసిన ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు కరోనా బారిన పడ్డారు. హిందూపురంలో వచ్చిన పలు కేసులు ఇలాగే ఉన్నాయి. ఇలా కరోనా కాంటాక్ట్‌ పెరిగి పాజిటివ్‌ కేసులు జిల్లాలో బయటపడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఈ కాంటాక్ట్‌ కరోనాను నియంత్రించేందుకు ముప్పుతిప్పలు పడుతోంది.


పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన వారికి సంబంధించిన వారి కోసం అధికారులు వేట మొదలుపెట్టారు. కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు అంత్యక్రియల తర్వాత రిపోర్టు వచ్చింది. అయితే శవాన్ని అధికారులు ఎటువంటి సమాచారం లేకుండానే కుటుంబసభ్యులకు అందించడంతో పలువురు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని గుర్తించి పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు 15 మంది వరకూ ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచారు. వ్యాధి నిర్ధారణ కోసం వారి శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు జిల్లా ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


దీంతో వారు నివాసాలున్న రామ్‌నగర్‌, జీసెస్‌నగర్‌, సాయినగర్‌, మారుతీనగర్‌ ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... దిగ్బంధించారు. ఆయా ప్రాంతాల్లో జనసంచారం లేకుండా రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసులు ఆయా ప్రాంతాల్లో పహారా కాస్తూ రాకపోకలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది కుటుంబాల సభ్యులతో పాటు వారితో కలిసి ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ వైద్యులు, నర్సులతో సంబంధాలు ఉన్న వారి కోసం వేట మొదలు పెట్టారు. వారు ఎక్కడ ఉన్నారు? వారితో కలిసి ఉన్న వారెవరూ, కుటుంబసభ్యులు వారు ఇతరులతో కలిసి సాగారా... తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే వీరికి సన్నిహితంగా ఉన్న పలువురిని గుర్తించి వారిని క్వారంటైన్‌లకు తరలించారు. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిసింది.


మరోవైపు జిల్లా సర్వజనాస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్సలు అందించిన పలువురు వైద్యులు, సిబ్బంది గురువారం కూడా వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ శాంపిళ్లు పంపించారు. హిందూపురంలో కూడా కరోనా బాధితులు పెరిగిపోయారు. దీంతో కేసులు నమోదైన ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించారు. ఆ కేసులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌లకు తరలించి శాంపిల్స్‌ తీసి వ్యాధి నిర్ధారణకు పంపించారు. ఇలా జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగు తోంది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారి శాంపిల్స్‌ ఫలితాలు ల్యాబ్‌ నుంచి ఎలా వస్తాయోనని అందరిలో టెన్షన్‌ మొదలైంది.


ఇది అంటు వ్యాధి కావడంతో సన్నిహితంగా మెలిగిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని యంత్రాంగం టెన్షన్‌ పడుతోంది. ఒకవేళ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపైనా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్‌ ఆయా శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. వైద్యశాఖ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలు నియంత్రణ చర్యల్లో మునిగితేలారు.  


Updated Date - 2020-04-10T11:04:41+05:30 IST