కెనడాలో ఢిల్లీ.. ఆస్ట్రేలియాలో థానే.. ఆశ్చర్యంగా ఉందా.. అయితే చదవండి

ABN , First Publish Date - 2021-09-04T23:34:14+05:30 IST

గురుతేజ్ సింగ్ ఢిల్లీలో ఉంటాడు. భారత రాజధాని ఢిల్లీలో కాదు.. కెనడాలోని ఢిల్లీలో. సుష్మాదేవి లక్నోలో నివశిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాదు.. అమెరికాలోని లక్నోలో. ఇమ్రాన్ థానేలో..

కెనడాలో ఢిల్లీ.. ఆస్ట్రేలియాలో థానే.. ఆశ్చర్యంగా ఉందా.. అయితే చదవండి

గురుతేజ్ సింగ్ ఢిల్లీలో ఉంటాడు. భారత రాజధాని ఢిల్లీలో కాదు.. కెనడాలోని ఢిల్లీలో. సుష్మాదేవి లక్నోలో నివశిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాదు.. అమెరికాలోని లక్నోలో. ఇమ్రాన్ పాట్నాలో నివాసం ఉంటున్నాడు. బిహార్ రాజధాని పాట్నాలో కాదు.. స్కాట్‌‌ల్యాండ్‌లోని పాట్నాలో. అంతా అయోమయంగా ఉందా..? భారతదేశంలోని ప్రముఖ నగరాలను వేరే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయని చెబుతున్నానేంటని ఆశ్చర్యం కలుగుతోందా..? కానీ నిజంగానే ఈ నగరాల పేర్లతోనే ఆయా దేశాల్లో కూడా ప్రాంతాలున్నాయి. నమ్మకం కుదరడం లేదా..? అయితే డీటెయిల్డ్‌గా చెబుతాను తెలుసుకోండి.


ఢిల్లీ:

భారతదేశ రాజధాని, ప్రపంచంలోని అత్యుత్తమమైన నగరాల్లో ఒకటి. కానీ ఢిల్లీ పేరుతో కెనడాలో ఓ ప్రాంతం ఉంది. అక్కడి ఒంటారియో నగరంలోని ఓ ప్రాంతానికి ఢిల్లీ అని పేరు పెట్టుకున్నారు అక్కడి ప్రజలు. అయితే స్పెల్లింగ్ ఒకటే అయినా.. ఆ ప్రాంతాన్ని ఢిల్లీ అని కాకుండా డెల్-హై అని పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. అంతేకాదు ఈ ప్రాంతానికి కెనడా దేశంలోనే ఏంతో ప్రఖ్యాతి ఉంది. ‘హార్ట్ ఆఫ్ ద టొబాకో కంట్రీ’ చెప్పుకుంటారు.


పాట్నా:

భారత చరిత్రలో పాట్నాకు ఎంతో ప్రఖ్యాతి ఉంది. ఒకానొక సమయంలో దేశంలోనే ధనవంతమైన నగరంగా పాట్నాకు పేరుంది. ప్రపంచ చరిత్రలో ఎంతో గొప్ప ఖగోళశాస్త్రజ్ఞునిగా పేరుగడించిన ఆర్యభట్ట వంటి ఎంతోమంది మేధావులు ఈ నగరంలోనే జన్మించారు. ఈ ప్రాంతం పేరు మీదనే స్కాట్‌ల్యాండ్‌లోని ఓ ప్రాంతానికి కూడా పాట్నా అని పేరు పెట్టారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు పాలించిన సమయంలో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసి విల్లియమ్ ఫుల్లర్టాన్ అనే వ్యక్తి ఈ గ్రామానికి పాట్నా పేరు పెట్టారు.


లక్నో: 

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పేరు కూడా అమెరికాలోని ఓ ప్రాంతానికుంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం లక్నో. ఈ ప్రాంతం మొత్తం 5,500 ఎకరాల్లో ఉన్న బారీ ఎస్టేట్ మ్యాన్షన్ ఇక్కడుంది. అప్పటికాలంలో అత్యంత ధనవంతులైన భారతీయ నవాబుల పేరుమీదనే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.


కొచ్చి:

కేరళలోని ప్రధాన ఓడరేవు నగరం కొచ్చి. పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి బీచ్‌లు, పచ్చదనం నిజంగా ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే కొచ్చి పేరుతోనే జపాన్‌లో కూడా ఓ నగరం ఉంది. ఈ ప్రాంతం కూడా సముద్రం ఒడ్డునే ఉంది. నిజానికి ఇది ఓ కోట, దాని చుట్టూ ఉన్న ప్రాంతం. టోసా ప్రావిన్స్‌లోని కొచ్చి కోట పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.


థానే:

అందమైన బీచ్‌లు, సందడిగా ఉండే తినుబండారాల దుకాణాలు, ఎన్నో చూడదగిన ప్రదేశాలతో బిజీబిజీగా ఉంటుంది మహారాష్ట్రలోని థానే నగరం. అయితే ఆస్ట్రేలియా దేశంలో కూడా ఓ థానే నగరం ఉంది. ఇది మన థానేకి పూర్తిగా భిన్నం. పెద్ద పెద్ద నగరాలకు దూరంగా క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ గ్రామీణ నగరం థానే. ఇది ప్రశాంతంగా ఉంటుంది.


బరోడా:

గుజరాత్‌లో ప్రధాన నగరం బరోడా. అయితే అమెరికాలో కూడా బరోడా పేరుతో ఓ గ్రామం ఉంది. 1.7 కిలోమీటర్ల విస్త్రీర్ణంలో మైఖెల్ హౌసర్ అనే వ్యక్తి ఈ గ్రామాన్ని అప్పట్లో నిర్మించాడు. నిజానికి ఈ గ్రామానికి పొమొనా అనే పేరు పెట్టాలని మైఖెల్ భావించాడట. కానీ అప్పటికే ఆ పేరు వేరే ప్రాంతానికి ఉండడం ఏ పేరు పెట్టాలా అని ఆలోచనలో పడ్డాడట. ఆ గ్రామానికి రెయిల్ రోడ్ నిర్మిస్తున్న ఇంజనీర్ సీహెచ్ పిండార్‌‌కు ఈ విషయం తెలిసింది. పిండార్ భారత్‌లోని బరోడాలో జన్మించారు. దీంతో అదే పేరును మైఖెల్‌కు సూచించారు. అలా ఈ గ్రామానికి బరోడా అనే పేరు వచ్చింది.


మనదేశంలో గొప్ప నగరాల పేర్లతో వేరే దేశాల్లో ప్రాంతాలు ఉండడమే కాదు.. వేరు వేరు దేశాల్లోని ప్రముఖ నగరాల పేర్లతో మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలు, గ్రామాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలి:

ఇండోనేషియాలోని ప్రధాన నగరం బాలి. అద్భుతమైన సముద్రతీర నగరం ఇది. పచ్చదనంతో విలసిల్లుతూ గొప్ప పర్యాటక ప్రాంతంగా బాలీకి పేరుంది. అయితే ఈ ప్రాంతానికి పూర్తి భిన్నంగా ఉంటుంది రాజస్థాన్‌లోని బాలి అనే కుగ్రామం. అక్కడి పాలి జిల్లాలో ఈ కుగ్రామం ఉంది.


ఢాకా:

బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నగరంగా ఉన్న ఢాకా, ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఏర్పడిన తర్వాత ఆ ప్రాంత రాజధానిగా మారింది. అయితే భారత్‌లోని బీహార్‌లో కూడా ఓ ఢాకా ఉంది. ఈ ప్రాంతంలో బీహార్ శాసన మండలి కూడా ఉండడం విశేషం.


వీటితో పాటు హైదరాబాద్, ఫరీద్‌కోట్, సాలెమ్ వంటి భారతీయ నగరాల పేర్లతో కూడా ఇతర దేశాల్లో ప్రాంతాలున్నాయి. తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ పేరుతో పాకిస్తాన్‌లోనూ ఓ నగరం ఉంది. అలాగే పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ పేరుతోనూ పాకిస్తాన్‌లో ఓ ప్రాంతం ఉంది. ఇక తమిళనాడులో సాలెమ్ పేరుతోనే అమెరికాలో మరో ప్రాంతం ఉంది. 


Updated Date - 2021-09-04T23:34:14+05:30 IST