ఎందరో మహానుభావులు

ABN , First Publish Date - 2022-08-11T05:25:57+05:30 IST

సహాయ నిరాకరణోద్యమం.. విదేశీ వస్త్ర బహిష్కరణ.. శాసన ఉల్లంఘనోద్యమం.. ఉప్పు సత్యాగ్రహం.. క్విట్‌ ఇండియా.. ఇలా స్వాతంత్య్ర సముపార్జనకు జాతీయ నాయకులు పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ జిల్లా ప్రజలు భాగస్వాములయ్యారు. అందులో కొందరు ఆ సంగ్రామాలకు నాయకత్వం వహించారు.

ఎందరో మహానుభావులు
కుటుంబ సభ్యులతో బుచ్చి అప్పారావు(ఫైల్‌)


బ్రిటీష్‌ వారికి ఎదురొడ్డిన సమరయోధులు
జాతీయ నాయకుల అడుగుజాడల్లో తాము సైతం
జైలు జీవితం అనుభవించిన జిల్లా వారెదందరో


సహాయ నిరాకరణోద్యమం.. విదేశీ వస్త్ర బహిష్కరణ.. శాసన ఉల్లంఘనోద్యమం.. ఉప్పు సత్యాగ్రహం.. క్విట్‌ ఇండియా.. ఇలా స్వాతంత్య్ర సముపార్జనకు జాతీయ నాయకులు పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ జిల్లా ప్రజలు భాగస్వాములయ్యారు. అందులో కొందరు ఆ సంగ్రామాలకు నాయకత్వం వహించారు. మేముసైతం అంటూ మద్దతు పలికారు. ఆందోళనలనకు ముందుకొచ్చి జైలు జీవితం అనుభవించారు. ఆ ప్రయాణంలో బ్రిటీష్‌ వారి నుంచి ఎన్ని అణచివేతలు ఎదురైనా వెరవకుండా.. వెనుచూడకుండా ముందుకు నడిచారు. మనకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారు. వారి నిస్వార్థ జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
స్వాతంత్య్ర సమరంలో జాతీయ నాయకుల పిలుపునందుకున్న జిల్లా వాసులు ఎంతో మంది ఆ సంగ్రామంలో బ్రిటీష్‌వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. వీరోచితంగా పోరాడారు. అలుపెరుగకుండా శ్రమించి ప్రాణాలర్పించారు. కొందరు జైలు జీవితం అనుభవించారు. తెల్లవారు విధించిన శిక్షలను పంటిబిగువున తట్టుకుంటూ స్వాతంత్య్ర ఫలాల కోసం సుదీర్ఘ పోరాటాలు చేశారు. సమాచార వ్యవస్థ లేని ఆ రోజుల్లో స్వాతంత్య్రం కోసం గ్రామాలు, పట్టణాల ప్రజలు ఒక్కటయ్యేవారు. ఎవరికి వారుగా స్థానిక నాయకత్వాల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, గుజరాత్‌, విశాఖలో జరిగిన వివిధ సమావేశాల్లో దేశ నాయకులిచ్చిన పిలుపునందుకుని వారి బాట నడిచారు. ప్రజలను పోరాటాలవైపు నడిపించి స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించేందుకు జిల్లా నాయకులు అనేక మంది కృషి చేశారు. స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ కేంద్రం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.

తెలుగు జర్నల్‌కు ఎడిటర్‌గా..
మాతృభూమి జాతీయ తెలుగు జర్నల్‌కు ఎడిటర్‌గా పనిచేసిన విజయనగరానికి చెందిన పశుమర్తి వీరభద్రస్వామి స్వాతంత్ర పోరాటాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. 1932లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 1940లో ఒక ఏడాది పాటు జైలుజీవితం అనుభవించారు. వెల్లూరు, తిరుచునాపల్లి, మద్రాస్‌ జైళ్లలో ఉన్నారు.  ఈయన ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా 1932లో పనిచేశారు. విజయనగరంలో 1890 ఏప్రిల్‌ 12న జన్మించిన ఈయన విశాఖ జిల్లా గ్రామీణ పరిశ్రమలు సొసైటీ డైరెక్టర్‌గా, విజయనగరం ఖాదీ స్టోర్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆంధ్రా సాహ్యి సమ్మేళన్‌ అఽధ్యక్షులుగా, విజయనగరం మునిసిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా పనిచేశారు. విశాఖ జిల్లా హరిజన సేవక్‌ సంఘ్‌ అధ్యక్షునిగా సేవలందించారు. 1964 ఫిబ్రవరి 14న మృతి చెందారు.

సహాయ నిరాకరణ ఉద్యమంలో
స్వాతంత్య్ర సమరయోధుడు తాతా దేవకీనందరావు 1907లో విజయనగరంలో జన్మించారు. న్యాయవాదిగా పనిచేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1932 సెప్టెంబరు 6న జైలుకు వెళ్లారు. ఏడాది పాటు కారాగార శిక్ష అనుభవించారు. బరంపురం, బళ్లారి జైళ్లలో ఉన్నారు. ఈయన విజయనగరం మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 1987జూలై 29న మృతి చెందారు.

బుచ్చి అప్పారావుకు గురుతుగా..
విజయనగరం-విశాఖ జిల్లా ప్రజలకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రెపాటి బుచ్చి అప్పారావు పేరు ఖరారు కానుంది. సుమారు 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు బుచ్చి అప్పారావు పేరు పెట్టేందుకు జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. విజయనగరం జిల్లా జామి మండలం విజనగిరి గ్రామానికి చెందిన అప్పారావు వ్యవసాయ కుటుంబంలో 1913లో జన్మించారు. యుక్త వయసు నుంచే ప్రజా సమస్యలపై స్పందిస్తుండేవారు. వ్యక్తిగతంగా సత్యాగ్రహం చేసినందుకు బ్రిటీష్‌ వారు రూ.50 అపరాధ రుసుం విధించారు. 1941 మార్చి 10న అల్లిపురం జైలులో పెట్టారు. ఆరునెలల పాటు జైలు జీవితం అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల జిల్లా అధ్యక్షునిగా సేవలు అందించారు. 1989 ఆగస్టు 19న మరణించారు. తాటిపూడి జలాశయం నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకు గుర్తుగా ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నారు.

పోరాటాలకు తానుసైతం
జిల్లాకు చెందిన కడిమిశెట్టి రామమూర్తి 1889లో విజయనగరంలో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1922 ప్రాంతంలో విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా షాపులోని విదేశీ వస్త్రాలను రోడ్డుపై వేసి నిప్పుపెట్టారు. జిల్లా కార్ప్స్‌ కార్యకర్తగా చేరి 1922 జనవరిలో ఆరునెలల జైలు శిక్షణను రాజమండ్రి జైల్లో అనుభవించారు. ఖాదీ వినియోగంపై విస్తృత ప్రచారం చేశారు. స్వాతంత్రం రాకముందే 1945 ఏప్రిల్‌ 1న మరణించారు.

తెగువతో ఎదురొడ్డి
బొబ్బిలి ప్రాంతానికి చెందిన గోన సీతారామస్వామి 1902లో జన్మించారు. హిందీ తెలియడంతో కీలక నేతలతో సంభాషించేవారు. 1932లో జరిగిన కలకత్తా కాంగ్రెస్‌ సభకు హాజరయ్యారు. అయితే ఈ సభను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ సమావేశం నిర్వహించిన కారణంగా జరిగిన లాఠీచార్జీలో సీతారామస్వామి గాయపడ్డారు. 1932లో గుంటూరులో జరిగిన ఆంధ్రా పొలిటికల్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనిని కూడా బ్రిటీష్‌ వారు నిషేధించారు. ఆ సందర్భంలో పట్టుబడి జైలుకు వెళ్లారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర శాసన సభ్యునిగా 1946-52 మధ్య పనిచేశారు.

ఉప్పు సత్యాగ్రహంలో కూర్చొని
కూనిశెట్టి వెంకటనారాయణదొర 1907లో జన్మించారు. 1922 జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో విదేశీ వస్తువులను దహనం చేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో విశాఖలో పాల్గొని జైలుకు వెళ్లారు. ఆరునెలల పాటు జైల్లో ఉన్నారు. 1932లో గుంటూరులో జరిగిన ఆంధ్రా పొలిటికల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లి జైలు పాలయ్యారు. విశాఖ డిస్ట్రిక్ట్‌ పొలిటికల్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్లి పట్టుబడి ఏడాది పాటు జైలు జీవితం అనుభవించారు. 1940-42 మధ్య జమిందారీ వ్యవస్థ రద్దుకోసం పోరాటం చేశారు. 1938లో డిస్ట్రిక్ట్‌ బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952-55 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.



Updated Date - 2022-08-11T05:25:57+05:30 IST