మా నాన్నతో సహా అనేక మందికి ప్రేరణ గాంధీజీ : నేతాజీ కుమార్తె

ABN , First Publish Date - 2021-11-17T21:43:07+05:30 IST

నేతాజీ సుభాశ్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మధ్య

మా నాన్నతో సహా అనేక మందికి ప్రేరణ గాంధీజీ : నేతాజీ కుమార్తె

న్యూఢిల్లీ : నేతాజీ సుభాశ్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మధ్య సంబంధాలు సవాళ్లతో కూడినవని నేతాజీ కుమార్తె అనిత బోస్ ప్ఫఫ్ చెప్పారు. ఓ టీవీ చానల్‌తో ఆమె మాట్లాడుతూ, తాను నేతాజీని నియంత్రించలేనని గాంధీజీ భావించారని, కానీ తన తండ్రి మాత్రం గాంధీజీని అమితంగా ప్రేమించేవారని తెలిపారు. బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరినపుడు అనిత ఈ విధంగా స్పందించారు.




నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌ను  బ్రిటిషర్లకు అప్పగించడానికి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ సిద్ధమయ్యారని కంగన రనౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలని కోరినపుడు అనిత బోస్‌ మాట్లాడుతూ, భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ, గాంధీజీ గొప్ప హీరోలని తెలిపారు. ఒకరు లేకపోతే మరొకరు ఉండేవారు కాదన్నారు. వీరిద్దరిదీ ఓ కాంబినేషన్ అన్నారు. కేవలం అహింసా విధానం మాత్రమే భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని చాలా కాలం నుంచి కాంగ్రెస్ చెప్తోందని, ఇది సరికాదని, దేశానికి స్వాతంత్ర్యం రావడంలో నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) పాత్ర కూడా ఉన్నట్లు మనందరికీ తెలుసునని తెలిపారు. అదేవిధంగా నేతాజీ, ఐఎన్ఏ మాత్రమే స్వాతంత్ర్యం తీసుకొచ్చాయని చెప్పడంలోనూ అర్థం లేదని అన్నారు. గాంధీజీ అనేక మందికి ప్రేరణ అని, ఆయన నుంచి ప్రేరణ పొందినవారిలో నేతాజీ ఒకరని తెలిపారు. 


కంగన రనౌత్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. నేతాజీ సుభాశ్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు మహాత్మా గాంధీ మద్దతు ఇవ్వలేదన్నారు. ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపించడం వల్ల వచ్చేది కేవలం భిక్ష మాత్రమేనని, స్వాతంత్ర్యం కాదని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-17T21:43:07+05:30 IST